గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Mar 03, 2020 , 01:00:32

కూలీ ఇంటపతకాల పంట

కూలీ ఇంటపతకాల పంట

మెడల్స్‌తో మెరుస్తున్న పాలమూరు బిడ్డ స్టిపుల్‌ చేజ్‌లో మహేశ్వరి జాతీయ రికార్డులు పాలమూరులోని మారుమూల గ్రామం నుంచి వచ్చిన ఆ అమ్మాయి జాతీయస్థాయి టోర్నీల్లో పతకాల పంట పండిస్తున్నది. కష్టాల అడ్డంకులను అధిగమిస్తూ రికార్డులు తిరగరాస్తున్నది. ప్రతీటోర్నీకి ప్రదర్శనను మెరుగుపరుచుకుంటూ మేటి అథ్లెట్‌గా ఎదుగుతున్నది. ఆ తెలంగాణ యువకెరటమే ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో రజతం సాధించిన మహేశ్వరి. తల్లిదండ్రులు కూలిపనులు చేస్తూ పడుతున్న కష్టాలను పరుగుతో దూరం చేయాలని చిన్నతనంలోనే మహేశ్వరి నిశ్చయించుకుంది. కఠోర శ్రమ చేసింది. నాగపురి రమేశ్‌ ప్రోత్సాహం, సాయ్‌-గోపిచంద్‌ మైత్ర ప్రాజెక్టులో శిక్షణ పొందుతూ మరింత రాటుదేలుతున్నది. జాతీయ టోర్నీల్లో లెక్కకు మిక్కిలి పతకాలు సాధిస్తూ.. ఒలింపిక్స్‌లో పాల్గొనడమే లక్ష్యమని చెప్తున్న మహేశ్వరిపై ప్రత్యేక కథనం..

నమస్తే తెలంగాణ క్రీడావిభాగం: దినసరి కూలీ ఇంట పుట్టిన తెలంగాణ యువ అథ్లెట్‌ జి.మహేశ్వరి జాతీయస్థాయి పోటీల్లో అద్భుత ప్రదర్శనలతో పతకాల పంట పండిస్తున్నది. జీవితంలో ఎన్నో కష్టాలను దాటుకొచ్చిన ఆ పాలమూరు విద్యార్థిని ట్రాక్‌పై చిరుతలా పరుగెత్తుతున్నది. జాతీయ అథ్లెటిక్స్‌ కోచ్‌ నాగపురి రమేశ్‌ చేయూతతో మూడేండ్ల క్రితం ట్రాక్‌పై అడుగుపెట్టిన మహేశ్వరి ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. జాతీయస్థాయిలో పతకాలను కైవసం చేసుకుంటూ తెలంగాణ ప్రతిష్ఠను మరింత పెంచుతున్నది. కఠినతరమైన స్టిపుల్‌చేజ్‌లో నేషనల్‌ రికార్డులను తిరగరాస్తూ మేటి అథ్లెట్‌గా రూపొందుతున్నది. ప్రభుత్వం ఉద్యోగం ఇప్పిస్తే పేదరికంలో ఉన్న తన కుటుంబానికి భరోసా దొరుకుతుందని, 2024 ఒలింపిక్సే లక్ష్యంగా కష్టపడుతున్నానని చెబుతున్నది. ప్రస్తుతం షాద్‌నగర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ మొదటి సంవత్సరం చదువుతున్న మహేశ్వరి.. తాజాగా జరిగిన ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో పాలమూరు విశ్వవిద్యాలయం తరఫున రజత పతకం(3వేల మీటర్ల స్టిపుల్‌చేజ్‌) కైవసం చేసుకుంది. 


కష్టాల కడలి.. కఠోర శ్రమ.. 

మహబూబ్‌ నగర్‌ జిల్లా భూత్పూర్‌ మండలంలోని ఎల్కిచెర్ల గ్రామం మహేశ్వరి సొంతూరు. ఆమె తల్లి లక్ష్మమ్మ, తండ్రి నరసింహులు ఇద్దరూ దినసరి కూలీలే. నలుగురు సంతానంలో మహేశ్వరి వయసులో పెద్ద. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. ఈ పరిస్థితుల్లో చదువుకుంటూనే ఖాళీ సమయాల్లో తల్లిదండ్రులతో కలిసి మహేశ్వరి కూడా పనులకు వెళ్లేది. ఆ సమయంలో కష్టాల కడలిని దాటాలన్న ఆకాంక్షతో పరుగును ప్రారంభించింది. పాఠశాలకు క్రమం తప్పకుండా వెళ్తూనే ఉదయం, సాయంత్రం తీవ్రంగా ప్రాక్టీస్‌ చేసేది. ఒక్కోసారి రాత్రి 9గంటల వరకు కూడా శ్రమించేది. దీంతో ఆమె పరుగులో వేగం పెరిగింది. పాఠశాల స్థాయిలోనే అద్భుత ప్రతిభ కనబరుస్తున్న మహేశ్వరిని మహబూబ్‌ నగర్‌ జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్‌ గుర్తించారు. 


