సోమవారం 30 మార్చి 2020
Sports - Feb 11, 2020 , 11:34:40

రాహుల్‌ 'సెంచరీ'రికార్డు.. భారత్‌ స్కోరు 296/7

రాహుల్‌ 'సెంచరీ'రికార్డు.. భారత్‌ స్కోరు 296/7

రాహుల్‌ అద్భుత సెంచరీతో విజృంభించగా శ్రేయస్‌ అయ్యర్‌(62: 63 బంతుల్లో 9ఫోర్లు) అర్ధశతకంతో మెరిశాడు.

మౌంట్‌ మాంగనీ: న్యూజిలాండ్‌తో ఆఖరిదైన మూడో వన్డేలో స్టైలిష్‌ ప్లేయర్‌ కేఎల్‌ రాహుల్‌(112: 113 బంతుల్లో 9ఫోర్లు, 2సిక్సర్లు) శతకంతో అదరగొట్టాడు. వన్డే కెరీర్‌లో రాహుల్‌కిది నాలుగో సెంచరీ కావడం విశేషం.  తీవ్ర ఒత్తిడిలోనూ ఆత్మవిశ్వాసంతో, ఎంతో పరిణతితో బ్యాటింగ్‌ చేశాడు. రాహుల్‌ అద్భుత సెంచరీతో విజృంభించగా శ్రేయస్‌ అయ్యర్‌(62: 63 బంతుల్లో 9ఫోర్లు) అర్ధశతకంతో మెరిశాడు. మొదట్లో పృథ్వీషా(40: 42 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు)తో పాటు మనీశ్‌ పాండే(42: 48 బంతుల్లో 2ఫోర్లు) చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయడంతో  నిర్ణీత ఓవర్లలో భారత్‌ 7 వికెట్లకు 296 పరుగులు చేసింది. కివీస్‌ బౌలర్లలో బెనెట్‌(4 64) ఈ మ్యాచ్‌లోనూ మళ్లీ భారత్‌ను ఇబ్బందిపెట్టాడు. జేమీసన్‌, జేమ్స్‌ నీషమ్‌ చెరో వికెట్‌ తీశారు. 

గత రెండు వన్డేల మాదిరిగానే ఆఖరి మ్యాచ్‌లోనూ మయాంక్‌ అగర్వాల్‌ నిరాశపరిచాడు. పృథ్వీ షా కుదురుకున్నాక అనవసర పరుగు కోసం ప్రయత్నించి అనూహ్యంగా రనౌట్‌కావడం భారత్‌కు పెద్ద షాక్‌. గత రెండు మ్యాచ్‌ల్లో కేవలం 66 పరుగులే చేసిన విరాట్‌ కోహ్లీ ఆఖరిదైన మూడో వన్డేలోనూ కేవలం 9 పరుగులే చేసి నిరాశపరిచాడు. బెనెట్‌ బౌలింగ్‌లో  జేమీసన్‌కు క్యాచ్‌ ఇచ్చి విరాట్‌ వెనుదిరిగాడు.   ఐతే ఆరంభంలో భారత్‌ను గట్టి దెబ్బ కొట్టిన న్యూజిలాండ్‌ బౌలర్లు మధ్య ఓవర్లలో బ్యాట్స్‌మెన్‌ జోరును అడ్డుకోలేకపోయారు.

భారత ఇన్నింగ్స్‌లో రాహుల్‌, శ్రేయస్‌ భాగస్వామ్యమే హైలెట్‌. 62/3తో జట్టు క్లిష్టపరిస్థితుల్లో ఉన్న సమయంలో స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఆతిథ్య బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ ఏదశలోనూ వెనుకడుగు వేయలేదు.   వీరిద్దరూ సంయమనంతో ఆడి నాలుగో వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. క్రీజులో కుదురుకొని ప్రమాదకరంగా కన్పిస్తున్న అయ్యర్‌ను జిమ్మీ నీషమ్‌ పెవిలియన్‌ పంపాడు. 

ఈ దశలో క్రీజులోకి వచ్చిన  మనీశ్‌ పాండే దూకుడుగానే ఆడుతూ తనవంతు పాత్ర పోషించాడు. ఇదే క్రమంలో రాహుల్‌ రెచ్చిపోయి ఆడుతూ శతకం పూర్తి చేసుకున్నాడు.  వేగంగా ఆడే క్రమంలో రాహుల్‌తో పాటు మనీశ్‌.. బెనెట్‌ బౌలింగ్‌లో  వరుస బంతుల్లో ఔటయ్యారు. ఏ స్థానంలోనైనా తాను బ్యాట్‌తో రాణించగలనని రాహుల్‌ మరోసారి నిరూపించాడు. ఐదో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి..న్యూజిలాండ్‌ గడ్డపై సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా రాహుల్‌ అరుదైన ఘనత అందుకున్నాడు. 2015 వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో  సెంచరీ చేసి తొలి ఇండియన్‌ క్రికెటర్‌గా సురేశ్‌ రైనా(110*)  రికార్డు నమోదు చేశాడు.logo