బుధవారం 02 డిసెంబర్ 2020
Sports - Nov 07, 2020 , 02:29:27

మార్పులే ముంచాయా..

మార్పులే ముంచాయా..

ప్రతి సీజన్‌ మాదిరిగానే ‘ఈ సాలా కప్‌ నమదే’ (ఈసారి కప్‌ మనదే) అంటూ లీగ్‌లో అడుగుపెట్టిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు.. ఆరంభంలో అదరగొట్టినా.. చివరి దశ కొచ్చేసరికి ఆకట్టుకోలేకపోయింది. ప్లే ఆఫ్స్‌కు ముందు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిన కోహ్లీ సేన.. కీలకమైన ఎలిమినేటర్‌లో మితిమీరిన మార్పులకు మూల్యం చెల్లించుకుంది. హ్యాట్రిక్‌ విజయాలతో ప్లే ఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్‌తో పోరులో కోహ్లీ నాలుగు మార్పులు చేశాడు. మోరిస్‌,  ఫిలిప్‌, ఉడాన, షహబాజ్‌లను పక్కనపెట్టి.. వారి స్థానాల్లో ఫించ్‌, జంపా, మొయిన్‌ అలీ, నవ్‌దీప్‌ సైనీలను తుదిజట్టులోకి తీసుకున్నాడు. దీనికి తోడు ఈ సీజన్‌లో తొలిసారి కోహ్లీ స్వయంగా ఓపెనింగ్‌కు వచ్చాడు. ఈ ప్రయోగాలేవి ఫలించకపోవడంతో బెంగళూరు మరోసారి ఉత్తచేతులతోనే వెనుదిరిగింది. పుష్కర కాలంగా బలమైన జట్టుతో బరిలో దిగుతున్న బెంగళూరు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్‌ ముద్దాడలేకపోయింది. కరోనా కారణంగా ఈ సారి వేదిక దుబాయ్‌కు మారడంతో తమ తలరాత కూడా మారుతుందని బెంగళూరు అభిమానులు బలంగా విశ్వసించారు. అయితే నాలుగేండ్ల క్రితం తమను తుదిమెట్టుపై బోల్తా కొట్టించిన సన్‌రైజర్స్‌.. ఈ సారి ఎలిమినేటర్‌లోనే ఇంటిదారి పట్టించింది. ఇదిలా ఉంటే.. గురువారం రాత్రి కోహ్లీ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనడమే ఈ పరాజయానికి ప్రధాన కారణమంటూ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ఆర్‌సీబీని విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు.