బుధవారం 28 అక్టోబర్ 2020
Sports - Sep 29, 2020 , 21:30:09

IPL 2020:రాణించిన బెయిర్‌స్టో.. సన్‌రైజర్స్‌ స్కోరు 162

IPL 2020:రాణించిన బెయిర్‌స్టో.. సన్‌రైజర్స్‌ స్కోరు 162

అబుదాబి: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-13వ సీజన్‌లో భాగంగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌  సాధారణ  స్కోరుకే పరిమితమైంది.    జానీ బెయిర్‌ స్టో(53: 48 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌),  డేవిడ్‌ వార్నర్‌(45 :33 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు),  కేన్‌ విలియమ్సన్‌(41:  26 బంతుల్లో 5ఫోర్లు) రాణించడంతో   20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.   ఢిల్లీ బౌలర్లలో అమిత్‌ మిశ్రా, రబాడ చెరో రెండు వికెట్లు తీశారు. 

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌  ఇన్నింగ్స్‌ను నిదానంగా ఆరంభించింది. ఓపెనర్లు వార్నర్‌, బెయిర్‌స్టో నిలకడగా ఆడారు.  ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో బ్యాట్స్‌మెన్‌ పరుగులు సాధించేందుకు తీవ్రంగా శ్రమించారు.  6 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్‌ కేవలం 38 పరుగులు మాత్రమే చేసింది.  పవర్‌ ప్లేలో  కేవలం ఒక సిక్స్‌, రెండు ఫోర్లు మాత్రమే నమోదయ్యాయి. వార్నర్‌ దూకుడుగా ఆడే క్రమంలో అమిత్‌ మిశ్రా బౌలింగ్‌లో రివర్స్‌ స్వీప్‌ షాట్‌ ఆడి వెనుదిరిగాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన మనీశ్‌ పాండే కూడా ఎక్కువసేపు నిలువలేదు. మిశ్రా తన  తర్వాతి ఓవర్లో పాండే(3)ను ఔట్‌ చేసి సన్‌రైజర్స్‌కు షాకిచ్చాడు. 

మొదటి నుంచి  సంయమనంతో ఆడిన  ఓపెనర్‌ బెయిర్‌స్టో  అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు.  ఐపీఎల్‌లో అతనికిది నాలుగో హాఫ్‌సెంచరీ కావడం విశేషం.  బెయిర్‌స్టో,  విలియమ్సన్‌ జోడీ జట్టుకు మంచి భాగస్వామ్యాన్ని అందించారు. క్రీజులో కుదురుకున్న బెయిర్‌స్టోను 18వ ఓవర్లో రబాడ ఔట్‌ చేశాడు. చివరి  ఓవర్‌లోనూ పదునైన  బంతులు వేసి భారీ షాట్లు ఆడకుండా అడ్డుకున్నాడు.  పాండే ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన విలియమ్సన్‌  స్ఫూర్తిదాయక ప్రదర్శన చేశాడు.   ఆఖర్లో  రబాడ సంచలన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. 


logo