శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Sports - Sep 13, 2020 , 00:33:54

కలిసొచ్చేనా..

కలిసొచ్చేనా..

మేటి ఆటగాళ్లున్నా.. ఘనాపాఠి సారథులున్నా.. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టుకు ఇప్పటివరకు ఐపీఎల్‌ టైటిల్‌ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. పుష్కరకాలంగా ప్రయత్నిస్తున్నా దక్కని టైటిల్‌ కోసం పంజాబ్‌ ఈసారి గట్టిగానే ప్రయత్నిస్తున్నది. కెప్టెన్‌ లోకేశ్‌ రాహుల్‌, కోచ్‌ అనిల్‌ కుంబ్లే సహా ఐదుగురు కన్నడిగులు కలిసి పంజాబ్‌ను భల్లే.. భల్లే అనిపిస్తారా చూడాలి!

నమస్తే తెలంగాణ క్రీడావిభాగం : అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని అన్న చందంగా.. ప్రతి సీజన్‌లో మెరుగైన వనరులున్నప్పటికీ పంజాబ్‌ జట్టు ఒక్కసారి కూడా టైటిల్‌ నెగ్గలేకపోయింది. 12 సీజన్ల పేరు మీద 12 మంది సారథులను మార్చిన ఫ్రాంచైజీ.. ఈసారి కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్సీలో వేట ప్రారంభించనుంది. కింగ్స్‌ను ముంచాలన్నా.. తేల్చాలన్నా అది పూర్తిగా బ్యాట్స్‌మెన్‌ చేతిలోనే ఉంది. రాహుల్‌, క్రిస్‌ గేల్‌, మయాంక్‌ అగర్వాల్‌, కరుణ్‌ నాయర్‌, మ్యాక్స్‌వెల్‌, నికోలస్‌ పూరన్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌.. ఇలా ఒకరిని మించి ఒకరు ధనాధన్‌ ఆటగాళ్లు ఉన్నా.. బౌలింగ్‌ విభాగం మాత్రం కాస్త బలహీనంగా కనిపిస్తున్నది. మహమ్మద్‌ షమీ తప్ప మరో మంచి బౌలర్‌ అందుబాటులో లేకపోవడం.. మాజీ కెప్టెన్‌ అశ్విన్‌.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారడంతో స్పిన్‌ విభాగం బలహీనపడింది. 

ఇప్పటివరకు 12 సీజన్లు ఆడిన పంజాబ్‌ కేవలం 2014లో మాత్రమే ఫైనల్‌ చేరగలిగింది. అత్యధికసార్లు పట్టికలో చివరి స్థానంతోనే సరిపెట్టుకుంది. సహాయ బృందంలో కుంబ్లే, ఆండీ ఫ్లవర్‌, జాంటీ రోడ్స్‌, లాంగ్‌వెల్ట్‌, వసీం జాఫర్‌ వంటి అనుభవజ్ఞులు ఉండటంతో ఈసారి ప్లే ఆఫ్స్‌ పక్కా అని ఫ్రాంచైజీ యాజమాన్యం ధీమా వ్యక్తం చేస్తున్నది. వేదిక మారడం కింగ్స్‌కు ఏమాత్రం కలిసొస్తుందో చూడాలి.

టాపే బలం..  లోకేశ్‌ రాహుల్‌.. క్రిస్‌ గేల్‌ ఓపెనింగ్‌ ఎంత ధాటిగా ఉంటుందో గత సీజన్‌లోనే తెలిసొచ్చింది. తనదైన రోజున ప్రత్యర్థులను ఉతికి ఆరేసే యూనివర్సల్‌ బాస్‌ గేల్‌.. ఈ సారి కూడా స్థాయికి తగ్గట్లు ఆడితే కింగ్స్‌కు తిరుగులేనట్లే! మయాంక్‌ అగర్వాల్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, నికోలస్‌ పూరన్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌తో మిడిలార్డర్‌ కూడా పటిష్టంగానే కనిపిస్తున్నది. 


logo