బుధవారం 24 ఫిబ్రవరి 2021
Sports - Jan 29, 2021 , 02:26:17

అద్భుతాన్ని.. ఊహించలేదు

అద్భుతాన్ని.. ఊహించలేదు

  • ఆస్ట్రేలియాలో టీమ్‌ఇండియా అదరగొట్టింది 
  • హైదరాబాదీ పేసర్‌ సిరాజ్‌ మెరుగ్గా రాణించాడు 
  • సాధ్యమైతే రోజంతా గోల్ఫ్‌ ఆడాలనుకుంటా 
  • ‘నమస్తే తెలంగాణ’తో క్రికెట్‌ దిగ్గజం కపిల్‌దేవ్‌

ఆటగాళ్లకు గాయాలు, కెప్టెన్‌ కోహ్లీ గైర్హాజరు.. ఇలా ఎన్నో ప్రతికూలతల మధ్య ఆస్ట్రేలియాపై టీమ్‌ఇండియా టెస్టు సిరీస్‌ విజయం అద్భుతమని క్రికెట్‌ దిగ్గజం కపిల్‌దేవ్‌ పేర్కొన్నాడు. నాలుగు దశాబ్దాల్లో తాను చూసిన అపూర్వ గెలుపు ఇదేనని అన్నాడు. ఇంగ్లండ్‌తో స్వదేశీ సిరీస్‌లోనూ భారత్‌ ఇదే ప్రదర్శనను కొనసాగిస్తుందని ఆకాంక్షించాడు. గోల్ఫ్‌ అంటే తనకు అమితమైన ఇష్టమని, గోల్ఫ్‌ కోర్సులోనే ఇల్లు కట్టుకోవాలని అనుకుంటానని కపిల్‌ చెప్పాడు. వికారాబాద్‌లోని హల్దీ గోల్ఫ్‌ క్లబ్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన కపిల్‌దేవ్‌ పలు అంశాలపై ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడాడు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. 

నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి:ఆస్ట్రేలియాలో భారత జట్టు అద్భుతం చేసింది. అత్యంత ముఖ్యమైన బ్యాట్స్‌మన్‌, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ స్వదేశానికి వచ్చేశాడు. షమీ, ఉమేశ్‌ ఆ తర్వాత అశ్విన్‌, జడేజా, విహారి ఇలా సగం జట్టుకన్నా ఎక్కువ మంది ఆటగాళ్లు గాయాల పాలయ్యారు. అలాంటి సమయంలో ఆసీస్‌ గడ్డపై భారత్‌ టెస్టు సిరీస్‌ గెలుస్తుందని నేను ఊహించలేదు. అయితే టీమ్‌ఇండియా వీరోచితంగా పోరాడింది. అలాంటి ఆట ఆడిన భారత జట్టుకు హ్యాట్సాఫ్‌. గత నాలుగు దశాబ్దాల్లో నేను చూసిన అద్భుతమైన ఆట ఇదే. స్వదేశంలో త్వరలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లోనూ భారత్‌ ఇదే ప్రదర్శనను కొనసాగిస్తుందని ఆశిస్తున్నా. ఆసీస్‌లో చరిత్రాత్మక విజయం తర్వాత  అంచనాలు మరింత పెరిగాయి. 

కెప్టెన్సీ విభజన కష్టమే 

కెప్టెన్‌ ఎంపిక అంశం సెలెక్టర్లకే వదిలేయాలి. ఒకవేళ మూడు ఫార్మాట్లకు సారథ్యం వహించి విపరీతమైన ఒత్తిడికి గురయితే విశ్రాంతి ఇవ్వొచ్చని నేను అనుకుంటా. మన దేశంలో ఫార్మాట్‌కో కెప్టెన్‌ ఉండడం కష్టం. విరాట్‌ కోహ్లీ గైర్హాజరీలో జట్టుకు సారథ్యం వహించగల ఆటగాళ్లు మన జట్టులో ఉన్నారు. ఐపీఎల్‌, దేశవాళీ క్రికెట్‌ వల్ల చాలా మంది ప్లేయర్లు అనుభవం గడించారు. విరాట్‌ లేకపోయినా ఆస్ట్రేలియాలో భారత జట్టు ఏం చేసిందో చూశాం. రహానే అమోఘంగా జట్టును ముందుకు నడిపాడు. ఉన్నది తక్కువ అనుభవమే అయినా.. ఆటగాళ్లను గాయాలు ఇబ్బంది పెడుతున్నా.. జట్టును విజయతీరాలకు చేర్చాడు. రోహిత్‌ కూడా మెరుగైన కెప్టెనే. 

