గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Jan 18, 2020 , 03:18:05

రబాడపై వేటు

రబాడపై వేటు

పోర్ట్‌ ఎలిజబెత్‌ : దక్షిణాఫ్రికా స్పీడ్‌స్టర్‌ కగిసో రబాడపై ఓ టెస్టు మ్యాచ్‌ నిషేధం పడింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో చివరిదైన నిర్ణయాత్మక మ్యాచ్‌కు అతడు దూరం కానున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న మూడో టెస్టు తొలి రోజు గురువారం ఆటలో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ను బౌల్డ్‌ చేసిన అనంతరం రబాడ గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకున్నాడు. పిచ్‌పైనే ఉన్న రూట్‌కు అత్యంత సమీపంలో వెళ్లి గట్టిగా అరిచాడు. దీంతో రబాడ చర్యలు ఐసీసీ ప్రవర్తనా నియమావళికి నిరుద్ధంగా ఉన్నాయని నిర్ధారించిన మ్యాచ్‌ రిఫరీ ఆండీ ప్రిక్రాఫ్ట్‌ అతడికి శుక్రవారం ఓ డీమెరిట్‌ పాయింట్‌ను విధించాడు. దీంతో రెండేండ్లలో నాలుగో డీమెరిట్‌ పాయింట్‌ ఖాతాలో పడడంతో రబాడపై ఓ మ్యాచ్‌ నిషేధం పడింది.

స్టోక్స్‌, పోప్‌ శతకాలు

మూడో టెస్టు రెండో రోజైన శుక్రవారం ఓలీ పోప్‌(135నాటౌట్‌), బెన్‌ స్టోక్స్‌(120) శతకాలతో అదరగొట్టడంతో 9వికెట్లకు 499పరుగుల వద్ద ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. సామ్‌ కరన్‌(44) రాణించగా.. 10వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మార్క్‌ ఉడ్‌(23బంతుల్లో 42) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ కేశవ్‌ మహారాజ్‌(5/180) ఐదు వికెట్లతో సత్తాచాటగా.. రబాడకు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా... పీటర్‌ మలన్‌(18), జుబేర్‌ హంజా(10) వికెట్లను కోల్పోయి 60పరుగులు చేసింది. డీన్‌ ఎల్గర్‌(32), నోట్జే(0) క్రీజులో ఉన్నారు. 


logo
>>>>>>