బుధవారం 27 జనవరి 2021
Sports - Jan 05, 2021 , 02:58:28

కంగారూల కుయుక్తులు!

కంగారూల కుయుక్తులు!

మెల్‌బోర్న్‌ ఓటమితో ఒత్తిడిలో ఆసీస్‌ 

భారత్‌పై కంగారూ మీడియా దుందుడుకు వ్యాఖ్యలు 

సిడ్నీకి ఇరు జట్ల ఆటగాళ్లు 

మైండ్‌గేమ్‌లో ఆరితేరిన ఆస్ట్రేలియా మరోసారి ఆ బుద్ధిని చూపిస్తున్నది. మెల్‌బోర్న్‌లో భారత్‌ చేతిలో ఖంగు తినడంతో తనకు అలవాటైన దారిని ఎంచుకున్నట్టు కనిపిస్తున్నది. టీమ్‌ఇండియా ఏకాగ్రతను దెబ్బతీసేందుకు అక్కడి మీడియాతో పాటు మాజీ ప్లేయర్లు ప్రయత్నిస్తున్నారు. ఓ అభిమాని చేసిన ట్వీట్‌ ఆధారంగా భారత ఆటగాళ్లు నిబంధనలు ఉల్లంఘించారని రచ్చచేసిన ఆసీస్‌ మీడియా.. సిడ్నీ టెస్టు పూర్తి కాకుండానే ఇప్పుడు బ్రిస్బేన్‌ టెస్టుపై పుకార్లు రేకెత్తిస్తున్నది. గబ్బా టెస్టుపై బీసీసీఐ అభ్యంతరం చెప్పలేదని క్రికెట్‌ ఆస్ట్రేలియా అధికారికంగా చెబుతుంటే.. అక్కడ ఆడేందుకు భారత ఆటగాళ్లు భయపడుతున్నారని హాడిన్‌ లాంటి వారు అనడం కంగారూల మైండ్‌గేమ్‌ను తేటతెల్లం చేస్తున్నది. 

సిడ్నీ: మెల్‌బోర్న్‌లో టీమ్‌ఇండియా చేతిలో దిమ్మతిరిగే ఓటమికి గురైన ఆస్ట్రేలియా మైండ్‌గేమ్‌ తీవ్రం చేసింది. ఓ ట్విట్టర్‌ పోస్టును ఆధారంగా చేసుకొని భారత ఆటగాళ్లు బయో బబుల్‌ నిబంధనలు ఉల్లంఘించారని ప్రచారం చేయడం దగ్గరి నుంచి.. బ్రిస్బేన్‌లో ఆడేందుకు రహానేసేన భయపడుతున్నదనే వరకు ఆసీస్‌ మీడియాతో పాటు ఆ దేశ మాజీ ప్లేయర్లు తొందరపడి వ్యాఖ్యలు చేస్తున్నారు. గబ్బా టెస్టుపై టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌ ఎలాంటి నిర్ణయానికి రాకపోయినా.. ఆడేందుకు విముఖంగా ఉందంటూ ప్రచారం చేస్తున్నారు. నాలుగు టెస్టుల సిరీస్‌ ప్రస్తుతం 1-1తో ఉండగా.. ఈ నెల 7 నుంచి సిడ్నీ వేదికగా మూడో టెస్టు జరుగనుంది.  

భారత్‌ ఆడబోమనలేదు: సీఏ 

కఠిన క్వారంటైన్‌ ఉంటే బ్రిస్బేన్‌లో నాలుగో టెస్టు ఆడలేమని టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌ చెప్పిందని వచ్చిన వార్తలను క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) సీఈవో నిక్‌ హ్యాక్లీ ఖండించారు. బీసీసీఐ తమకు పూర్తిగా సహకరిస్తున్నదని, ప్రతీరోజు చర్చించుకుంటున్నామని తెలిపారు. షెడ్యూల్‌ ప్రకారం, అదే వేదికలో మ్యాచ్‌ జరుపాలని రెండు బోర్డులు అనుకుంటున్నాయని అన్నారు. 

ప్యాటిన్‌సన్‌ దూరం 

సిడ్నీ టెస్టుకు ఆస్ట్రేలియా పేసర్‌ జేమ్స్‌ ప్యాటిన్‌సన్‌ దూరమయ్యాడు. పక్కటెముకల గాయంతో అతడు బాధపడుతున్నాడని సీఏ ప్రకటించింది. 

టీమ్‌ఇండియాకు భయం: హాడిన్‌ 

బ్రిస్బేన్‌పై భారత్‌ అభ్యంతరం చెప్పలేదని సీఏ వెల్లడిస్తే.. ఆసీస్‌ మాజీ ప్లేయర్‌ బ్రాడ్‌ హాడిన్‌ నోరుపారేసుకున్నాడు. గబ్బాలో ఆడడమంటే భారత్‌తో పాటు అన్ని జట్లకు భయమేనని అన్నాడు. ఆ స్టేడియంలో ఆసీస్‌కు తిరుగే ఉండదని చెప్పాడు. ‘గబ్బాలో ఆడాలని భారత్‌ ఎందుకు అనుకుంటుంది..? ఆ జట్టుకు అక్కడ విజయమే లేదు. అక్కడ వేరే జట్టు ఆస్ట్రేలియాను ఓడించి చాలా కాలమైంది’ అని హాడిన్‌ అన్నాడు. అలాగే తొలి టెస్టులో  భారత్‌ ఓటమి పాలయ్యాక పలువురు ఆసీస్‌ మాజీలు ైస్థెర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన సంగతి తెలిసిందే. 

