శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Feb 12, 2020 , 07:53:46

31 ఏండ్ల తర్వాత..భారత్‌ వైట్‌వాష్‌

31 ఏండ్ల తర్వాత..భారత్‌ వైట్‌వాష్‌

పొట్టి ఫార్మాట్‌లో ప్రత్యర్థిని క్లీన్‌స్వీప్‌ చేసిన కోహ్లీ అండ్‌ కో.. అదే మైదానంలో వన్డేల్లో వైట్‌వాష్‌కు గురైంది. బ్యాటింగ్‌లో టీమ్‌ఇండియా మూల‘విరాట్‌' పెద్దగా ప్రభావం చూపలేకపోయినా.. మిడిలార్డర్‌లో కొత్త జోడీ లోకేశ్‌ రాహుల్‌, శ్రేయాస్‌ అయ్యర్‌ మెరువడంతో మంచి స్కోరే చేసిన భారత్‌.. బౌలింగ్‌లో ప్రభావం చూపలేక చతికిలబడింది. పేస్‌గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా వరుసగా మూడో వన్డేలోనూ వికెట్‌ పడగొట్టలేకపోవడంతో.. కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ అలవోకగా లక్ష్యాన్ని ఛేదించారు. న్యూజిలాండ్‌తో పోల్చుకుంటే సిరీస్‌ గెలిచేందుకు మాకేమాత్రం అర్హత లేదని ఒప్పుకున్న కోహ్లీ.. ఇక టెస్టు సిరీస్‌ కోసం సమాయత్తమవుతున్నాడు.

  • వన్డే సిరీస్‌లో భారత్‌ వైట్‌వాష్‌
  • చివరి మ్యాచ్‌లో 5 వికెట్లతో కివీస్‌ గెలుపు
  • రాహుల్‌ సెంచరీ వృథా
  • రాణించిన నికోల్స్‌, గప్టిల్‌, గ్రాండ్‌హోమ్‌

మౌంట్‌ మాంగనీ: టీ20 సిరీస్‌లో ఎదురైన పరాభవానికి న్యూజిలాండ్‌ బదులు తీర్చుకుంది. పొట్టి ఫార్మాట్‌లో టీమ్‌ఇండియా చేతిలో వరుసగా ఐదు మ్యాచ్‌లు ఓడిన కివీస్‌.. వన్డేల్లో మూడు మ్యాచ్‌లూ నెగ్గి విరాట్‌ సేనను వైట్‌ వాష్‌ చేసింది. మూడుకంటే ఎక్కువ మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్‌ వైట్‌వాష్‌కు గురవడం 1989 తర్వాత ఇదే తొలిసారి. చివరిసారిగా టీమ్‌ఇండియా 1989లో వెస్టిండీస్‌ చేతిలో 0-5తో ఓడింది. కివీస్‌ పర్యటన ప్రారంభానికి ముందు కోహ్లీ మాట్లాడుతూ.. ‘న్యూజిలాండ్‌పై ప్రతీకారం అనే ఆలోచన రాదు. వారు చాలా మంచి ప్రత్యర్థులు’ అని అంటే.. పది రోజుల క్రితం ఎదురైన పరాజయాలకు బ్లాక్‌క్యాప్స్‌ తమదైన శైలిలో రివేంజ్‌ తీర్చుకున్నారు. మంగళవారం ఇక్కడి బే ఓవెల్‌ మైదానంలో జరిగిన ఆఖరి వన్డేలో టీమ్‌ఇండియా 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. 


టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 296 పరుగులు చేసింది. లోకేశ్‌ రాహుల్‌ (113 బంతుల్లో 112; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో కదంతొక్కగా.. శ్రేయాస్‌ అయ్యర్‌ (62; 9 ఫోర్లు), మనీశ్‌ పాండే (42) రాణించారు. కివీస్‌ బౌలర్లలో బెనెట్‌ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో విలియమ్సన్‌ సేన 47.1 ఓవర్లలో 5 వికెట్లకు 300 పరుగులు చేసింది. హెన్రీ నికోల్స్‌ (80; 9 ఫోర్లు), మార్టిన్‌ గప్టిల్‌ (46 బంతుల్లో 66; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), గ్రాండ్‌హోమ్‌ (28 బంతుల్లో 58 నాటౌట్‌; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) దంచికొట్టారు. భారత బౌలర్లలో చాహల్‌కు మూడు వికెట్లు దక్కాయి. నికోల్స్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌', రాస్‌ టేలర్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌' అవార్డులు దక్కాయి. ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఈనెల 21 నుంచి ప్రారంభం కానుంది.


విరాట్‌ మరోసారి..

