గురువారం 26 నవంబర్ 2020
Sports - Oct 03, 2020 , 19:22:56

చెలరేగిన కోహ్లీ.. బెంగళూరు ఘన విజయం

చెలరేగిన కోహ్లీ.. బెంగళూరు ఘన విజయం

అబుదాబి: ఐపీఎల్‌-13లో విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు హవా కొనసాగుతోంది.  అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన బెంగళూరు జట్టు రాజస్థాన్‌ రాయల్స్‌పై  8  వికెట్ల  తేడాతో   గెలిచి సీజన్‌లో వరుసగా  రెండో విజయాన్ని నమోదు చేసింది.  బ్యాటింగ్‌, బౌలింగ్‌లో పేలవ ప్రదర్శన కనబర్చిన రాజస్థాన్‌ వరుసగా రెండో మ్యాచ్‌ను  ఓటమితో  ముగించింది.

దేవదత్‌ పడిక్కల్‌(63: 45 బంతుల్లో 6ఫోర్లు, సిక్స్‌), కోహ్లీ(72 నాటౌట్:‌ 53 బంతుల్లో 7ఫోర్లు, 2సిక్సర్లు) అర్ధశతకాలతో రాణించడంతో 155 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు 19.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి   ఛేదించింది. స్వల్ప లక్ష్యాన్ని బెంగళూరు అలవోకగా ఛేదించింది. పడిక్కల్‌, కోహ్లీ నిలకడైన ఆటతీరుతో బెంగళూరును  విజయం వైపు నడిపించారు. సీజన్‌లో  వరుసగా  నాలుగు మ్యాచ్‌లు ఆడిన  పడిక్కల్‌ మూడు అర్ధశతకాలు బాదడం విశేషం. 

అంతకుముందు చాహల్‌(3/24) , ఇసురు ఉడానా(2/41)  బౌలింగ్‌ ధాటికి   ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌  20 ఓవర్లలో   6 వికెట్లకు 154 పరుగులు చేసింది.  రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌లో  20ఏండ్ల మహిపాల్‌ లామ్రోర్‌(47: 39 బంతుల్లో 1ఫోర్‌, 3సిక్సర్లు) ‌  ఒక్కడే  బెంగళూరు బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోగలిగాడు. మహిపాల్‌ మినహా అందరూ దారుణంగా విఫలమయ్యారు. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌ను పేలవంగా ఆరంభించింది.  ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి 31 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకుంది. మరోఎండ్‌లో సహకరించేవారు లేకున్నా మహిపాల్‌ మాత్రం బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.