బుధవారం 25 నవంబర్ 2020
Sports - Oct 25, 2020 , 02:31:08

ఆశలు ఆవిరి

ఆశలు ఆవిరి

  • పంజాబ్‌ చేతిలో హైదరాబాద్‌ ఓటమి 
  • ఏడో పరాజయంతో ప్లే ఆఫ్స్‌కు దూరం!

చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే నానుడిని పెడచెవిన పెట్టిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అందుకు తగ్గ మూల్యం చెల్లించుకుంది. సూపర్‌ బౌలింగ్‌తో ప్రత్యర్థిని తక్కువ పరుగులకే కట్టడి చేసిన వార్నర్‌ సేన.. మెరుపు ఆరంభం లభించాక కూడా స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలబడింది. సీజన్‌ మలి సగంలో దుమ్మురేపుతున్న పంజాబ్‌ వరుసగా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంటే.. ఈ పరాజయంతో సన్‌రైజర్స్‌ ప్లే ఆఫ్స్‌ ఆశలకు నీళ్లొదిలేసింది. 

దుబాయ్‌: బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై మొదట ప్రత్యర్థిని తక్కువ పరుగులకే కట్టడి చేసిన సన్‌రైజర్స్‌.. ఆ తర్వాత స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చేతులెత్తేసింది. సీజన్‌లో ఏడో పరాజయంతో ప్లే ఆఫ్స్‌కు దూరమైంది. ఇక ఇక్కడి నుంచి వార్నర్‌ సేన ప్లే ఆఫ్స్‌ చేరాలంటే అద్భుతం జరగాల్సిందే! శనివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ 12 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌ చేసిన రాహుల్‌ సేన నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 126 పరుగులు చేసింది. రషీద్‌ ఖాన్‌ (2/14), హోల్డర్‌ (2/27), సందీప్‌ (2/29) ధాటికి.. పంజాబ్‌ బ్యాట్స్‌మెన్‌ పరుగులు చేసేందుకు నానా తంటాలు పడ్డారు. నికోలస్‌ పూరన్‌ (32 నాటౌట్‌) టాప్‌స్కోరర్‌. అనంతరం లక్ష్యఛేదనలో హైదరాబాద్‌ 19.5 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌటైంది. డేవిడ్‌ వార్నర్‌ (20 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్నిచ్చినా మిగిలిన వారు ఘోరంగా విఫలమవడంతో పరాజయం వైపు నిలిచింది. జోర్డాన్‌ (3/17)కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది.

పరుగు పరుగుకు పరితపించి..

గాయపడ్డ మయాంక్‌ అగర్వాల్‌ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన మన్‌దీప్‌ సింగ్‌ (17) పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. గేల్‌ (20; 2 ఫోర్లు, ఒక సిక్సర్‌)తో కలిసి కెప్టెన్‌ రాహుల్‌ (27; 2 ఫోర్లు, ఒక సిక్సర్‌) ఇన్నింగ్స్‌ను నడిపించాడు. వీరిద్దరూ బౌండ్రీలు బాదుతుండటంతో 7 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్‌ 56/1తో నిలిచింది. అయితే అక్కడి నుంచి హైదరాబాద్‌ బౌలర్ల హవా నడిచింది. బౌండ్రీ కొట్టడం పక్కనబెట్టి కనీసం సింగిల్‌ తీసేందుకు కూడా బ్యాట్స్‌మెన్‌ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ క్రమంలో గేల్‌, రాహుల్‌ వరుస బంతుల్లో ఔటవడంతో పంజాబ్‌ తీవ్ర ఇబ్బందుల్లో పడింది. మ్యాక్స్‌వెల్‌ (12) మరోసారి నిరాశ పరిస్తే.. హూడా (0) ఇలా వచ్చి అలా వెళ్లాడు. జోర్డాన్‌ (7), మురుగన్‌ అశ్విన్‌ (4) పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఒక దశలో వరుసగా 69 బంతుల పాటు ఒక్క బౌండ్రీ కూడా నమోదు కాలేదంటే హైదరాబాద్‌ బౌలింగ్‌ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. 

