గురువారం 03 డిసెంబర్ 2020
Sports - Oct 21, 2020 , 00:40:22

పంజాబ్‌ పైపైకి

పంజాబ్‌ పైపైకి

  • ఢిల్లీపై రాహుల్‌ సేన విజయం
  • ధావన్‌ సెంచరీ వృథా
  • ఈ మ్యాచ్‌లో రెండు సార్లు టాస్‌  వేశారు. మొదటిసారి నాణాన్ని ఎగురవేసిన సమయంలో పంజాబ్‌ కెప్టెన్‌ రాహుల్‌ స్పందించకపోవడంతో టాస్‌ రెండో సారి వేయాల్సి వచ్చింది.

యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ రాకతో లీగ్‌లో దూసుకెళ్తున్న.. పంజాబ్‌ మరో సాధికారిక  విజయంతో హ్యాట్రిక్‌ నమోదు  చేసుకుంది. సీజన్‌ ఆరంభంలో ఢిల్లీ చేతిలో ఎదురైన సూపర్‌ ఓవర్‌ ఓటమికి ఈ గెలుపుతో రాహుల్‌ సేన ప్రతీకారం తీర్చుకుంది. గత మ్యాచ్‌లో డబుల్‌ సూపర్‌ ఓవర్‌లో గట్టెక్కిన పంజాబ్‌ ఈసారి సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటింది. శిఖర్‌ ధావన్‌ వరుసగా రెండో సెంచరీతో కొత్త చరిత్ర లిఖించినా.. ఢిల్లీని గెలిపించలేకపోయాడు. 

దుబాయ్‌: సీజన్‌లో ఆలస్యంగా మేలుకున్న కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. గత మ్యాచ్‌లో డబుల్‌ సూపర్‌ ఓవర్‌లో గెలిచి ఊపిరి పీల్చుకున్న రాహుల్‌ సేన.. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫుల్‌ఫామ్‌లో ఉన్న శిఖర్‌ ధావన్‌ (61 బంతుల్లో 106 నాటౌట్‌; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) వరుసగా రెండో సెంచరీతో చెలరేగడంతో.. మొదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో పంజాబ్‌ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. నికోలస్‌ పూరన్‌ (28 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకం సాధించగా.. మ్యాక్స్‌వెల్‌ (32) ఫర్వాలేదనిపించాడు. ధావన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌'అవార్డు దక్కింది.

తలా కొన్ని.. 

ఛేజింగ్‌లో లోకేశ్‌ రాహుల్‌ (15), మయాంక్‌ అగర్వాల్‌ (5) ఆకట్టుకోలేకపోయినా.. క్రిస్‌ గేల్‌ (13 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు. దేశ్‌పాండే వేసిన ఐదో ఓవర్‌లో గేల్‌ 4,4,6,4,6తో మొత్తం 26 పరుగులు రాబట్టాడు. అయితే ఆరో ఓవర్‌లో అశ్విన్‌ ఆటను మలుపు తిప్పాడు. గేల్‌ను బౌల్డ్‌ చేసిన అశ్విన్‌.. సూపర్‌ త్రోతో అగర్వాల్‌ను రనౌట్‌ చేశాడు. పూరన్‌తో సమన్వయలోపం కారణంగా మయాంక్‌ భారంగా పెవిలియన్‌ బాటపట్టాడు. ఫలితంగా పవర్‌ప్లే ముగిసేసరికి పంజాబ్‌ 57/3తో నిలిచింది. ఈ దశలో పూరన్‌, మ్యాక్స్‌వెల్‌ ఇన్నింగ్స్‌ను నడిపించారు. ఫామ్‌లేమితో సతమతమవుతున్న మ్యాక్స్‌వెల్‌ షాట్లు ఆడేందుకు ఇబ్బందిపడ్డా.. పూరన్‌ మాత్రం పూనకం వచ్చినవాడిలా రెచ్చిపోయాడు. 27 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్న పూరన్‌ విజయానికి 40 పరుగులు కావాల్సిన దశలో ఔట్‌ కాగా.. హుడా (15 నాటౌట్‌), నీషమ్‌ (10 నాటౌట్‌) చివరి వరకు నిలిచి జట్టును గెలిపించారు.

సూపర్‌ శిఖర్‌..

