ఆదివారం 29 మార్చి 2020
Sports - Jan 27, 2020 , 00:33:26

అలవోకగా..

అలవోకగా..

గ్రౌండ్‌ మారలేదు.. పిచ్‌ మారలేదు.. ఫలితం మారలేదు..మూడు రోజుల వ్యవధిలో టీమ్‌ఇండియా సేమ్‌ సీన్‌ రిపీట్‌ చేస్తూ.. మరో గ్రాండ్‌ విక్టరీ ఖాతాలో వేసుకున్నది. తొలి మ్యాచ్‌లో పరుగుల వరద పారిన చోట.. ఈ సారి పరుగు పరుగుకు పరితపించాల్సి వచ్చినా.. మనవాళ్లు ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టారు. టాస్‌ ఓడటంతోనే కాస్త సందేహాలు రేకెత్తినా.. విలియమ్సన్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకొని మన పని మరింత సులువు చేశాడు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ ఆకట్టుకోలేకపోయినా.. నయా స్టార్లు రాహుల్‌, అయ్యర్‌ మరోసారి మెరువడంతో టీమ్‌ఇండియా ఆడుతూ పాడుతూ టార్గెట్‌ ఛేదించింది. తొలి రెండు మ్యాచ్‌లు నెగ్గిన కోహ్లీ అండ్‌ కో ఇక సిరీస్‌పై కన్నేస్తే.. సొంతగడ్డపై కివీస్‌ తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయింది.

  • రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో భారత్‌ జయేభేరి
  • సిరీస్‌లో 2-0తో ముందంజ
  • మరోమారు మెరిసిన రాహుల్‌, అయ్యర్‌
  • రాణించిన జడేజా, బుమ్రా

ఆక్లాండ్‌: మూడు రోజుల వ్యవధిలో భారత్‌ రెండో సారి విజయపతాక ఎగరవేసింది. తొలి మ్యాచ్‌లో భీకరమైన బ్యాటింగ్‌తో భారీ లక్ష్యాన్ని ఛేదించిన టీమ్‌ఇండియా.. ఆదివారం జరిగిన రెండో టీ20లో బంతితో ఆకట్టుకొని 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తుచేసింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ముందంజ వేసింది. ఈడెన్‌ పార్క్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టు విజయం సాధించడం కష్టమని తెలిసినా.. మందకొడిగా మారుతున్న పిచ్‌పై ఛేదన కష్టమని భావించిన కివీస్‌ కెప్టెన్‌ విలియమ్సన్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు.


అయితే మన బౌలర్లు విజృంభించడంతో న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 132 పరుగులు చేసింది. గప్టిల్‌ (20 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), సైఫెర్ట్‌ (26 బంతుల్లో 33 నాటౌట్‌; 1 ఫోర్‌, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించగా.. మిగిలినవారు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా (2/18) ఆకట్టుకున్నాడు. అనంతరం లక్ష్యఛేదనలో లోకేశ్‌ రాహుల్‌ (50 బంతుల్లో 57 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయాస్‌ అయ్యర్‌ (33 బంతుల్లో 44; 1 ఫోర్‌, 3 సిక్సర్లు) మరోసారి విజృంభించడంతో టీమ్‌ఇండియా 17.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రాహుల్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌'అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య మూడో టీ20 బుధవారం హామిల్టన్‌లో జరుగనుంది.


వాళ్లిద్దరే..

తొలి మ్యాచ్‌లో రెండొందల పైచిలుకు లక్ష్యాన్ని మరో ఓవర్‌ మిగిలుండగానే ఛేదించిన టీమ్‌ఇండియాకు.. 133 పరుగుల టార్గెట్‌ మరీ చిన్నదైపొయింది. రోహిత్‌ శర్మ (8), విరాట్‌ కోహ్లీ (11) త్వరగానే పెవిలియన్‌ చేరినా.. భీకర ఫామ్‌లో ఉన్న లోకేశ్‌ రాహుల్‌ అజేయ అర్ధశతకంతో యాంకర్‌ రోల్‌ పోషిస్తే.. శ్రేయాస్‌ అయ్యర్‌ మరోమారు అదరగొట్టాడు. మొదటి ఓవర్‌లో రెండు ఫోర్లతో మురిపించిన రోహిత్‌.. చివరి బంతికి స్లిప్‌లో టేలర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. కుదురుకున్నట్లే కనిపించిన కెప్టెన్‌ కోహ్లీ కూడా వెనుదిరగడంతో పవర్‌ ప్లే ముగిసేసరికి టీమ్‌ఇండియా 40/2తో నిలిచింది. సాధించాల్సిన రన్‌రెట్‌ ఎక్కువ లేకపోవడంతో ఎలాంటి తొందరపాటు లేకుండా బంతికో పరుగు చొప్పున సాధిస్తూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఫలితంగా పది ఓవర్లకు భారత్‌ 60 పరుగులు చేసింది. విజయానికి 6 ఓవర్లలో 46 పరుగులు చేయాల్సిన దశలో బెనెట్‌ ఓవర్‌లో రాహుల్‌ 6,4 బాదితే.. మరుసటి ఓవర్‌లో టిక్నర్‌కు అయ్యర్‌ అదే శిక్ష వేశాడు. ఈ క్రమంలో రాహుల్‌ 43 బంతుల్లో టీ20 ల్లో 11వ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. సోధి ఓవర్‌లో భారీ సిక్సర్‌ కొట్టిన అయ్యర్‌ విజయానికి 8 పరుగుల దూరంలో ఔటైనా.. మిడ్‌వికెట్‌ మీదుగా సిక్సర్‌ బాదిన శివం దూబే (8 నాటౌట్‌) 15 బంతులు మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించాడు.


