గురువారం 02 జూలై 2020
Sports - Jun 05, 2020 , 18:21:44

ఆర్జనలోనూ అతడే..

ఆర్జనలోనూ అతడే..

లండన్‌: రాజు ఎక్కడున్నా రాజే అని టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మరోసారి రుజువు చేశాడు. మూడు నెలలుగా క్రికెట్‌ మ్యాచ్‌లు లేక ఇంటికే పరిమితమైనప్పటికీ.. సామాజిక మాధ్యమాల అర్జనలో విరాట్‌ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. లాక్‌డౌన్‌ సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టుల ద్వారా అత్యధికంగా సంపాదించిన టాప్‌-10 క్రీడాకారుల జాబితాలో కోహ్లీ ఆరోస్థానంలో నిలిచాడు. టాప్‌-10లో ఉన్న ఏకైక క్రికెటర్‌ కోహ్లీనే కావడం గమనార్హం. 

మార్చి 12 నుంచి మే 14 వరకు సోషల్‌ మీడియా అర్జన వివరాలను ఓ మేనేజ్‌మెంట్‌ కన్సల్టింగ్‌ కంపెనీ శుక్రవారం ప్రకటించింది. ఈ గడువులో ఇన్‌స్టాగ్రామ్‌లో 3 ఫొటోలు పోస్ట్‌ చేసిన విరాట్‌.. అక్షరాల మూడు కోట్ల 62 లక్షలు మూటగట్టుకున్నాడు. అంటే అతడు పోస్ట్‌ చేసిన ప్రతి ఫొటోకు రూ. 1. 20 కోట్లు సంపాదించాడన్న మాట. ఈ జాబితాలో రూ. 17.21 కోట్లతో ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియనో రొనాల్డో అగ్రస్థానం దక్కించుకోగా.. లియోనెల్‌ మెస్సి (రూ.11.45 కోట్లు), నెయ్‌మార్‌ (రూ. 10.50 కోట్లు) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. బాస్కెట్‌బాల్‌ గ్రేట్‌ షాకిల్‌ ఓ నీల్‌ (రూ.5.57 కోట్లు), ఇంగ్లండ్‌ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ డేవిడ్‌ బెక్‌హమ్‌ (రూ. 3.87 కోట్లు) టాప్‌-5లో చోటు దక్కించుకున్నారు.  


logo