బుధవారం 01 ఏప్రిల్ 2020
Sports - Feb 05, 2020 , 00:08:52

వన్డేల్లో మయాంక్‌.. టెస్టుల్లో పృథ్వీ షా

 వన్డేల్లో మయాంక్‌.. టెస్టుల్లో పృథ్వీ షా
  • రోహిత్‌ స్థానాన్ని భర్తీ చేయనున్న యువ ఆటగాళ్లు..
  • కివీస్‌తో టెస్టు సిరీస్‌కు భారత జట్టు ప్రకటన

హామిల్టన్‌: న్యూజిలాండ్‌తో జరుగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం బీసీసీఐ మంగళవారం జట్టును ప్రకటించింది. 16 మందితో కూడిన ఈ జట్టులో చాన్నాళ్ల తర్వాత పృథ్వీ షా చోటు దక్కించుకుంటే.. శుభ్‌మన్‌ గిల్‌ రిజర్వ్‌ ఓపెనర్‌గా కొనసాగనున్నాడు. రెగ్యులర్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ గాయపడటంతో వన్డే జట్టులో అతడి స్థానంలో మయాంక్‌ అగర్వాల్‌ ఓపెనింగ్‌ చేయనున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో దుమ్మురేపుతున్న లోకేశ్‌ రాహుల్‌ను టెస్టు జట్టుకు ఎంపిక చేయకపోవడం మినహా అంతా ఊహించిన విధంగానే జట్టు ఎంపిక సాగింది. ఇరు జట్ల మధ్య ఈ నెల 21 నుంచి రెండు టెస్టుల సిరీస్‌ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. కివీస్‌ గడ్డపై ఇద్దరు స్పిన్నర్లు చాలనుకున్న సెలెక్టెర్లు కుల్దీప్‌ను పక్కనపెట్టి సీనియర్లు అశ్విన్‌, జడేజాకు అవకాశం ఇచ్చారు. వెటరన్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ గాయ పడ్డా అతడిని జట్టుతో కొనసాగించిన కమిటీ.. బ్యాకప్‌గా యువ పేసర్‌ సైనీకి జట్టులో చోటు కల్పించింది. 


2018 అక్టోబర్‌లో చివరిసారిగా టీమ్‌ఇండియా తరఫున టెస్టు బరిలో దిగిన యువ సంచలనం పృథీ షా ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైనా గాయం కారణంగా స్వదేశానికి తిరిగివచ్చాడు. ఆ తర్వాత 8 నెలల నిషేధం, తిరిగి గాయపడటంతో అతడి భవితవ్యంపై ప్రశ్నలు తలెత్తినా.. తాజాగా రోహిత్‌ శర్మ గాయపడటంతో అతడికి సుదీర్ఘ ఫార్మాట్‌లో మరోసారి అవకాశం దక్కింది. ఇప్పటికే ప్రకటించిన వన్డే జట్టులో తొలిసారి చోటు దక్కించుకున్న షా.. ఇప్పుడు సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ ప్లేస్‌ కొట్టేశాడు. అరంగేట్రం టెస్టులోనే విండీస్‌పై సెంచరీతో చెలరేగిన పృథ్వీ.. ప్రస్తుతం భారత్‌-ఏ జట్టుతో కలిసి న్యూజిలాండ్‌లోనే పర్యటిస్తున్నాడు. 


logo
>>>>>>