కట్టుదిట్టమైన బౌలింగ్‌తో..

అంతకుముందు మొదట బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ మరోసారి భారీ స్కోరు చేసేలా కనిపించింది. శార్దూల్‌ ఠాకూర్‌ వేసిన తొలి ఓవర్‌లో రెండు భారీ సిక్సర్లు దంచిన గప్టిల్‌.. మున్రో (26)తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. శార్దూల్‌ వేసిన ఆరో ఓవర్‌లో రెండు బౌండ్రీలు కొట్టిన గప్టిల్‌..కోహ్లీకి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 48 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. మరో ఎండ్‌ నుంచి బుమ్రా, షమీ పరుగులు కట్టడి చేస్తూ ఒత్తిడి పెంచడంతో కాసేపటికి మున్రో కూడా పెవిలియన్‌ బాటపట్టాడు. దీంతో కివీస్‌ 10 ఓవర్లు ముగిసేసరికి 73/2తో నిలిచింది. ఈ దశలో రవీంద్ర జడేజా మాయ చేశాడు. చిన్న గ్రౌండ్‌లో ప్రత్యర్థికి ఒక్క బౌండరీ కొట్టే అవకాశం కూడా ఇవ్వని జడ్డూ.. వరుస ఓవర్లలో గ్రాండ్‌హోమ్‌ (3), విలియమ్సన్‌ (14)ను ఔట్‌ చేసి భళా అనిపించాడు. ఆఖర్లో సైఫెర్ట్‌ కాస్త ధాటిగా ఆడటంతో న్యూజిలాండ్‌ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. మన బౌలర్లలో బు మ్రా 4 ఓవర్లు వేసి 21 పరుగులిచ్చి ఓ వికెట్‌ పడగొడితే.. జడేజా 18 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. వికెట్‌ పడగొట్టకపోయినా షమీ (4 ఓవర్లలో 22 పరుగులు) కూడా ఆకట్టుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో మన ఫీల్డింగ్‌ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది.


బౌలర్లు చక్కటి ప్రదర్శన కనబర్చారు. ఈడెన్‌ పార్క్‌లో ప్రత్యర్థిని 132 పరుగులకు కట్టడి చేయడం అంటే మామూలు విషయం కాదు. బంతిపై స్పిన్నర్లకు పట్టు చిక్కుతున్నప్పుడు జడేజా అద్భుతాలు చేయగలడు. చాహల్‌, బుమ్రా సైతం ఆకట్టుకున్నారు. ఫీల్డింగ్‌లో కొన్ని పొరపాట్లు జరిగాయి. వాటిపై దృష్టి పెట్టాల్సిన అవసరముంది.

- కోహ్లీ, భారత కెప్టెన్‌


తొలి మ్యాచ్‌తో పోల్చుకుంటే పూర్తి భిన్న పరిస్థితుల మధ్య బ్యాటింగ్‌ చేశాం. అందుకే నింపాదిగా ఆడా. సీనియర్లు కోహ్లీ, రోహిత్‌ త్వరగా ఔటవడంతో చివరి వరకు నిలువాలనుకున్నా.

- రాహుల్‌, మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌


స్కోరు బోర్డు

న్యూజిలాండ్‌: గప్టిల్‌ (సి) కోహ్లీ (బి) శార్దూల్‌ 33, మున్రో (సి) కోహ్లీ (బి) దూబే 26, విలియమ్సన్‌ (సి) చాహల్‌ (బి) జడేజా 14, గ్రాండ్‌హోమ్‌ (సి అండ్‌ బి) జడేజా 3, టేలర్‌ (సి) రోహిత్‌ (బి) బుమ్రా 18, సైఫెర్ట్‌ (నాటౌట్‌) 33, శాంట్నర్‌ (నాటౌట్‌) 0,

ఎక్స్‌ట్రాలు: 5, మొత్తం: 20 ఓవర్లలో 132/5. వికెట్ల పతనం: 1-48, 2-68, 3-74, 4-81, 5-125, బౌలింగ్‌: శార్దూల్‌ 2-0-21-1, షమీ 4-0-22-0, బుమ్రా 4-0-21-1, చాహల్‌ 4-0-33-0, దూబే 2-0-16-1, జడేజా 4-0-18-2.

భారత్‌: రోహిత్‌ (సి) టేలర్‌ (బి) సౌథీ 8, రాహుల్‌ (నాటౌట్‌) 57, కోహ్లీ (సి) సైఫెర్ట్‌ (బి) సౌథీ 11, అయ్యర్‌ (సి) సౌథీ (బి) సోధి 44, దూబే (నాటౌట్‌) 8, ఎక్స్‌ట్రాలు: 7, మొత్తం: 17.3 ఓవర్లలో 135/3. వికెట్ల పతనం: 1-8, 2-39, 3-125, బౌలింగ్‌: సౌథీ 3.3-0-20-2, బెనెట్‌ 3-0-29-0, టిక్నర్‌ 3-0-34-0, శాంట్నర్‌ 4-0-19-0, సోధి 4-0-33-1.


logo