గురువారం 26 నవంబర్ 2020
Sports - Nov 13, 2020 , 00:47:48

రయ్‌.. రయ్‌

రయ్‌.. రయ్‌

  • బైక్‌ రేసింగ్‌లో దూసుకెళ్తున్న కార్తీక్‌
  • రాష్ర్టానికి వన్నె తెస్తున్న యువ రేసర్‌

అతడు ఎక్స్‌లేటర్‌ మీద చేయి వేశాడంటే.. బైక్‌ బుల్లెట్‌లా దూసుకెళ్తుంది. ట్రాక్‌పై అడుగుపెట్టాడంటే.. ప్రత్యర్థులకు భయం పట్టుకుంటుంది. అండగా నిలిచేవారు లేకున్నా.. అనుకున్నది సాధించాలనే తపన ఉంటే.. అంతర్జాతీయ స్థాయికి ఎదగొచ్చని నిరూపిస్తూ.. ఈ రంగంలోకి వచ్చిన మూడేండ్లలోనే నాలుగుసార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచిన ఆ కుర్రాడే యువ రేసర్‌ కార్తీక్‌ మాతేటి. గల్లీ రోడ్లపై స్టంట్స్‌తో కెరీర్‌ ప్రారంభించి.. ఆసియా రోడ్‌ రేసింగ్‌ చాంపియన్‌షిప్‌లో అవార్డు అందుకున్న కార్తీక్‌.. సరైన ప్రోత్సాహం లభిస్తే అద్భుతాలు చేసేందుకు సిద్ధమంటున్నాడు. ఖరీదైన క్రీడలో ఉన్న కష్ట నష్టాలతో పాటు సమీప భవిష్యత్తులో రేసింగ్‌ కెరీర్‌పై అతడి అంతరంగం.. 

నమస్తే తెలంగాణ క్రీడావిభాగం:రోడ్లపై సర్కస్‌ ఫీట్లు చేస్తూ బండి నడపడం కంటే.. ఆ కిటుకులను పాఠశాలల్లో ప్రదర్శించి దాని ద్వారా ఉపాధి పొందాలనుకున్నా.. ఈ క్రమంలో అనేక ప్రదర్శనలు ఇవ్వడంతో రేసింగ్‌ వైపు మనసు మల్లింది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంతే కావడంతో వారిని కష్టపెట్టడం ఇష్టం లేక సొంతంగానే ప్రయత్నాలు ప్రారంభించా. ఈ క్రమంలో తెలిసిన స్నేహితుల ద్వారా రేసింగ్‌ క్లబ్‌లో జాయిన్‌ అయ్యా. అప్పటి వరకు ఎక్కడా శిక్షణ తీసుకోని నేను ప్రొఫెషనల్‌ రేసర్లను దగ్గర నుంచి చూసి మెలకువలు నేర్చుకున్నా. 2016లో ప్రొఫెషనల్‌ రేసర్‌గా కెరీర్‌ ప్రారంభించిన అనంతరం పాల్గొన్న తొలి రేస్‌లోనే విజేతగా నిలిచా. అప్పుడు వచ్చిన ట్రోఫీతో ఇంటికి వెళ్లేవరకు కుటుంబ సభ్యులకు నేను రేసర్‌గా ప్రయత్నిస్తున్నాననే విషయం చెప్పలేదు. లైఫ్‌ రిస్క్‌తో కూడుకున్న కెరీర్‌ కాబట్టి కుటుంబ సభ్యులు అంత తొందరగా అంగీకరించలేదు. ఏడాది తర్వాత నాపై ఉన్న నమ్మకంతో ప్రోత్సహించడం ప్రారంభించారు. 

ఆర్థిక ఇబ్బందుల వల్లే..

ఫార్ములా వన్‌ మాదిరిగానే బైక్‌ రేసింగ్‌లోనూ ఏడాది మొత్తం రేస్‌లు జరుగుతూ ఉంటాయి. అయితే మన దేశంలో వాటికి పెద్దగా ఆదరణ లేదు. అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనాలంటే ఆర్థిక ఇబ్బందులు అడ్డు తగులుతున్నాయి. ఒక మాదిరి  రేస్‌లో పాల్గొనాలంటే తక్కువలో తక్కువ లక్ష రూపాయల వరకు ఖర్చు వస్తుంది. అయితే అందులో సత్తాచాటి విజేతగా నిలిచినా.. ప్రైజ్‌మనీ మాత్రం దాంట్లో పదో వంతు కూడా చేతికందదు. ఇలాంటి ఖరీదైన క్రీడలో రాణించేందుకు సరైన స్పాన్సర్‌ లేకపోవడంతో అనుకున్న రేసుల్లో పాల్గొనలేకపోతున్నా. ప్రభుత్వం నుంచి సహకారం లభిస్తే అంతర్జాతీయ స్థాయిలో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తా.

రేసింగ్‌ కెరీర్‌కు మంచిరోజులు..

రానున్న పదేండ్లలో దేశంలో రేసింగ్‌కు విపరీతమైన క్రేజ్‌ రానుంది. క్రికెట్‌, బ్యాడ్మింటన్‌ను దాటి ఇప్పుడిప్పుడే యువత కొత్త క్రీడల వైపు చూస్తున్నది. దేశంలో త్వరలోనే మరో రెండు ట్రాక్‌లు రానున్నాయి. హైదరాబాద్‌లోనూ కొత్త రేస్‌ ట్రాక్‌ ప్రారంభం కానుంది. దుండిగల్‌ వేదికగా ప్రస్తుతం ఆ పనులు జరుగుతున్నాయి. అది ప్రారంభమైతే సిటీలో రేసింగ్‌కు ఆదరణ పెరుగుతుంది. ప్రస్తుతం నా దగ్గర శిక్షణ పొందుతున్న వారిలో అమ్మాయిలు కూడా ఉన్నారు.

పక్కా హైదరాబాదీ

సహజసిద్ధంగా అబ్బిన వేగానికి నైపుణ్యం తోడవడంతో వరుస విజయాలు పలకరించాయి. 2017లో తొలిసారి జాతీయ చాంపియన్‌గా నిలిచాను. ప్రస్తుతం జాతీయ బైక్‌ రేసింగ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నది నేనొక్కడినే. రోడ్‌ రేస్‌ గ్రూప్‌ ‘డి’లో ‘ఫాస్టెస్ట్‌ ఇండియన్‌'రికార్డు నా పేరిటే ఉంది. మంచి ఊపు మీదున్న సమయంలో ఢిల్లీ వేదికగా జరిగిన ఆసియా కప్‌ రోడ్‌ రేసింగ్‌ (2018) చాంపియన్‌షిప్‌లో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ లభించింది. అంతర్జాతీయ వేదికపై సత్తాచాటే అవకాశాన్ని రెండు చేతులతో ఒడిసి పట్టుకోవాలని ఉద్దేశంతో తీవ్రంగా శ్రమించా. అందుకు తగ్గట్లే  చాంపియన్‌గా నిలిచా. కెరీర్‌ ఆరంభించిన ప్రారంభంలోనే అంతర్జాతీయ టైటిల్‌ దక్కడం అంతులేని ఆత్మవిశ్వాసాన్నిచ్చింది. మొత్తంగా ఇప్పటివరకు 50 రేసుల్లో పాల్గొంటే అందులో.. 40 సార్లు పోడియంపై నిలిచా.