తొలి పోటీ నుంచే.. 

తొలిసారిగా 2017లో సౌత్‌జోన్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ మీట్‌లో మహేశ్వరి జాతీయస్థాయి పోటీలో అడుగుపెట్టింది. ఆ టోర్నీలో మహిళల 800మీటర్ల పరుగు బరిలోకి దిగిన తెలంగాణ అమ్మాయి సత్తాచాటింది. రెండోస్థానంలో నిలిచి రజతాన్ని కైవసం చేసుకొని.. పతకాల ప్రస్థానాన్ని ప్రారంభించింది. అనంతరం కొన్ని టోర్నీల తర్వాత కోచ్‌ నాగపురి రమేశ్‌ సలహాతో స్టిపుల్‌ చేజ్‌కు మారిన మహేశ్వరి మరింత మెరుగ్గా రాణించడం ప్రారంభించింది. 


ఉద్యోగం కల్పిస్తే బాగుంటది 

ప్రభుత్వ ఉద్యోగం వస్తే పేదరికంలో ఉన్న మా కుటుంబం కష్టాలు కొంతైనా తీరతాయి. అలాగే గచ్చిబౌలి స్టేడియంలో ప్రత్యేక ట్రాక్‌, జిమ్‌ లేకపోవడంతో పూర్తిస్థాయిలో ప్రాక్టీస్‌ చేయలేకున్నాం. ఆ సదుపాయాలు కల్పిస్తే మెరుగ్గా రాణించే అవకాశముంటుంది. రమేశ్‌ సర్‌ ప్రోత్సాహంతోనే ఈస్థాయికి రాగలిగా. 2024 ఒలింపిక్స్‌లో బరిలోకి దిగాలన్నదే నా లక్ష్యం. 

-మహేశ్వరి 


సాధించిన పతకాలు  

2018: జూనియర్‌ ఫెడరేషన్‌ కప్‌లో రజత పతకం 52వ జాతీయ క్రాస్‌కంట్రీలో రజత పతకం 

2019: 35వ జాతీయ జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం 17వ  జూనియర్‌ ఫెడరేషన్‌ కప్‌లో పసిడి పతకం 31వ జాతీయ సౌత్‌జోన్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ 

చాంపియన్‌షిప్‌(2000మీ)లో స్వర్ణ పతకం 31వ జాతీయ సౌత్‌జోన్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌(1500మీ)లో రజత పతకం 

2020: ఖేల్‌ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో రజత పతకం 


రమేశ్‌ ప్రోత్సాహంతో.. 


మహేశ్వరి పరుగు వేగాన్ని చూసిన రాజేంద్ర ఆమెను జాతీయ అథ్లెటిక్స్‌ కోచ్‌, ద్రోణాచార్య అవార్డీ నాగపురి రమేశ్‌ వద్దకు తీసుకెళ్లారు. దీంతో మహేశ్వరి కెరీర్‌ మరో మలుపు తీసుకుంది. ఆమె అథ్లెటిక్స్‌  పయనం మొదలైంది. మహేశ్వరిని హైదరాబాద్‌కు పంపేందుకు తల్లిదండ్రులకు స్థోమత లేదు. ఆ సమయంలో రమేశ్‌ అన్ని ఖర్చులను భరించి ఆమె అథ్లెట్‌గా మారేందుకు ప్రోత్సహించారు. ఆ తర్వాత సాయ్‌ వసతి గృహంలో చోటు దక్కడంతో మహేశ్వరి వెనుదిరిగి చూసుకోలేదు. అలాగే సాయ్‌ - గోపీచంద్‌ మైత్ర ప్రాజెక్టు కింద శిక్షణ తీసుకుంటూ మరింత మెరుగవుతున్నది. వివిధ టోర్నీల్లో పాల్గొనేందుకు మహేశ్వరికి సాయ్‌ - గోపీచంద్‌ మైత్ర విమాన ప్రయాణ ఖర్చులతో పాటు మరింత తోడ్పాటునందిస్తున్నది. logo
>>>>>>