గురువారం 04 జూన్ 2020
Sports - Apr 02, 2020 , 22:59:51

టెస్టు క్రికెట్‌ నన్ను మార్చేసింది

టెస్టు క్రికెట్‌ నన్ను మార్చేసింది

  • ఆ ఫార్మాట్‌లో సాధ్యమైనంత కాలం కొనసాగుతా 
  • రొనాల్డో అంటే ఇష్టం 
  • పీటర్సన్‌తో ఇంటర్వ్యూలో భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ

న్యూఢిల్లీ: టెస్టు క్రికెట్‌ తన వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచిందని టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అన్నాడు. ఆడగలిగినంత కాలం టెస్టుల్లో తప్పకుండా కొనసాగుతానని స్పష్టం చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌తో విరాట్‌ గురువారం మాట్లాడాడు. టెస్టు క్రికెట్‌పై తన ఇష్టాన్ని, కెరీర్‌లో ఎదురైన గడ్డు పరిస్థితులను, వేగన్‌గా మారేందుకు కారణాలను వెల్లడించాడు. ఇష్టమైన ఫార్మాట్‌ ఏదని పీటర్సన్‌ అడిగిన ప్రశ్నకు.. కోహ్లీ వరుసగా ఐదుసార్లు టెస్ట్‌ క్రికెట్‌ అనిచెప్పాడు. నేను ఐదుసార్లు చెప్పా. 

ఎందుకంటే టెస్టులకు ప్రాతినిధ్యం వహించడమే నా జీవితంలో గొప్ప విషయం. పరుగులు చేసినా చేయకపోయినా.. వేరే వాళ్ల బ్యాటింగ్‌కు చప్పట్లు కొట్టినా.. ఆ తర్వాత రూమ్‌కు వెళ్లాల్సిందే. తర్వాతి రోజుకు సిద్ధమవ్వాల్సిందే. నచ్చినా నచ్చకపోయినా ప్రతిరోజు దీన్ని అనుకరించాల్సిందే. సం ప్రదాయ ఫార్మాట్‌ జీవితం లాంటిది. మొత్తంగా టెస్టు క్రికెట్‌ నా వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచింది అని కోహ్లీ బదులిచ్చాడు. అలాగే కెప్టెన్‌ను అయినంత మాత్రాన తాను దూకుడు తగ్గించుకోవాల్సిన అవసరం లేదని, ఎలా ఉన్నానో అలానే ఉంటానని చెప్పాడు. ఇప్పటి వరకు 86టెస్టులు ఆడిన కోహ్లీ 7240 పరుగులు చేసి, అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా ప్రశంసలు అందుకుంటున్నాడు. 

డివిలియర్స్‌ను స్లెడ్జ్‌ చేయలేను 

ఐపీఎల్‌లో తన జట్టు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు సభ్యుడు, దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ పట్ల తానెప్పుడూ దూకుడుగా ప్రవర్తించలేనని విరాట్‌ చెప్పాడు. ఏబీతో స్నేహం సుదీర్ఘంగా ఉంటుందని అన్నాడు.  ఒకరినొకరు గౌరవించుకోవడం ఐపీఎల్‌ ఎక్కువగా నేర్పించిందని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. మహేంద్ర సింగ్‌ ధోనీ, ఏబీల్లో ఎవరితో బ్యాటింగ్‌ చేయడం ఇష్టమని పీటర్సన్‌ అడుగగా... ఇద్దరితో వికెట్ల మధ్య పరుగెత్తడం అంటే తనకు చాలా ఇష్టమని విరాట్‌ సమాధానమిచ్చాడు. 

వేగన్‌గా మారింది అందుకే..

2018 దక్షిణాఫ్రికా పర్యటనలో కడుపు, మెడ ఎముకల సంబంధిత సమస్య రావడం తాను వేగన్‌గా మారినట్టు విరాట్‌ వెల్లడించాడు. తన కెరీర్‌లో 2014 ఇంగ్లండ్‌ సిరీస్‌లో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నానని చెప్పాడు. పరుగులు చేయడమే గగనమని ఆ సిరీస్‌లో అనిపించినట్టు.. కోహ్లీ చెప్పాడు. పోర్చుగల్‌ సాకర్‌ హీరో క్రిస్టియానో రొనాల్డో అంటే తనకెంతో ఇష్టమని అన్నాడు. 


logo