లండన్: ఇండియన్ టీమ్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ( KL Rahul )కి జరిమానా విధించారు. అతని మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత పెట్టారు. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవల్ 1 తప్పిదంగా పరిగణిస్తూ.. జరిమానాతో వదిలేశారు. దీనికి కారణం.. ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మూడో రోజు ఆటలో అతడు వ్యవహరించిన తీరే. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.8ను రాహుల్ ఉల్లంఘించినట్లు తేల్చారు. అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కారణంగా అతనికి ఈ జరిమానా విధించారు.
అంతేకాదు అతని క్రమశిక్షణ రికార్డ్‌లో ఒక డీమెరిట్ పాయింట్ కూడా చేర్చారు. రాహుల్ గత 24 నెలల్లో చేసిన తొలి తప్పిదం ఇది. ఇండియా రెండో ఇన్నింగ్స్ 34వ ఓవర్లో రాహుల్ అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆ క్యాచ్ అవుట్‌ను ఆన్‌ఫీల్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. అయితే ఇంగ్లండ్ కెప్టెన్ రీవ్యూ తీసుకోవడంతో డీఆర్ఎస్లో రాహుల్‌ను అవుట్‌గా తేల్చారు. దీనిపై అతడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.