గురువారం 29 అక్టోబర్ 2020
Sports - Sep 24, 2020 , 21:27:07

రాహుల్‌ 132 నాటౌట్‌..పంజాబ్‌ భారీ స్కోరు

రాహుల్‌ 132 నాటౌట్‌..పంజాబ్‌ భారీ స్కోరు

దుబాయ్‌: ఐపీఎల్‌-13వ సీజన్‌లో తొలి శతకం నమోదైంది. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌(132 నాటౌట్‌: 69 బంతుల్లో 14ఫోర్లు, 7సిక్సర్లు)‌ అద్భుత సెంచరీతో చెలరేగాడు. బెంగళూరు బౌలర్లపై ఆరంభం నుంచి విరుచుకుపడిన రాహుల్‌ ఐపీఎల్‌ కెరీర్‌లో రెండో శతకం సాధించాడు. రాహుల్‌ అద్వితీయ బ్యాటింగ్‌తో రాణించడంతో పంజాబ్‌ నిర్ణీత ఓవర్లలో  3 వికెట్లకు 206 పరుగులు చేసింది.బెంగళూరు బౌలర్లలో శివమ్‌ దూబే రెండు వికెట్లు పడగొట్టగా..చాహల్‌ ఒక వికెట్‌ తీశాడు. 

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు  ఓపెనర్లు  రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌(26)   మెరుపు ఆరంభాన్ని అందించారు.  ఓపెనింగ్‌ జోడీ చాలా ప్రశాంతంగా బ్యాటింగ్‌ చేస్తూ పరుగులు రాబట్టింది.  ఆరు ఓవర్లకు పంజాబ్‌ వికెట్‌ నష్టపోకుండా  50 పరుగులు చేసింది.  ఈ దశలో బెంగళూరు స్పిన్నర్‌ చాహల్‌.. మయాంక్‌ను బౌల్డ్‌ చేసి తొలి వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీశాడు.  ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన రాహుల్‌ 36 బంతుల్లో  హాఫ్‌సెంచరీ పూర్తి చేశాడు. 

మయాంక్‌ ఔటైన తర్వాత వచ్చిన  నికోలస్‌ పూరన్‌ ఎక్కువ సేపు నిలువలేదు.  మరో ఎండ్‌లో మాత్రం రాహుల్‌ తన ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో దుమ్మురేపాడు. ఈ క్రమంలోనే 62 బంతుల్లోనే 12 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో శతకం సాధించాడు. 100 మార్క్‌ చేరుకున్నాక రాహుల్‌ గేర్‌ మార్చాడు. డేల్‌ స్టెయిన్‌ వేసిన 19వ ఓవర్లో మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు బాది 26 రన్స్‌ రాబట్టాడు. దూబే వేసిన 20వ ఓవర్లో కరుణ్‌ నాయర్‌(15) ఒక ఫోర్‌ బాదగా రాహులే వరుసగా ఒక ఫోర్‌, రెండు సిక్సర్లు కొట్టి 23 రన్స్‌ రాబట్టారు. ఆరంభం నుంచి ఆఖరి వరకు అందరి బౌలింగ్‌లోనూ చితక్కొట్టిన రాహుల్‌ స్కోరును 200 దాటించాడు.  రన్‌రేట్‌ ఎక్కడ కూడా పడిపోకుండా అతడు ఆడిన తీరు అద్భుతం.   logo