బ్రిస్బేన్‌లో పక్కా: లియాన్‌ 

నాలుగో టెస్టు బ్రిస్బేన్‌లోనే ఆడతామనే నమ్మకం తనకు 100 శాతం ఉందని ఆస్ట్రేలియా  స్పిన్నర్‌ నాథన్‌ లియాన్‌ అన్నాడు. అయితే   సిడ్నీ టెస్టుపైనే ప్రస్తుతం పూర్తి ఏకాగ్రత పెట్టానని చెప్పాడు.  అలాగే స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మను కట్టడి చేసేందుకు తమ వద్ద ప్రణాళికలు ఉన్నాయని లియాన్‌ అన్నాడు. 

 వివాదమిదే.. 

కొత్తగా కరోనా కేసులు నమోదవుతుండడంతో క్వీన్స్‌లాండ్‌ ప్రభుత్వం సరిహద్దులను మూసివేసింది. నూతన ఆంక్షలను తెచ్చింది. ఒకవేళ న్యూ సౌత్‌వెల్స్‌లోని సిడ్నీలో మూడో టెస్టు ముగిశాక బ్రిస్బేన్‌కు వెళ్లాలంటే టీమ్‌ఇండియా ఆటగాళ్లు మళ్లీ కఠిన లాక్‌డౌన్‌లో ఉండాల్సి రావొచ్చు. ఐపీఎల్‌ కోసం సెప్టెంబర్‌ నుంచి నిర్బంధంలోనే ఉన్న భారత ప్లేయర్లు మళ్లీ అలాంటి పరిస్థితులకు వెళ్లాలని అనుకోవడం లేదని వాదనలు వినిపించాయి. మరోవైపు నిబంధనలు పాటించాలని అనుకోకపోతే భారత జట్టు బ్రిస్బేన్‌కు రావాల్సిన అవసరం లేదని క్వీన్స్‌ల్యాండ్‌ మంత్రి రోస్‌ బేట్స్‌ అన్నారు. దీంతో గబ్బా టెస్టును భారత్‌ బహిష్కరిస్తుందని లేదా చివరి టెస్టు సైతం సిడ్నీలోనే జరుగుతుందన్న అంచనాలు వెలువడ్డాయి. అయితే బీసీసీఐ ఈ విషయంలో మరింత కాలం ఆలోచించాలని అనుకుంటున్నట్టు సమాచారం. సీఏ సైతం ఈ విషయంపై క్వీన్స్‌లాండ్‌ ప్రభుత్వంతో చర్చించాలని భావిస్తున్నది.

అందరికీ నెగెటివ్‌.. సిడ్నీలో అడుగు  

తాజాగా నిర్వహించిన కరోనా వైరస్‌ పరీక్షలో భారత ఆటగాళ్లతో పాటు సహాయ సిబ్బంది అందరికీ నెగెటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఈ నెల 7 నుంచి జరిగే  మూడో టెస్టు కోసం టీమ్‌ఇండియా బృందం మొత్తం సోమవారం సిడ్నీకి చేరుకుంది. ‘భారత ఆటగాళ్లు, సహాయక సిబ్బంది అందరికీ ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించాం. అందరికీ  నెగెటివ్‌గా తేలింది’ అని బీసీసీఐ సోమవారం ప్రకటించింది. రెస్టారెంట్‌లో అభిమానిని కలిసిన రోహిత్‌ శర్మ, రిషబ్‌ పంత్‌, శుభ్‌మన్‌ గిల్‌, నవ్‌దీప్‌ సైనీ, పృథ్వీషా బయో బబుల్‌ నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపణలు రావడంతో కరోనా పరీక్షల తాజా ఫలితాలను బీసీసీఐ వెల్లడించింది. ఆ ఐదుగురు నిబంధనలు ఉల్లంఘించారా అనే విషయం విచారణ చేస్తామని సీఏ ప్రకటించినా.. రెండు రోజులుగా ఆ ఊసే లేదు. కాగా ఆ ఆటగాళ్లు సైతం మిగిలిన బృందంతోనే సిడ్నీకి చేరుకోవడంతో ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని సీఏ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

25శాతం మంది ప్రేక్షకులు 

న్యూ సౌత్‌వేల్స్‌లో కొత్తగా కరోనా కేసులు నమోదు అవుతుండడంతో సిడ్నీ టెస్టుకు 25శాతం మంది ప్రేక్షకులకే అనుమతివ్వాలని క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) నిర్ణయించింది. దీంతో 38వేల సామర్థ్యం సిడ్నీ మైదానానికి దాదాపు 9,500 మంది హాజరయ్యే అవకాశం ఉంది. ఇక్కడ రెండు పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు 50 శాతం ప్రేక్షకుల మధ్య జరుగగా.. చివరి టీ20కి 30 వేల మంది హాజరయ్యారు. అయితే తాజాగా కరోనా ఆందోళన పెరుగడంతో ప్రేక్షకుల సంఖ్యను సీఏ తగ్గించింది. 


logo