గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Jan 28, 2020 , 03:41:06

బ్రయంట్‌ ఇక లేడు 1978 -2020

బ్రయంట్‌ ఇక లేడు 1978 -2020

రెండు దశాబ్దాల పాటు క్రీడాలోకాన్ని తన అసమాన ప్రతిభతో కట్టిపడేసిన బాస్కెట్‌బాల్‌ దిగ్గజం కోబ్‌ బ్రయంట్‌ ఇక లేడనే వార్త యావత్‌ ప్రపంచాన్ని కుదిపివేసింది. ముద్దు ముద్దు మాటలతో మురిపించాల్సిన మూడేండ్ల ప్రాయంలోనే.. బాస్కెట్‌బాల్‌పై మక్కువ కనబర్చిన కోబ్‌ ఆ తర్వాత కోర్టులో అడుగుపెట్టిన ప్రతీసారి తన సూపర్‌ షోతో విశ్వవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. తండ్రి ముద్దుపేరులోని బీన్‌.. అతడి ఇష్టమైన జపాన్‌ బీఫ్‌ వంటకం కోబ్‌ను కలిపి కోబ్‌ బీన్‌ బ్రయంట్‌ పేరుతో కోర్టులో అడుగుపెట్టిన ఈ అమెరికా స్టార్‌.. అభిమానుల మనసుల్లో ‘బ్లాక్‌ మాంబా’గా ముద్రపడ్డాడు. కెరీర్‌ పీక్స్‌లో ఉన్నప్పుడే రిటైర్మెంట్‌ ప్రకటించిన కోబ్‌.. చిన్న వయసులోనే కానరాని లోకాలకు వెళ్లి క్రీడాలోకాన్ని కన్నీటి సంద్రంలో ముంచెత్తాడు.

  • బాస్కెట్‌బాల్‌ లెజెండ్‌ కన్నుమూత
  • హెలికాప్టర్‌ ప్రమాదంలో కూతురు గియానా సహా 9 మంది మృతి
  • దిగ్భ్రాంతిలో క్రీడాలోకం

బాస్కెట్‌బాల్‌ నా జీవితంలో ఓ భాగం కాదు. అదే నా జీవితం. అది నాలో అంతర్భాగం

 

నమస్తే తెలంగాణ క్రీడావిభాగం :తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ.. పసిప్రాయంలోనే కోర్టులో అడుగుపెట్టిన కోబ్‌ చి న్నప్పటి నుంచే సంచలనాలకు కేంద్రబిందువుగా నిలిచాడు. హై స్కూల్‌ లెవల్‌లోనే.. అంతర్జాతీయ స్థాయి ఆట కనబరిచిన అత డు గ్రాడ్యుయేషన్‌ పూర్తికాగానే ప్రొఫెషనల్‌ కెరీర్‌ ప్రారంభించాడు. తండ్రి జోయ్‌ బ్రయంట్‌ (జెల్లీబీన్‌) వద్ద ఆటలో ఓనమా లు నేర్చుకున్న అతడు 1996లో లాస్‌ఏంజెల్స్‌ లేకర్స్‌ తరఫున కెరీర్‌ ప్రారంభించా డు. అప్పటి నుంచి ఇరవై ఏండ్ల పాటు నిరాటంకంగా సాగిన అతడి కెరీర్‌లో లెక్కలేనన్ని ఘనతలు సాధించాడు. ఆరున్నర అడుగుల ఎత్తు.. చురుకైన కండ్లు.. చెదరని చిరునవ్వు.. చూడగానే ఆకట్టుకునే ఆహార్యంతో కట్టిపడేసే కోబ్‌ ఒక్కసారి కోర్టులో అడుగుపెట్టాడంటే.. ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టడం ఖాయం. 2000 నుంచి 2002 వరకు వరుసగా మూడేండ్లు లాస్‌ఏంజెల్స్‌ లేకర్స్‌ ఎన్‌బీఏ చాంపియన్‌షిప్‌ నెగ్గడంలో బ్రయంట్‌ కీలక పాత్ర పోషించాడు. 2006లో టొరంటో రాప్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 81 పాయింట్లు సాధించిన కోబ్‌.. ఎన్‌బీఏ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో అత్యధిక పాయింట్లు సాధించిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. లేకర్స్‌ తరఫున 20 ఏండ్లు ఆడిన అతడు.. 2008లో ఎన్‌బీఏ మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్‌ అవార్డు కైవసం చేసుకోవడంతో పాటు కెరీర్‌లో 18 సార్లు ఆల్‌స్టార్‌గా, 15 సార్లు ఆల్‌ ఎన్‌బీఏ జట్టులో చోటు దక్కించుకున్నాడు.