వైట్‌వాష్‌ తప్పించుకొని పరువు నిలుపుకోవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో భారత్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (1) రెండో ఓవర్‌లోనే ఔటయ్యాడు. కాసేపటికే భారత్‌కు అతిపెద్ద షాక్‌ తగిలింది. అప్పటికే ఓ సిక్సర్‌ కొట్టి టచ్‌లో కనిపించిన కెప్టెన్‌ విరాట్‌ (9).. మరో సిక్స్‌ బాదే ప్రయత్నంలో థర్డ్‌మ్యాన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. చక్కటి షాట్లతో ఆకట్టుకున్న యంగ్‌ ఓపెనర్‌ పృథ్వీ షా (42 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు. ఫలితంగా భారత్‌ 62 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.


ఆ రెండు భాగస్వామ్యాలు

ఆరంభంలోనే వికెట్లు కోల్పోయిన టీమ్‌ఇండియాను అయ్యర్‌, రాహుల్‌ ఆదుకున్నారు. ముందు ఆచితూచి ఆడిన ఈ జోడీ ఆ తర్వాత కాస్త వేగం పెంచింది. ఓవర్‌ కో బౌండ్రీ చొప్పున రాబడుతూ రన్‌రేట్‌ పడిపోకుండా చూసుకుంది. ఈ క్రమంలో అయ్యర్‌ 52 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్‌లో అతడికిది మూడో ఫిఫ్టీ ప్లస్‌ స్కోరు కావడం విశేషం. నాలుగో వికెట్‌కు 100 పరుగులు జోడించాక శ్రేయాస్‌ వెనుదిరిగాడు. ఆ తర్వాత మనీశ్‌ పాండే సహకారంతో రాహుల్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. శ్రేయాస్‌ ఉన్నంత వరకు కాస్త నెమ్మదిగా ఆడిన రాహుల్‌.. ఆ తర్వాత జోరు పెంచి 104 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్నాడు. ఐదో స్థానంలో అతడికి ఇదే తొలి శతకం కాగా.. ఆసియా అవతల సెంచరీ చేసిన భారత రెండో వికెట్‌ కీపర్‌గా రాహుల్‌ రికార్డుల్లోకెక్కాడు. ఐదో వికెట్‌కు 107 పరుగులు జోడించి జోరుమీదున్న ఈ జంటను బెనెట్‌ విడదీశాడు. 47వ ఓవర్‌లో రాహుల్‌, పాండేలను వరుస బంతుల్లో ఔట్‌ చేశాడు. చివర్లో జడేజా (8 నాటౌట్‌), సైనీ (8) విలువైన పరుగులు చేశారు.


మొదట్లో గప్టిల్‌..

లక్ష్యఛేదనలో న్యూజిలాండ్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు గప్టిల్‌, నికోల్స్‌ దంచికొట్టడంతో పవర్‌ ప్లే ముగిసేసరికి ఆ జట్టు వికెట్‌ కోల్పోకుండా 65 పరుగులు చేసింది. ముఖ్యంగా గప్టిల్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సైనీ బౌలింగ్‌లో రెండు సార్లు 4,6 కొట్టిన గప్టిల్‌.. బుమ్రా, శార్దూల్‌కు అదే శిక్ష వేశాడు. తొలి వికెట్‌కు 106 పరుగులు జోడించాక చాహల్‌ ఈ జోడీని విడగొట్టాడు. భుజం గాయం కారణంగా తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (22) పెద్దగా ఆకట్టుకోలేకపోగా.. టేలర్‌ (12) ప్రభావం చూపలేకపోయాడు. దూకుడు మీదున్న నికోల్స్‌తో పాటు నీషమ్‌ (19) కూడా ఔటవడంతో భారత్‌కు పుంజుకునే అవకాశం దక్కినా.. దాన్ని మనవాళ్లు వినియోగించుకోలేకపోయారు.


చివర్లో గ్రాండ్‌హోమ్‌..

ఈ పర్యటనలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఆల్‌రౌండర్‌ గ్రాండ్‌హోమ్‌ ఆఖరి మ్యాచ్‌లో తన పవర్‌ హిట్టింగ్‌తో సత్తాచాటాడు. లాథమ్‌ (32)ను నాన్‌స్ట్రయికింగ్‌ ఎండ్‌కే పరిమితం చేస్తూ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. సూపర్‌ సిక్సర్‌తో చాహల్‌కు స్వాగతం పలికిన గ్రాండ్‌హోమ్‌.. శార్దూల్‌ ఓవర్‌లో 6,4 దంచాడు. దీంతో విజయ సమీకరణం 42 బంతుల్లో 42 పరుగులకు వచ్చింది. శార్దూల్‌ వేసిన 46వ ఓవర్‌లో మూడు ఫోర్లు, ఓ సిక్సర్‌ బాదిన గ్రాండ్‌హోమ్‌ అదే ఊపులో 17 బంతులు మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించాడు. వరుసగా మూడో వన్డేలోనూ బుమ్రా వికెట్‌ పడగొట్టలేకపోవడం గమనార్హం.


