కింగ్ కోహ్లీ

ఐసీసీ దశాబ్దపు అత్యుత్తమ క్రికెటర్, వన్డే ప్లేయర్‌గా విరాట్
స్పిరిట్ ఆఫ్ క్రికెట్ పురస్కారం ధోనీకి
మహిళల అవార్డుల్లో మూడు ఎలీస్ పెర్రీకే
దుబాయ్: అద్భుతమైన ఆట, అసామాన్యమైన నిలకడ, లెక్కకు మిక్కిలి రికార్డులు సాధించిన టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకే ఐసీసీ ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. ఐసీసీ దశాబ్దపు అత్యుత్తమ ప్లేయర్‌గా సర్ గ్యారీ సోబర్స్ అవార్డును రన్‌మెషీన్ విరాట్ సొంతం చేసుకున్నాడు. అలాగే వన్డే క్రికెటర్ ఆఫ్ ది డెకేడ్ అవార్డును దక్కించుకొని.. ఈ 10ఏండ్లలో క్రికెట్ కింగ్ తానేనని చాటిచెప్పాడు. దశాబ్దపు ఐసీసీ క్రీడాస్ఫూర్తి(స్పిరిట్ ఆఫ్ క్రికెట్) అవార్డు టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని వరించింది. ట్విట్టర్ వేదికగా ఈ ప్రతిష్టాత్మక అవార్డులను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సోమవారం ప్రకటించింది. దశాబ్దపు అత్యుత్తమ టెస్టు క్రికెటర్‌గా ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్, టీ20లకు ఆఫ్ఘనిస్థాన్ స్పిన్ సంచలనం రషీద్ ఖాన్ అవార్డులు దక్కించుకున్నారు.
పదేండ్లలో 70 శతకాలు
పదేండ్లలో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధికంగా 70 శతకాలు చేసిన కోహ్లీకి బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది డెకేడ్ దక్కింది. ఇదే వ్యవధిలో కోహ్లీ అందరికంటే అత్యధిక అర్ధశతకాలు (94), అత్యధిక పరుగులు (20,396), ఎక్కువ సగటు (56.97) నమోదు చేశాడు. ఈ పురస్కారం కోసం అశ్విన్, జో రూట్, కుమార సంగక్కర, స్టీవ్ స్మిత్, ఏబీ డివిలియర్స్, కేన్ విలియమ్సన్ పోటీలో ఉన్నా అందరికంటే అత్యుత్తమ గణాంకాలు ఉన్న విరాట్‌కే దక్కింది. వన్డేల్లోనూ ఈ దశాబ్ద కాలంలో పది వేల పరుగులు (39 శతకాలు, 48 అర్ధశతకాలు, 61.83 సగటు) చేసిన ఏకైక ప్లేయర్ కోహ్లీనే. దీంతో దశాబ్దపు వన్డే క్రికెటర్ అవార్డు సైతం అతడినే వరించింది. ఓవరాల్‌గా వన్డేల్లో 12,040, టెస్టుల్లో 7,318, టీ20ల్లో 2,928 పరుగులు చేసిన కోహ్లీ.. అన్ని ఫార్మాట్లలో 50కు పైగా సగటు నమోదు చేయడం విశేషం.
వహ్వా రషీద్
ఈ దశాబ్దపు అత్యుత్తమ టీ20 క్రికెటర్ అవార్డు ఆఫ్ఘనిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు దక్కింది. బ్యాట్స్‌మెన్ ఆటగా పేరొందిన పొట్టిక్రికెట్లో హార్డ్ హిట్టర్లను మట్టికరిపిస్తూ రషీద్ ఈ పురస్కారాన్ని కైవసం చేసుకున్నాడు. పదేండ్ల కాలంలో ఈ యువ లెగ్ స్పిన్నర్ 48 అంతర్జాతీయ టీ20ల్లో 12.62 సగటుతో 89 వికెట్లు తీసి సత్తాచాటాడు. ఆప్ఘనిస్థాన్ ప్లేయర్‌గా ఈ అవార్డు సాధించడం ఎంతో ఆనందంగా ఉందని, ఇది తనకు ప్రత్యేకమైన విజయమని రషీద్ చెప్పాడు. కాగా మహిళల క్రికెట్లో దశాబ్దపు అత్యత్తమ క్రికెటర్, వన్డే, టీ20 బెస్ట్ ప్లేయర్ అవార్డులన్నీ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఎలీస్ పెర్రీకి దక్కాయి.
