మంగళవారం 20 అక్టోబర్ 2020
Sports - Sep 21, 2020 , 01:43:02

హైదరాబాద్‌లో మల్లీశ్వరి అకాడమీకి కృషి

హైదరాబాద్‌లో మల్లీశ్వరి అకాడమీకి కృషి

  • టీస్పోర్ట్స్‌ చైర్మన్‌ జగన్‌మోహన్‌ రావు 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: తెలుగు తేజం కరణం మల్లీశ్వరితో హైదరాబాద్‌లో వెయిట్‌ లిఫ్టింగ్‌ అకాడమీ ఏర్పాటుకు కృషి చేస్తామని జాతీయ హ్యాండ్‌బాల్‌ సంఘం ఉపాధ్యక్షుడు జగన్‌మోహన్‌ రావు అన్నారు. సిడ్నీ(2000) ఒలింపిక్స్‌లో మల్లీశ్వరి కాంస్య పతకం సాధించి 20 ఏండ్లు అయిన సందర్భంగా ఆదివారం టీస్పోర్ట్స్‌ ఆమెతో వెబినార్‌ నిర్వహించింది. ఇందులో సాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి, రాష్ట్ర వెయిట్‌  లిఫ్టింగ్‌ అధ్యక్షుడు సాయిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్‌మోహన్‌ రావు మాట్లాడుతూ రాష్ట్రం లో ప్రతిభ కల్గిన వెయిట్‌లిఫ్టర్లకు కొదువలేదని అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా శిక్షణ సౌకర్యం లేక వారు వెలుగులోకి రావడం లేదని పేర్కొన్నారు. హైదరాబాద్‌ కేంద్రంగా యువ లిఫ్టర్లను సానబట్టేందుకు మల్లీశ్వరి ఫౌండేషన్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన మల్లీశ్వరి..ప్రభుత్వం సహకారమందిస్తే తెలంగాణలో తప్పకుండా సేవలందిస్తామని హామీ ఇచ్చారు. తెలుగు రాష్ర్టాల ప్లేయర్ల అభ్యున్నతి కోసం పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉంటానని ఆమె పేర్కొంది. హైదరాబాద్‌కు రావాల్సిందిగా మల్లీశ్వరిని సాట్స్‌ చైర్మన్‌ ఆహ్వానించారు. క్రీడా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సహకారంతో సీఎం కేసీఆర్‌ను కలిసి రాష్ట్రంలో వెయిట్‌లిఫ్టింగ్‌ అభివృద్ధిపై సమావేశమవుదామని ఆయన పేర్కొన్నారు. 


logo