బుధవారం 02 డిసెంబర్ 2020
Sports - Sep 24, 2020 , 16:57:54

కోహ్లీ Vs రాహుల్‌‌..ఎవరిదో పైచేయి?

కోహ్లీ Vs  రాహుల్‌‌..ఎవరిదో పైచేయి?

దుబాయ్‌  ఐపీఎల్‌-13వ సీజన్‌లో గురువారం మరో ఆసక్తికర సమరం జరగనుంది. విజయంతో టోర్నీని ఆరంభించిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు..  గెలుపు అంచుల దాకా వచ్చి అనూహ్యంగా సూపర్‌ ఓవర్లో ఓటమిపాలైన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్లు నేడు అమీతుమీ తేల్చుకోనున్నాయి.  ఈ పోరు విరాట్‌ కోహ్లీ వర్సెస్‌ కేఎల్‌ రాహుల్‌గా ఉంటుందని భావిస్తున్నారు. 

ఢిల్లీ క్యాపిటల్స్‌తో  మ్యాచ్‌లో అంపైర్‌  షార్ట్‌ రన్‌  వివాదాస్పద నిర్ణయం అంశాన్ని  మర్చిపోయి నూతనోత్సాహంతో బరిలో దిగాలని రాహుల్‌ అండ్‌ కో బెంగళూరుతో మ్యాచ్‌కు పూర్తిగా సన్నద్ధమైంది.   తొలి మ్యాచ్‌కు దూరమైన క్రిస్‌గేల్‌ తుదిజట్టులోకి వచ్చే వీలుంది. ఢిల్లీతో మ్యాచ్‌లో స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఆకట్టుకున్న మయాంక్‌ అగర్వాల్‌పై పంజాబ్‌ ఆశలు పెట్టుకున్నది.  పంజాబ్‌ పేస్‌ బౌలింగ్‌..ఆర్‌సీబీ కన్నా మెరుగ్గా ఉంది.

గత మ్యాచ్‌ తరహాలోనే చాహల్‌ బంతితో మరోసారి మాయ చేయాలని కోహ్లీసేన కోరుకుంటున్నది. ఐపీఎల్‌ అరంగేట్ర మ్యాచ్‌లోనే హాఫ్‌సెంచరీతో చెలరేగిన యువ ఓపెనర్‌ దేవదత్‌ పడిక్కల్‌తో పాటు డివిలియర్స్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు.  గత మ్యాచ్‌లో ధారళంగా పరుగులు సమర్పించుకున్న సీనియర్‌ పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ స్థానంలో హైదరాబాదీ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ బరిలో దిగే అవకాశం ఉన్నది.