Kapil Dev on Hardin Pandya Bowling | టీ20 ప్రపంచకప్ టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలో దిగుతున్న టీమిండియాను స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ సమస్య ఇబ్బంది పెడుతోంది. ఈ స్టార్ ప్లేయర్ ఐపీఎల్ రెండో దశలో కనీసం ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు.
దీంతో టీ20 ప్రపంచకప్‌లో అతను బౌలింగ్ చేస్తాడా? అనే ప్రశ్న అభిమానులతోపాటు క్రికెట్ విశ్లేషకులను కూడా వేధిస్తోంది. ఈ సమస్యపై టీమిండియా దిగ్గజం, మాజీ సారధి కపిల్ దేవ్ స్పందించాడు. హార్దిక్ పాండ్యా కనీసం 2 ఓవర్లు బౌలింగ్ వేసినా కూడా విరాట్ కోహ్లీ పని సులువవుతుందని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు.
హార్దిక్ బౌలింగ్ చేస్తే కోహ్లీ వద్ద ఉండే బౌలింగ్ ఆప్షన్లు మెరుగవుతాయని వెల్లడించాడు. సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్ ఇద్దరూ కూడా బౌలింగ్ చేయగలరని, వారు ఆడుతున్నప్పుడు ఎవరైనా బౌలర్‌ను ప్రత్యర్థులు దీటుగా ఎదుర్కొంటుంటే వాళ్లు బంతి అందుకునే వెసులుబాటు ఉండేదని విశ్లేషించాడు.
అలాగే హార్దిక్ కూడా బంతి అందుకుంటే మైదానంలో కోహ్లీకి ఉండే టెన్షన్ చాలా వరకు తగ్గుతుందని, అయితే ప్రస్తుత టీమిండియాలో అద్భుతమైన ట్యాలెంట్ ఉందని కపిల్ దేవ్ అన్నాడు. ఈ క్రమంలో హార్దిక్ బౌలింగ్ చేయకపోయినా భారత జట్టు అవకాశాలపై ఎటువంటి ప్రభావమూ ఉండబోదని అభిప్రాయపడ్డాడు.
అయితే కేవలం కోహ్లీ వద్ద ఉండే ఆప్షన్లపైనే హార్దిక్ బౌలింగ్ ప్రభావం చూపుతుందని, అంతేగానీ జట్టుపై పెద్దగా ప్రభావం ఉండదని చెప్పాడు. అలాగే ఒక గాయం నుంచి కోలుకోవడం కూడా చాలా కష్టమని కపిల్ దేవ్ చెప్పాడు.
నెట్స్‌లో 50-60 బంతులు వేయగలిగితే మ్యాచ్‌లో కూడా బౌలింగ్ చేయగలననే నమ్మకం ఆటగాడికి కలుగుతుందని, లేదంటే చాలా ఇబ్బందిగా ఉంటుందని వివరించాడు.