ప్రతిభావంతులు ఎందరో.. 

భారత క్రికెట్‌లో యువ ప్రతిభావంతులకు కొదువ లేదు. ఎందరో టాలెంటెడ్‌ క్రికెటర్లు ఉన్నారు. అయితే నిలకడగా సత్తాచాటాలి. శుభ్‌మన్‌ గిల్‌, పృథ్వీ షా లాంటి అద్భుతమైన ఆటగాళ్లు వస్తున్నారు. అయితే యువ ప్లేయర్లు సుదీర్ఘ కాలం పాటు నిలకడగా ఆడడం పట్ల దృష్టిసారించాలి. యువకులు అదరగొడుతుంటే చూడాలనదే నా ఆశ. 

నాకన్నా బాగా ఆడతారు

యువ ఆటగాళ్లను ఎవరితోనూ పోల్చడం సరికాదు. ఎవరి ప్రత్యేకత వారికి ఉంటుంది. నాతో అసలు పోల్చవద్దు. నా కంటే బాగా ఆడే సామర్థ్యం వారిలో ఉండొ చ్చు. వారు అలా సత్తాచాటాలని నేను కోరుకుంటా. తర్వాతి తరం గురించి మనం గర్వించాలి. మరింత మంది హీరోలను మనం చూడాలి. 

ప్రతీ మ్యాచ్‌ అపురూపమే 

క్రీడలను ప్రోత్సహించే కుటుంబంలో పుట్టడం, క్రికెటర్‌గా ఎదగడం నా అదృష్టమనుకుంటా. 15 ఏండ్ల పాటు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించా. దేశం కోసం మైదానంలోకి దిగిన ప్రతీసారి నాకు అద్భుతమైన క్షణాలే. భారత్‌ కోసం ఆడిన ప్రతి క్షణం మధురమే. 

సిరాజ్‌పై ఒత్తిడి తేవొద్దు  

ఆస్ట్రేలియాతో సిరీస్‌లో హైదరాబాదీ పేసర్‌ సిరాజ్‌ అద్భుతంగా రాణించాడు. అయితే అతడు ఇప్పుడిప్పుడే జట్టులోకి వచ్చాడు.. భారీ అంచనాలతో ఒత్తిడిలోకి నెట్టకూడదు. మరో ఐదేండ్లు స్వేచ్ఛగా ఆడనివ్వాలి. ఫాస్ట్‌ బౌలర్‌గా గాయాల పాలవకుండా సిరాజ్‌ జాగ్రత్త పడుతూ ముందుకు సాగాలి. భువనేశ్వర్‌, ఇషాంత్‌ శర్మ లాంటి గొప్ప ఫాస్ట్‌ బౌలర్లు ఇప్పటికే  గాయాలతో సమమతమవుతున్నారు. 

గోల్ఫ్‌ను ఆస్వాదిస్తున్నా 

వీలైతే సూర్యోదయం నుంచి అస్తమయం వరకు గోల్ఫ్‌ ఆడాలని నేను కోరుకుంటా. ఈ ఆట అంటే నాకు అంత ఇష్టం. సువిశాల పచ్చిక మైదానంలో.. పచ్చటి వాతావరణం మధ్య ఆడడం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. నా ఇల్లు గోల్ఫ్‌ కోర్స్‌ మధ్యలో ఉండాలని కోరుకుంటా. గోల్ఫ్‌ ఆటను ఆస్వాదిస్తున్నా. యూరప్‌, అమెరికాలో ఉన్నటువంటి గోల్ఫ్‌ కోర్సులు భారత్‌లో వస్తాయని ఎవరూ ఊహించలేదు. కానీ ప్రస్తుతం వాటికన్నా మెరుగైనవి కూడా మన దేశంలో ఉన్నాయి. 

VIDEOS

logo