ప్రొఫైల్‌ 

పూర్తి పేరు:  కోబ్‌ బీన్‌ బ్రయంట్‌

జననం: 23 ఆగస్టు 1978

జట్టు:  లాస్‌ఏంజెల్స్‌ లేకర్స్‌

కెరీర్‌ పాయింట్లు: 33,643

ఘనతలు: 2008 (బీజింగ్‌), 2012 (లండన్‌) 

ఒలింపిక్స్‌లో అమెరికా తరఫున స్వర్ణాలు. 

ఐదుసార్లు (2000, 01, 02, 09, 10) ఎన్‌బీఏ చాంపియన్‌.

ఎన్‌బీఏ ఫైనల్స్‌ మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్‌ (2009, 10)


ఏ మాత్రం అవకాశం లేని చోటు నుంచి కూడా జట్టుకు విజయాన్ని అందిచడంలో సిద్ధహస్తుడైన కోబ్‌ను అతడి అభిమానులు ముద్దుగా.. ‘బ్లాక్‌ మాంబా’అని పిలుచుకుంటారు. వీడ్కోలుకు ముందు బ్రయంట్‌ ఆడిన చివరి మ్యాచ్‌లోనూ 60 పాయింట్లు సాధించి ఔరా అనిపించుకున్నాడు. ఎన్‌బీఏ కెరీర్‌లో 1,346 గేమ్స్‌ ఆడిన బ్రయంట్‌.. 7,047 రిబౌన్డ్స్‌, 6,306 అసిస్ట్స్‌తో మొత్తం 33,643 పాయింట్లు సాధించాడు. ప్లేయర్‌గా బాస్కెట్‌బాల్‌కు దూరమైనా.. కోచ్‌గా మాత్రం తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. చనిపోవడానికి ముందు రోజు తన ఎన్‌బీఏ కెరీర్‌ పాయింట్ల రికార్డును అధిగమించిన లేబ్రోన్‌ జేమ్స్‌ను అభినందిస్తూ.. బ్రయంట్‌ చివరి ట్వీట్‌ చేశాడు. ‘జేమ్స్‌.. నువ్వు ఇలానే దూసుకెళ్లాలి. నిన్ను చూస్తే గర్వం గా ఉంది సోదరా’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించాక రచయిత అవతారం ఎత్తిన కోబ్‌.. చిన్న పిల్లల కథల పుస్తకాలు రాయడంతో పాటు ‘డియర్‌ బాస్కెట్‌బాల్‌' లఘు చిత్రానికి కథ అందించాడు. దానికి 2018లో  ఆస్కార్‌ అవార్డు లభించింది. 


లాస్‌ ఏంజెల్స్‌: బాస్కెట్‌బాల్‌ దిగ్గజం, అమెరికా స్టార్‌ కోబ్‌ బీన్‌ బ్రయంట్‌ (41) హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందాడు. కాలిఫోర్నియాలోని లాస్‌ఏంజెల్స్‌లో జరిగిన ఈ ఘటనలో కోబ్‌, అతడి పదమూడేండ్ల కుమార్తె గియానా సహా మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 9 గంటల 47 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగింది. వాతావరణం అనుకూలించకపోవడంతో కోబ్‌ ప్రయాణిస్తున్న సొంత హెలికాఫ్టర్‌ (సికోర్‌స్కై ఎస్‌-76 బి) లాస్‌ఏంజెల్స్‌ పశ్చిమ దిశలోని కాలబసాస్‌ ప్రాంతంలో ఓ కొండను ఢీకొట్టి మంటల్లో చిక్కుకుపోయింది. దీంతో అందులో ఉన్న 9 మంది అగ్నికి ఆహుతయ్యారు. కూతురు ఆడనున్న మ్యాచ్‌ను వీక్షించేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. హెలికాప్టర్‌ గాల్లోకి లేచిన నిమిషాల వ్యవధిలోనే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని స్థానిక అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతం దట్టమైన అడవిలో ఉండటంతో మరణ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. హెలికాప్టర్‌లో ఎనిమిది మంది ప్రయాణికులు, ఒక పైలట్‌ ఉన్నారని వారు ధ్రువీకరించారు. మృతుల్లో మరో ఆటగాడు, అతడి కుటుంబ సభ్యులు, కోచ్‌ ఉన్నట్లు సమాచారం. బ్రయంట్‌కు భార్య వనెస్సా, నలుగురు పిల్లలు ఉన్నారు. 