పెవిలియన్‌కు క్యూ కట్టి

గత మ్యాచ్‌లో విఫలమైన ఓపెనర్లు వార్నర్‌, బెయిర్‌స్టో (19) మెరుపు ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్‌కు 6.2 ఓవర్లలోనే 52 పరుగులు జోడించాక వార్నర్‌ ఔట్‌ కాగా.. కాసేపటికే బెయిర్‌స్టో అతడిని అనుసరించాడు. అబ్దుల్‌ సమద్‌ (7) ఆకట్టుకోలేకపోయాడు. లక్ష్యం చిన్నదే అయినా పంజాబ్‌ బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బంతులేయడంతో పరుగుల రాక కష్టమైంది. గత మ్యాచ్‌లో భారీ షాట్లతో అలరించిన మనీశ్‌ పాండే (29 బంతుల్లో 15) క్రీజులో కావాల్సినంత సమయం వెచ్చించినా ఒక్క బౌండ్రీ కూడా నమోదు చేయలేకపోయాడు. ఆశలు రేపిన విజయ్‌ శంకర్‌ (27 బంతుల్లో 26; 4 ఫోర్లు) కూడా వెనుదిరగడంతో లక్ష్యం 12 బంతుల్లో 17 పరుగులకే చేరింది. ఈ దశలో హోల్డర్‌ (5) గార్గ్‌ (3), రషీద్‌ (0), సందీప్‌ (0), ఖలీల్‌ (0) పెవిలియన్‌కు క్యూ కట్టడంతో హైదరాబాద్‌ 14 పరుగుల వ్యవధిలో చివరి ఏడు వికెట్లు కోల్పోయి పరాజయం పాలైంది. 

స్కోరు బోర్డు

పంజాబ్‌: రాహుల్‌ (బి) రషీద్‌ ఖాన్‌ 27, మన్‌దీప్‌ (సి) రషీద్‌ (బి) సందీప్‌ 17, గేల్‌ (సి) వార్నర్‌ (బి) హోల్డర్‌ 20, పూరన్‌ (నాటౌట్‌) 32, మ్యాక్స్‌వెల్‌ (సి) వార్నర్‌ (బి) సందీప్‌ 12, హూడా (స్టంప్డ్‌) బెయిర్‌స్టో (బి) రషీద్‌ 0, జోర్డాన్‌ (సి) ఖలీల్‌ (బి) హోల్డర్‌ 7, మురుగన్‌ (రనౌట్‌) 4, రవి (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 7, మొత్తం: 20 ఓవర్లలో 126/7. వికెట్ల పతనం: 1-37, 2-66, 3-66, 4-85, 5-88, 6-105, 7-110, బౌలింగ్‌: సందీప్‌ 4-0-29-2, ఖలీల్‌ 4-0-31-0, హోల్డర్‌ 4-0-27-2, రషీద్‌ 4-0-14-2, నటరాజన్‌ 4-0-23-0.

హైదరాబాద్‌: వార్నర్‌ (సి) రాహుల్‌ (బి) రవి 35, బెయిర్‌స్టో (బి) మురుగన్‌ 19, పాండే (సి) (సబ్‌) సుచిత్‌ (బి) జోర్డాన్‌ 15 , సమద్‌ (సి) జోర్డాన్‌ (బి) షమీ 7, శంకర్‌ (సి) రాహుల్‌ (బి) అర్శ్‌దీప్‌ 26, హోల్డర్‌ (సి) మన్‌దీప్‌ (బి) జోర్డాన్‌ 5, గార్గ్‌ (సి) జోర్డాన్‌ (బి) అర్శ్‌దీప్‌ 3, రషీద్‌ (సి) పూరన్‌ (బి) జోర్డాన్‌ 0, సందీప్‌ (సి) మురుగన్‌ (బి) అర్శ్‌దీప్‌ 0, నటరాజన్‌ , ఖలీల్‌ (రనౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 4, మొత్తం: 19.5 ఓవర్లలో 114 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-56, 2-58, 3-67, 4-100, 5-110, 6-112, 7-112, 8-114, 9-114, 10-114, బౌలింగ్‌: షమీ 4-0-34-1, అర్శ్‌దీప్‌ 3.5-0-23-3, మురుగన్‌ 4-0-27-1, రవి 4-0-13-1, జోర్డాన్‌ 4-0-17-3.