శనివారం 28 నవంబర్ 2020
Sports - Oct 07, 2020 , 17:05:06

IPL 2020: చెన్నైతో కోల్‌కతా అమీతుమీ

IPL 2020: చెన్నైతో  కోల్‌కతా అమీతుమీ

అబుదాబి:  వరుస ఓటములతో  ఒత్తిడిలో ఉన్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌..హ్యాట్రిక్‌ పరాజయాలకు చెక్‌ పెట్టి గత మ్యాచ్‌లో గొప్పగా పుంజుకున్న చెన్నై  జట్ల మధ్య బుధవారం ఆసక్తికర పోరు జరగనుంది.  పంజాబ్‌పై 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన మహేంద్ర సింగ్‌ ధోనీ సారథ్యంలోని చెన్నై ఆత్మవిశ్వాసంతో ఉంది.  ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ  జట్టును సమర్థవంతంగా నడిపించడంలో  దినేశ్‌ కార్తీక్‌  విఫలమవుతున్నాడు.

అతని నిర్ణయాల వల్లే కోల్‌కతా అనూహ్యంగా డీలా పడిందని విమర్శలు వస్తున్నాయి.  కార్తీక్‌ను తప్పించి కెప్టెన్సీ బాధ్యతలు ఇయాన్‌ మోర్గాన్‌కు అప్పగించాలని విశ్లేషకులు, అభిమానులు కోరుతున్నారు. తీవ్ర ఒత్తిడిలో ఉన్న కోల్‌కతా..ఉత్సాహంతో ఉన్న  చెన్నై ఇవాళ జరిగే   మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. చెన్నై ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడగా రెండింటిలో గెలుపొంది..మూడింటిలో ఓడింది. మరోవైపు, కోల్‌కతా ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండింటిలో ఓడి..మరో రెండు మ్యాచ్‌ల్లో   విజయ సాధించింది. 

చెన్నై  ఓపెనర్‌ షేన్‌ వాట్సన్‌ ఫామ్‌లోకి రావడం   అతిపెద్ద సానుకూలాంశం. గాయం నుంచి కొలుకొని జట్టులోకి వచ్చిన అంబటి రాయుడు నిలబడితే చెన్నైకి తిరుగుండదు.  మరో ఓపెనర్‌ డుప్లెసిస్‌ ఫామ్‌ను కొనసాగిస్తుండటంతో చెన్నై బ్యాటింగ్‌ పటిష్ఠంగా కనిపిస్తోంది. మరోవైపు కోల్‌కతా బ్యాటింగ్‌ లైనప్‌ కూడా బలీయంగా కనిపిస్తోంది. ఆ జట్టులో ఎనిమిదో నంబర్‌లో కూడా  బ్యాటింగ్‌ చేసే బ్యాట్స్‌మెన్‌ ఉన్నారు.  ఇరుజట్లలో బౌలింగ్‌ విభాగం పటిష్ఠంగా ఉంది. గత మ్యాచ్‌లో తప్పిదాలను సరిదిద్దుకుంటే చెన్నైకి కోల్‌కతా గట్టిపోటీనిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.  ఈ పోరులో ధోనీసేన ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నది.