గురువారం 26 నవంబర్ 2020
Sports - Oct 25, 2020 , 02:31:08

వారెవ్వా వరుణ్‌

వారెవ్వా వరుణ్‌

  • ఐదు వికెట్లతో అదరగొట్టిన చక్రవర్తి 
  • ఢిల్లీపై కోల్‌కతా విజయం

కత్తిలాంటి జట్టు ఉన్నా.. కలిసిరాక సతమతమవుతున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఎట్టకేలకు స్థాయికి తగ్గ ప్రదర్శన చేసింది. మొదట బ్యాటింగ్‌లో దంచికొట్టిన మోర్గాన్‌ సేన.. ఆనక బౌలింగ్‌లో ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేసింది. పాతకాపు సునీల్‌ నరైన్‌ బ్యాట్‌తో మెరుపులు మెరిపిస్తే.. నితీశ్‌ రాణా నిలకడైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇక బౌలింగ్‌ టాప్‌ కూల్చి కమిన్స్‌ కంగారెత్తిస్తే.. వరుణ్‌ చక్రవర్తి తన లెగ్‌ స్పిన్‌తో మిడిలార్డర్‌ను బెంబేలెత్తించాడు. ఈ గెలుపుతో కోల్‌కతా ప్లే ఆఫ్స్‌ వైపు మరో అడుగు ముందుకు వేయగా.. ఆరంభంలో అదరగొట్టి అగ్రస్థానానికి చేరిన ఢిల్లీ వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. 

అబుదాబి: లీగ్‌లో పడుతూ లేస్తూ సాగుతున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సరైన సమయంలో సమిష్టిగా సత్తాచాటి అత్యవసర విజయాన్ని ఖాతాలో వేసుకుంది. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 59 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 194 పరుగులు చేసింది. నితీశ్‌ రాణా (53 బంతుల్లో 81; 13 ఫోర్లు, ఒక సిక్సర్‌) అదరగొట్టగా.. సునీల్‌ నరైన్‌ (32 బంతుల్లో 64; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఢిల్లీ బౌలర్లలో నోర్జే, రబాడ, స్టొయినిస్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ ఆకట్టుకోలేకపోయింది. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 135 పరుగులకే పరిమితమైంది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌'వరుణ్‌ చక్రవర్తి (5/20), కమిన్స్‌ (3/17) ధాటికి శ్రేయస్‌ అయ్యర్‌ (47), పంత్‌ (27) మినహా తక్కినవాళ్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. 

బాధను దిగమింగి..

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు శుభారంభం దక్కలేదు. గిల్‌ (9), రాహుల్‌ త్రిపాఠి (13), కార్తీక్‌ (3) విఫలమవడంతో ఆ జట్టు 42 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కొత్త ఓపెనర్‌ నితీశ్‌ రాణా, నరైన్‌ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. శుక్రవారం రాణా మామయ్య మృతిచెందడంతో ఆ బాధను పంటిబిగువున పట్టుకొని అద్భుత ఇన్నింగ్స్‌తో అలరించాడు. మరో ఎండ్‌లో నరైన్‌ ధాటిగా ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఈ క్రమంలో రాణా 35 బంతుల్లో.. నరైన్‌ 24 బంతుల్లో అర్ధశతకాలు పూర్తి చేసుకున్నారు. ఫిఫ్టీ అనంతరం తన మామయ్య సురీందర్‌ పేరుతో ఉన్న జెర్సీని చూపుతూ భావోద్వేగానికి గురయ్యాడు.  

సంక్షిప్త స్కోర్లు

కోల్‌కతా: 194/6 (నితీశ్‌ రాణా 81, నరైన్‌ 64; నోర్జే 2/27, రబాడ 2/33), 

ఢిల్లీ: 135/9 (అయ్యర్‌ 47; వరుణ్‌ చక్రవర్తి 5/20, కమిన్స్‌ 3/17).