ధోనీకి అందుకే..
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 2011లో ఇంగ్లండ్‌తో నాటింగ్‌హామ్ టెస్టులో చూపిన క్రీడాస్ఫూర్తికి ఐసీసీ ‘డెకేడ్ స్పిరిట్ ఆఫ్ క్రికెట్' అవార్డు దక్కింది. ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ మోర్గాన్ షాట్ ఆడగా.. బౌండరీ సమీపంలో ప్రవీణ్ కుమార్ బంతిని ఆపాడు. అప్పటికే మూడు పరుగులు పూర్తిచేసిన బెల్-మోర్గాన్.. బంతి గీత దాటినట్లు భావించి పిచ్ మధ్యలో ఉండిపోయారు. అదే సమయంలో ప్రవీణ్ బంతిని త్రో చేయడం.. భారత ఫీల్డర్లు రనౌట్‌కు అప్పీల్ చేయడం చకచకా జరిగిపోయాయి. దీంతో థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. టీ సమయంలో అప్పటి ఇంగ్లండ్ కెప్టెన్ స్ట్రాస్, కోచ్ ఆండీ ఫ్లవర్ టీమ్ఇండియా డ్రెస్సింగ్‌రూమ్‌కు వెళ్లి అప్పీల్‌ను వెనక్కి తీసుకోవాలని కోరగా.. ప్రత్యర్థి ప్రతిపాదనకు ధోనీ అంగీకరించాడు.
అవార్డుల విజేతలు
ఐసీసీ దశాబ్దపు పురుష క్రికెటర్ (సర్ గ్యారీ సోబర్స్ అవార్డు),
వన్డే ఆటగాడు - విరాట్ కోహ్లీ
ఐసీసీ దశాబ్దపు మహిళా క్రికెటర్ (రేచల్ హేహోయ్ - ఫ్లింట్ అవార్డు), వన్డే, టీ20 ప్లేయర్ - ఎలీస్ పెర్రీ
ఐసీసీ దశాబ్దపు పురుషుల టెస్టు క్రికెటర్ - స్టీవ్ స్మిత్
ఐసీసీ దశాబ్దపు పురుషుల టీ20 క్రికెటర్ - రషీద్ ఖాన్
ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు - ఎంఎస్ ధోనీ
వ్యక్తిగత ప్రదర్శనపై ఎక్కువగా ఏకాగ్రత పెడితే నిలకడ సాధ్యం కాదని నేను అనుకుంటా. ఎలాగైనా జట్టును
గెలిపించాలన్న కసితో మైదానంలోకి అడుగుపెడితే కచ్చితంగా పరిమితులకు మించి అద్భుత ప్రదర్శన చేయవచ్చు. నేను ఎప్పుడూ అదే మైండ్‌సెట్‌తో ఉంటా. జట్టు కోసం సర్వశక్తులూ ఒడ్డుతా. టీమ్‌గా మేమంతా ఇదే విధంగా ముందుకు సాగుతున్నాం. - విరాట్ కోహ్లీ
తాజావార్తలు
- పటాన్చెరులో ఏటీఎం చోరీకి విఫలయత్నం
- నేను ఐశ్వర్యరాయ్ కుర్రాడినంటూ ఓ వ్యక్తి హల్ చల్
- అదుపు తప్పి బోల్తా పడ్డ లారీ.. ఇద్దరు మృతి
- దేశంలో కొత్తగా 14 వేల కరోనా కేసులు
- దేశంలో కోల్డ్‌వేవ్ పరిస్థితులు
- మాల్దీవులలో మాస్త్ ఎంజాయ్ చేస్తున్న మంచు లక్ష్మీ ఫ్యామిలీ
- ఘనంగా నటుడు శోభన్ బాబు జయంతి
- కథ డిమాండ్ చేస్తే గ్లామర్ షోకు రెడీ అంటున్న ప్రియమణి
- యూకేలో జూలై 17 వరకు లాక్డౌన్ పొండగింపు
- పెళ్లికి ముందు కారు యాక్సిడెంట్ చేసిన వరుణ్