బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Feb 25, 2020 , 23:42:29

ఆసియా ఎలెవెన్‌లో కోహ్లీ

 ఆసియా ఎలెవెన్‌లో  కోహ్లీ

జట్టులో మరో ఐదుగురు భారత క్రికెటర్లు 

ఢాకా: బంగ్లాదేశ్‌ జాతిపిత(బంగబంధు) షేక్‌ ముజిబుర్‌ రెహమాన్‌ వందో జయంతి సందర్భంగా వరల్డ్‌ ఎలెవెన్‌తో ఆసియా ఎలెవెన్‌ జట్టు మార్చిలో మూడు అంతర్జాతీయ టీ20లు ఆడనుంది. బంగ్లా వేదికగా జరిగే ఈ మ్యాచ్‌ల కోసం ఆసియా ఎలెవెన్‌ జట్టును బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు(బీసీబీ) మంగళవారం ప్రకటించింది. టీమ్‌ఇండియా నుంచి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో పాటు బ్యాట్స్‌మెన్‌ శిఖర్‌ ధవన్‌, కేఎల్‌ రాహుల్‌, వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌, పేసర్‌ మహమ్మద్‌ షమీ, స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ జట్టులో ఉన్నారు. ఈ సిరీస్‌లో జరిగే మూడు టీ20ల్లో కోహ్లీ ఆడాలని బీసీబీ భావిస్తుండగా... ఇప్పటికే విరామం లేకుండా ఆడుతున్న అతడు ఒక్క మ్యాచ్‌కే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. 


ఈ విషయంపై బీసీసీఐ ఇంకా తుదినిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం కివీస్‌ పర్యటనలో ఉన్న టీమ్‌ఇండియా... మార్చి 12 నుంచి 18 వరకు దక్షిణాఫ్రికాతో స్వదేశంలో మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది. ఐపీఎల్‌ 29న ప్రారంభం కానుంది. దీంతో ఈ ప్రత్యేక సిరీస్‌ కోసం ఆటగాళ్ల అందుబాటుపై అనుమానాలు తలెత్తడంతో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఇటీవలే స్పందించాడు. ఆసియా ఎలెవెన్‌ తరఫున ఆడేందుకు నలుగురు లేదా ఐదుగురు భారత ఆటగాళ్లను పంపిస్తామని స్పష్టం చేశాడు. మరోవైపు దక్షిణాఫ్రికా మాజీ సారథి డుప్లెసిస్‌ నాయకత్వం వహిస్తున్న వరల్డ్‌ ఎలెవెన్‌లో క్రిస్‌ గేల్‌, పొలార్డ్‌, బెయిర్‌స్టో లాంటి స్టార్లు ఉన్నారు. 

logo