మంగళవారం 31 మార్చి 2020
Sports - Mar 18, 2020 , 01:27:43

క్రీడా కుసుమాలు

క్రీడా కుసుమాలు

-జాతీయస్థాయిలో రాణిస్తున్న ఖమ్మం క్రీడాకారులు 

-ఆర్చరీలో అదరగొడుతున్న ఔచిత్య, హర్షిత చౌదరి 

-వాలీబాల్‌లో అక్కాచెల్లెళ్ల జోరు 

జాతీయ స్థాయిలో ఖమ్మం జిల్లా క్రీడాకారులు అదరగొడుతున్నారు. టోర్నీ ఏదైనా పతకాలే లక్ష్యంగా దూసుకెళుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన సదుపాయాలను సద్వినియోగం చేసుకుంటూ  ప్రతిభను చాటుకుంటున్నారు. నగరంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో వాలీబాల్‌, ఆర్చరీ విభాగాల్లో  జిల్లాకు చెందిన కావ్య, రిషిత, ఔచిత్య, హర్షిత తమదైన రీతిలో దూసుకెళుతున్నారు.   చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ రాష్ట్ర ఖ్యాతిని దశదిశలా ఇనుమడింపజేస్తున్న  వీరి పతక ప్రదర్శనపై ఓ కథనం.. 

మయూరి సెంటర్‌, ఖమ్మం: ఖమ్మం జిల్లా క్రీడాకారులు జాతీయ స్థాయి వాలీబాల్‌, ఆర్చరీలో మెరుగ్గా రాణిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాశాఖ ద్వారా జిల్లాకు రూ.12 కోట్లతో అత్యుత్తమ సదుపాయాలతో స్టేడియాలు ఏర్పాటు చేసింది. వీటి ద్వారా పలువురు క్రీడాకారులు ఆయా విభాగాల్లో శిక్షణ పొందుతున్నారు. ముఖ్యంగా వాలీబాల్‌, ఆర్చరీ విభాగాల్లో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌(ఎస్‌జీఎఫ్‌) ఆధ్వర్యంలో మరింతగా రాటుదేలుతున్నారు. వాలీబాల్‌లో జిల్లాకు చెందిన కావ్య, రిషిత ఆకట్టుకుంటున్నారు.  ఒకే కుటుంబానికి చెందిన వీరిద్దరు అండర్‌-14, 19 విభాగాల్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. కావ్య ప్రస్తుతం పోలీస్‌ కానిస్టేబుల్‌ శిక్షణ తీసుకుంటున్నది. ఇక ఆర్చరీ విషయానికొస్తే...ఔచిత్య, హర్షిత తమదైన ప్రతిభతో ముందుకెళుతున్నారు. గతేడాది  ఆగస్టు 6వ తేదిన రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ నగరంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో ఆర్చరీ ప్రాంగణాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి నగరంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు ఆర్చరీలో తర్ఫీదు పొం దుతున్నారు. జిల్లాకు చెందిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ చొరవతో  క్రీడాభివృద్ధి మరింత వేగవంతమైంది.  


 వాలీబాల్‌ అంటే ఎంతో ఇష్టం: మొక్క కావ్య 

హకీం పేట స్పోర్ట్స్‌ పాఠశాలలో 4వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు చదివాను. అప్పటి నుంచి వాలీబాల్‌పై ఆసక్తి ఏర్పడింది. ఇప్పటివరకు 68 రాష్ట్ర మీట్‌లు ఆడా.  భువనేశ్వర్‌లో జరిగిన జాతీయ స్థాయి సీనియర్స్‌ పోటీల్లో పాల్గొన్నాను. ఖమ్మం జిల్లా కేంద్రం వాలీబాల్‌ ఆడేందుకు అనువైన ప్రాంతం కావడంతో పాటు కోచ్‌ అక్బర్‌ ఇచ్చిన శిక్షణతో జాతీయస్థాయి వరకు వెళ్లగలిగాను. ఎనిమిది రాష్ర్టాల్లో వివిధ టోర్నీలు ఆడి జాతీయస్థాయికి ఎదిగాను. ప్రస్తుతం హైదరాబాద్‌లో భాగ్యరెడ్డి వెంకటరామ రెడ్డి కాలేజీలో డిగ్రీ చదువుతున్నాను. ఇటీవలి పోలీస్‌ కానిస్టేబుల్‌ నోటిఫికేషన్‌లో ఉద్యోగం సాధిం చి శిక్షణ తీసుకుంటున్నాను. మా నాన్న పోలీస్‌ శాఖలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఖమ్మంలోని గొల్లగూడెం రోడ్‌ మధురానగర్‌లో నివాసం ఉంటున్నాం. మేము నలుగురు అక్కాచెల్లెలం.  


అక్క నాకు స్ఫూర్తి: మొక్క రిషిత 

మా అక్క కావ్యను స్ఫూర్తిగా తీసుకుని వాలీబాల్‌ క్రీడను ఎంచుకున్నాను.  అండర్‌-14 విభాగంలో రాష్ట్రస్థాయి పోటీల్లో ఖమ్మం తరఫున ప్రాతినిధ్యం వహించాను. ఇందులో భాగంగా కామారెడ్డి, మంచిర్యాల, మహబూబ్‌నగర్‌లో జరిగిన టోర్నీల్లో పాల్గొన్నాను. పాఠశాల స్థాయి పోటీల్లో స్వర్ణ పతకాలు సాధించాను. మా నాన్న రాంబాబు.. చదువు, క్రీడల్లో నన్ను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. మా పాఠశాల సహకారంతో జాతీయ స్థాయి పోటీల్లో రాణిస్తూ రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింప జేయాలనుకుంటున్నాను.  
నాన్న ప్రోత్సాహంతో: ఔచిత్య 

నాన్న ఇచ్చిన ప్రోత్సాహంతో ఆర్చరీలోనేను అద్భుత ఫలితాలు సాధిస్తున్నాను. గతేడాది కాలంగా జిల్లా కేంద్రంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో ఆర్చరీలో శిక్షణ తీసుకుంటున్నాను. భువనేశ్వర్‌లో జరిగిన జాతీయస్థాయి ఆర్చరీ టోర్నీలో స్వర్ణ పతకంతో ఉత్త మ  క్రీడాకారిణిగా నిలిచాను. రాష్ట్రస్థాయి పోటీల్లో  కేంద్రీ య విద్యాలయం తరఫున బరిలోకి దిగి పసిడి పతకంతో మెరిశాను. దీంతో పాటు భువనేశ్వర్‌, వారణాసిలో జరిగిన వేర్వేరు టోర్నీలో మెరుగైన ప్రతిభ కనబరిచాను. బ్యాంక్‌ ఉద్యోగి అయిన మా నాన్న అందిస్తున్న మద్దతు మాటల్లో వర్ణించలేనిది.  


విలువిద్య సాధనకు శ్రమించేదాన్ని: హర్షిత 

స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌జీఎఫ్‌) ఆధ్వర్యంలో జరిగిన వివిధ రాష్ట్ర స్థాయి టోర్నీల్లో అనేక పతకాలు కొల్లగొట్టాను. రాష్ట్ర స్థాయి సీనియర్స్‌ విభాగంలో రజత పతకంతో ఆకట్టుకున్నాను. జార్ఖండ్‌లో జరిగిన జాతీయస్థాయి ఆర్చరీ పాల్గొని సత్తాచాటాను. మా నాన్న  అమరనేని గాంధీ ఇచ్చిన ప్రోత్సాహంతో ఇటు చదువుతో పాటు ఆర్చరీలోనూ రాణిస్తున్నాను. 


logo
>>>>>>