విశ్వక్రీడల డిస్కస్ త్రోలో ఆశలు రేపిన కమల్‌ప్రీత్ కౌర్ చివరికి ఆరో స్థానంలో నిలిచింది. క్వాలిఫయింగ్ ఈవెంట్లో డిస్క్‌ను 64 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంతో ఫైనల్లో అడుగుపెట్టిన కమల్‌ప్రీత్ సోమవారం పోటీల్లో ఆకట్టుకోలేకపోయింది. వర్షం అంతరాయం మధ్య జరిగిన పోటీలో కమల్‌ప్రీత్ డిస్క్‌ను 63.70 మీటర్ల దూరం విసిరి ఆరో ప్లేస్‌తో సరిపెట్టుకుంది. మొత్తం ఆరు ప్రయత్నాల్లో మూడు సార్లు ఫౌల్ చేసిన కమల్‌ప్రీత్.. తొలి ప్రయత్నంలో డిస్క్‌ను 61.62 మీటర్లు విసిరింది. మూడో ప్రయత్నంలో 63.70 మీటర్ల దూరాన్ని నమోదు చేసినా.. ఇక దాన్ని మెరుగుపర్చలేకపోయింది. ఈ విభాగంలో వలారై అల్మాన్ (68.98 మీటర్లు, అమెరికా), క్రిస్టిన్ పుడెన్జ్ (66.86 మీటర్లు, జర్మనీ), యైమీ పెరెజ్ (65.72 మీటర్లు, క్యూబా) వరుసగా స్వర్ణ, రజత, కాంస్యాలు దక్కించుకున్నారు.