1978లో ఫిలడెల్ఫియాలో జన్మించిన బ్రయంట్‌.. తన 20 ఏండ్ల అద్వితీయ కెరీర్‌కు నాలుగేండ్ల క్రితం (2016) రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అమెరికా జాతీయ జట్టు తరఫున రెండు ఒలింపిక్స్‌ స్వర్ణాలు (2008, 2012) నెగ్గిన ఈ 41 ఏండ్ల  దిగ్గజం ఐదు సార్లు ఎన్‌బీఏ చాంపియన్‌, రెండుసార్లు ఎన్‌బీఏ ఫైనల్స్‌ అత్యుత్తమ ప్లేయర్‌ అవార్డు, నాలుగు సార్లు ఆల్‌స్టార్‌ మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్‌, ఎన్‌బీఏ స్కోరింగ్‌ చాంపియన్‌.. ఇలా లెక్క కు మిక్కిలి ఘనతలను తన పేరిట రాసుకున్నాడు. కెరీర్‌లో 33,643 రేటింగ్‌ పాయిం ట్లు సాధించిన కో బ్‌ మృతిపై అమెరికా అధ్యక్షుడు డొ నాల్డ్‌ ట్రంప్‌ నుం చి టీమ్‌ఇండియా కెప్టెన్‌ కోహ్లీ దాక ప్రపంచంలోని అన్ని దేశాల ప్ర ముఖులు దిగ్భ్రాం తి వ్యక్తం చేశారు. ‘ఎన్‌బీఏ కుటుం బం సర్వనాశనమైనట్లు గోచరిస్తున్నది’అని నేషనల్‌ బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ (ఎన్‌బీఏ) కమిషనర్‌ ఆడమ్‌ సిల్వర్‌ పేర్కొన్నాడంటే బాస్కెట్‌బాల్‌లో అతడి స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు.


నా ఫేవరెట్‌ బాస్కెట్‌బాల్‌ ప్లేయర్‌ కోబ్‌ బ్రయంట్‌, అతడి కుమార్తె మరణ వార్త విని షాక్‌కు గుర య్యా. ఇది ఎంతో బాధాకరమైన విషయం. ఐదు సార్లు ఎన్‌బీఏ చాంపియన్‌, రెండుసార్లు ఎన్‌బీఏ ఫైనల్స్‌ అత్యుత్తమ ప్లేయర్‌ అవా ర్డు, నాలుగు సార్లు ఆల్‌స్టార్‌ మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్‌, ఎన్‌బీఏ స్కోరింగ్‌ చాంపియన్‌ అయిన.. బ్రయంట్‌ ఆత్మకు శాంతి చేకూరాలని, కన్నీటితో ప్రార్థిస్తున్నా. 

- కేటీఆర్‌, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి


కోబ్‌ బ్రయంట్‌ మృతి చెందాడని తెలిసి విషాదంలో మునిగిపోయా. అతడు బాస్కెట్‌బాల్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్‌ ప్లేయర్‌. ఆటకు విశ్రాంతినిచ్చి ఇప్పుడే జీవితాన్ని ప్రారంభించిన అతడికి ఇలా జరగడం విచారకరం. అతడి కుటుంబానికి నా సంతాపం తెలుపుతున్నా.

-ట్రంప్‌, అమెరికా అధ్యక్షుడుకోబ్‌ బాస్కెట్‌బాల్‌ లెజెండ్‌. బ్రయంట్‌తో పాటు అతడి కుమార్తె గియానా కూడా ప్రమాదంలో మరణించడం ఎంతో బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. 

- ఒబామా, అమెరికా మాజీ అధ్యక్షుడు


కోబ్‌ మరణ వార్త నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. చిన్నప్పటి నుంచి కోర్టులో అతడు చేసే విన్యాసాలు చూసి మైమరిచిపోయేవాడిని. జీవితం ఊహించలేనిది. అతడి కుమార్తె కూడా ప్రమాదంలో మరణించిందని తెలిసి నా హృదయం ముక్కలైంది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా.  

- కోహ్లీ,  టీమ్‌ఇండియా కెప్టెన్‌


బ్రయంట్‌ మరణవార్త విని షాక్‌కు గురయ్యా. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నా. 

- సచిన్‌ టెండూల్కర్‌


logo