ఐపీఎల్ వేలం.. ఆ నలుగురు తెలుగు క్రికెటర్ల గురించి మీకు తెలుసా?

హైదరాబాద్: ఐపీఎల్ వేలంలో నలుగురు తెలుగు క్రికెటర్లను ఫ్రాంచైజీలు తమ టీమ్‌లలోకి తీసుకున్నాయి. ఇందులో ఇద్దరు తెలంగాణకు చెందిన వారు కాగా.. మరో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ క్రికెటర్లు. వీళ్లలో ముగ్గురు క్రికెటర్లు పెద్దగా పరిచయం లేకపోయినా.. విశాఖపట్నంకు చెందిన కోన శ్రీకర్ భరత్ మంచి వికెట్ కీపర్, అటాకింగ్ బ్యాట్సమన్ కూడా. అతడు ఇండియా ఎ టీమ్ తరఫున కూడా ఆడాడు. మరి ఈ క్రికెటర్ల గురించి మరిన్ని వివరాలు మీరూ తెలుసుకోండి.
భగత్ వర్మ
ఈ 22 ఏళ్ల పేస్బౌలర్ను ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ తీసుకుంది. 2017 కూచ్ బేహార్ టోర్నీలో 38 వికెట్లతో టాప్ వికెట్ టేకర్‌గా నిలిచిన ఘనత భగత్ వర్మ సొంతం. ఇండియా ఎ టీమ్ తరఫున కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను కూడా తన బౌలింగ్‌తో ఫిదా చేశాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ టూర్‌కు ఎంపికయ్యాడు. అయితే ఆ తర్వాత హైదరాబాద్ సెలక్టర్ల అతన్ని పట్టించుకోలేదు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీకి అతన్ని ఎంపిక చేయని సెలక్టర్లు విజయ్ హజారే టోర్నీకి ఎంపిక చేశారు. ఆరేళ్ల వయసులోనే క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన భగత్ వర్మ.. హైదరాబాద్ టీమ్‌కు అన్ని ఏజ్ గ్రూప్‌లలో ఆడాడు.
యుధ్వీర్ సింగ్ చరక్
జమ్ముకు చెందిన యుధ్వీర్ సింగ్.. క్రికెట్ కెరీర్ కోసమే హైదరాబాద్ వచ్చాడు. అండర్-19 టోర్నీల జమ్ముకశ్మీర్ తరఫున ఆడి ముంబైపై ఐదు వికెట్లు తీసుకున్నాడు. జమ్ములో సరైన క్రికెట్ వసతులు లేకపోవడంతో 2018లో అతడు హైదరాబాద్ వచ్చేశాడు. అండర్ 23 టోర్నీలో ఆడి మధ్యప్రదేశ్‌పై ఐదు వికెట్లు తీశాడు. గత రెండేళ్లుగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ టీమ్స్ నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్నాడు.
కే శ్రీకర్ భరత్
ఆంధ్రాకు చెందిన శ్రీకర్ భరత్.. డాషింగ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్. ఈ 27 ఏళ్ల క్రికెటర్ రంజీ ట్రోఫీలు ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా నిలవడం విశేషం. ఇతన్ని రూ.20 లక్షలకు బెంగళూరు టీమ్ కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఇతడు పంత్, సాహాలకు స్టాండ్‌బైగా ఇండియన్ టీమ్‌తో ఉన్నాడు. గతంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ టీమ్ అతన్ని తీసుకుంది.
మర్రమ్రెడ్డి హరిశంకర్ రెడ్డి
కడప జిల్లాకు చెందిన హరిశంకర్‌రెడ్డి తండ్రి ఓ రైతు. ఆంధ్రా టీమ్ తరఫున అతడు అండర్-19, అండర్-23 టీమ్స్‌లో ఆడాడు. ప్రస్తుతం కడపలోనే అతడు డిగ్రీ చదువుతుండటం విశేషం. ఇతన్ని చెన్నై టీమ్ వేలంలో కొనుగోలు చేసింది.