మా వాళ్లు ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టారు. అందుకే భారత్‌ ఒత్తిడిలో పడింది. ఆరంభంలో గప్టిల్‌ ధాటిగా ఆడటంతో ఆ తర్వాత మా పని సులువైంది. 


- విలియమ్సన్‌, న్యూజిలాండ్‌ కెప్టెన్‌


అంతర్జాతీయ క్రికెట్‌లో మ్యాచ్‌లు నెగ్గేందుకు ఈ తీవ్రత సరిపోదు. స్కోర్లు చూస్తుంటే ఆట ఘోరంగా సాగిందని చెప్పలేం. కానీ అవకాశాలను అందిపుచ్చుకోలేకపోవడం వల్లే మ్యాచ్‌ చేజారింది. ఫీల్డింగ్‌లో చురుగ్గా కదల్లేక పోవడంతో పాటు బంతితో మ్యాజిక్‌ చేయలేకపోయాం. అందుకే మాకు గెలిచే అర్హత లేదు. న్యూజిలాండ్‌ మరింత కసితో ఆడింది. అలాంటి పట్టుదల మా జట్టులో లోపించింది. టెస్టు చాంపియన్‌షిప్‌లో ప్రతి మ్యాచ్‌ కీలకమే. సుదీర్ఘ ఫార్మాట్‌లో మాకు స్థిరమైన జట్టు ఉంది. 

-  కోహ్లీ, భారత కెప్టెన్‌


4 మూడు అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల సిరీస్‌లో టీమ్‌ఇండియా వైట్‌వాష్‌కు గురికావడం ఇది నాలుగోసారి. గతంలో వెస్టిండీస్‌ చేతిలోనే రెండు సార్లు (1984, 1989లో 0-5తో)  ఓడింది. 


2 ఆసియా అవతల సెంచరీ చేసిన రెండో వికెట్‌ కీపర్‌గా రాహుల్‌ రికార్డుల్లోకెక్కాడు. అంతకుముందు రాహుల్‌ ద్రవిడ్‌ (1999లో ఇంగ్లండ్‌ వేదికగా శ్రీలంకపై) ఈ ఘనత సాధించాడు. విచిత్రంగా వీరిద్దరూ తాత్కాళిక కీపర్లే  కావడం కొసమెరుపు.


0 మూడు మ్యాచ్‌ల్లో కలిపి 167 పరుగులు ఇచ్చుకున్న బుమ్రా ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు.


స్కోరు బోర్డు

భారత్‌: పృథ్వీ షా (రనౌట్‌) 40, మయాంక్‌ (బి) జెమీసన్‌ 1, విరాట్‌ కోహ్లీ (సి) జెమీసన్‌ (బి) బెనెట్‌ 9, అయ్యర్‌ (సి) గ్రాండ్‌హోమ్‌ (బి) నీషమ్‌ 62, రాహుల్‌ (సి) జెమీసన్‌ (బి) బెనెట్‌ 112, పాండే (సి) శాంట్నర్‌ (బి) బెనెట్‌ 42, జడేజా (నాటౌట్‌) 8, శార్దూల్‌ (సి) గ్రాండ్‌హోమ్‌ (బి) బెనెట్‌ 7, సైనీ (నాటౌట్‌) 8, ఎక్స్‌ట్రాలు: 7, మొత్తం: 50 ఓవర్లలో 296/7. వికెట్ల పతనం: 1-8, 2-32, 3-62, 4-162, 5-269, 6-269, 7-280, బౌలింగ్‌: సౌథీ 9-0-59-0, జెమీసన్‌ 10-0-53-1, బెనెట్‌ 10-1-64-4, గ్రాండ్‌హోమ్‌ 3-0-10-0, నీషమ్‌ 8-0-50-1, శాంట్నర్‌ 10-0-59-0.

న్యూజిలాండ్‌: గప్టిల్‌ (బి) చాహల్‌ 66, నికోల్స్‌ (సి) రాహుల్‌ (బి) శార్దూల్‌ 80, విలియమ్సన్‌ (సి) మయాంక్‌ (బి) చాహల్‌ 22, టేలర్‌ (సి) కోహ్లీ (బి) జడేజా 12, లాథమ్‌ (నాటౌట్‌) 32, నీషమ్‌ (సి) కోహ్లీ (బి) చాహల్‌ 19, గ్రాండ్‌హోమ్‌ (నాటౌట్‌) 58, ఎక్స్‌ట్రాలు: 11, మొత్తం: 47.1 ఓవర్లలో 300/5. వికెట్ల పతనం: 1-106, 2-159, 3-186, 4-189, 5-220, బౌలింగ్‌: బుమ్రా 10-0-50-0, సైనీ 8-0-68-0, చాహల్‌ 10-1-47-3, శార్దూల్‌ 9.1-0-87-1, జడేజా 10-0-45-1.


logo