గత మ్యాచ్‌లో ఎక్కడ ఆపాడో.. ధావన్‌ అక్కడి నుంచే తిరిగి దంచుడు ప్రారంభించాడు. బౌలర్‌తో సంబంధం లేకుండా బౌండ్రీల వర్షం కురిపించిన గబ్బర్‌ వరుసగా రెండో సెంచరీ నమోదు చేసుకున్నాడు.  ఓ వైపు ధావన్‌ ధాటిగా ఆడుతున్నా.. మిగిలినవాళ్లు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. పృథ్వీ షా (7) నాలుగో ఓవర్‌లో పెవిలియన్‌ బాటపట్టగా.. శిఖర్‌కు కాసేపు సహకారం అందించిన కెప్టెన్‌ అయ్యర్‌ (14), పంత్‌ (14) భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోయారు. ఈ క్రమంలో 28 బంతుల్లో అర్ధశతకం సాధించిన గబ్బర్‌.. ఆ తర్వాత మరింత రెచ్చిపోయాడు. స్టోయినిస్‌ (9), హెట్‌మైర్‌ (10) పెద్దగా ప్రభావం చూపలేకపోయినా.. ధావన్‌ ఒంటరి పోరాటంతో 57 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

ఢిల్లీ ఇన్నింగ్స్‌లో శిఖర్‌ 61 బంతుల్లో 106 పరుగులు చేస్తే.. మిగిలిన వాళ్లంతా కలిసి 59 బంతుల్లో 54 పరుగులే చేయడంతో అయ్యర్‌ సేన ఆశించిన లక్ష్యాన్ని నిర్దేశించ లేకపోయింది. గబ్బర్‌ 12 ఫోర్లు, 3 సిక్సర్లు బాదితే.. తక్కిన జట్టంతా కలిసి రెండు ఫోర్లు, రెండు సిక్సర్లే కొట్టడం కొసమెరుపు. 

ధావన్‌ @5000

సెంచరీతో విజృంభించిన ధావన్‌ ఐపీఎల్‌లో 5 వేల పరుగుల మైలురాయిని దాటాడు. అత్యధిక పరుగల జాబితాలో కోహ్లీ (5759), రైనా (5368), రోహిత్‌ (5158) తర్వాత శిఖర్‌ (5044) నాలుగో స్థానంలో ఉన్నాడు.

ఐపీఎల్‌ చరిత్రలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో సెంచరీలు చేసిన మొదటి బ్యాట్స్‌మన్‌గా ధావన్‌ కొత్త రికార్డు నెలకొల్పాడు. చెన్నైపై 58 బంతుల్లో సెంచరీ కొట్టిన గబ్బర్‌.. పంజాబ్‌పై 57 బంతుల్లోనే పూర్తి చేశాడు.

స్కోరు బోర్డు

ఢిల్లీ: పృథ్వీ షా (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) నీషమ్‌ 7, ధావన్‌ (నాటౌట్‌) 106, అయ్యర్‌ (సి) రాహుల్‌ (బి) అశ్విన్‌ 14, పంత్‌ (సి) మయాంక్‌ (బి) మ్యాక్స్‌వెల్‌ 14, స్టొయినిస్‌ (సి) మయాంక్‌ (బి) షమీ 9, హెట్‌మైర్‌ (బి) షమీ 10, ఎక్స్‌ట్రాలు: 4, మొత్తం: 20 ఓవర్లలో164/5. వికెట్ల పతనం: 1-25, 2-73, 3-106, 4-141, 5-164, బౌలింగ్‌: మ్యాక్స్‌వెల్‌ 4-0-31-1, షమీ 4-0-28-2, అర్శ్‌దీప్‌ 3-0-30-0, నీషమ్‌ 2-0-17-1, అశ్విన్‌ 4-0-33-1, రవి 3-0-24-0.

పంజాబ్‌: రాహుల్‌ (సి) డానియల్‌ సామ్స్‌ (బి) అక్షర్‌ 15, మయాంక్‌ (రనౌట్‌) 5, గేల్‌ (బి) అశ్విన్‌ 29, పూరన్‌ (సి) పంత్‌ (బి) రబాడ 53, మ్యాక్స్‌వెల్‌ (సి) పంత్‌ (బి) రబాడ 32, హుడా (నాటౌట్‌) 15, నీషమ్‌ (నాటౌట్‌) 10, ఎక్స్‌ట్రాలు: 8, మొత్తం: 19 ఓవర్లలో 167/5. వికెట్ల పతనం: 1-17, 2-52, 3-56, 4-125, 5-147, బౌలింగ్‌: డానియల్‌ సామ్స్‌ 4-0-30-0, రబాడ 4-0-27-2, అక్షర్‌ 4-0-27-1, దేశ్‌పాండే 2-0-41-0, అశ్విన్‌ 4-0-27-1, స్టొయినిస్‌ 1-0-14-0.