మంగళవారం 31 మార్చి 2020
Sports - Mar 05, 2020 , 00:15:51

సునీల్‌ జోషికే చైర్మన్‌ పీఠం

సునీల్‌ జోషికే చైర్మన్‌ పీఠం
  • మరో సెలెక్టర్‌గా హర్విందర్‌..
  • సెలెక్షన్‌ కమిటీని ఎంపిక చేసిన సీఏసీ

ముంబై: భారత జాతీయ క్రికెట్‌ జట్టు సెలెక్షన్‌ ప్యానెల్‌ చైర్మన్‌గా మాజీ స్పిన్నర్‌ సునీల్‌ జోషికే క్రికెట్‌ సలహాదారు కమిటీ (సీఏసీ) ఓటేసింది. ప్రస్తుతం సౌత్‌జోన్‌ ప్రతినిధిగా ఉన్న ఎమ్మెస్కే ప్రసాద్‌ స్థానంలో కర్ణాటకకు చెందిన జోషిని మదన్‌లాల్‌, ఆర్పీ సింగ్‌, సులక్షణ నాయక్‌లతో కూడిన సీఏసీ బుధవారం ఎంపిక చేసింది. సెంట్రల్‌ జోన్‌ నుంచి గగన్‌ కోడా స్థానంలో మాజీ పేసర్‌ హర్విందర్‌కు అవకాశం దక్కింది. ఐదుగురు సెలెక్టర్ల కమిటీలో ఎమ్మేస్కే, కోడా పదవీకాలం ముగియడంతో దరఖాస్తులను ఆహ్వానించగా మొత్తం 40 మంది ఆసక్తి కనబరిచారు. అనంతరం జోషి, హర్విందర్‌, వెంకటేశ్‌ ప్రసాద్‌, రాజేశ్‌ చౌహాన్‌, లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ పేర్లను సీఏసీ షాట్‌లిస్ట్‌ చేసింది. 


ఇంటర్వ్యూల అనంతరం జోషి, హర్విందర్‌ను ఎంపికచేసినట్లు ప్రకటించింది. మాజీ స్టార్‌ పేసర్‌ అజిత్‌ అగార్కర్‌ దరఖాస్తు చేసినా.. షాట్‌లిస్ట్‌లోనూ అతడికి చోటు చోటుదక్కలేదు. చివరి వరకు రేసులో నిలిచిన మాజీ పేసర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌, శివరామకృష్ణన్‌కు నిరాశే ఎదురైంది. ‘టీమ్‌ఇండియా సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌ పదవికి సునీల్‌ జోషిని సీఏసీ ప్రతిపాదించింది. ఏడాది తర్వాత సభ్యుల పనితీరును సమీక్షించి బీసీసీఐకి సీఏసీ మరోసారి ప్రతిపాదనలు పంపుతుంది’ అని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించాడు. ప్రస్తుతం సెలెక్షన్‌ ప్యానెల్‌లో జతిన్‌ పారాన్‌జపే, దేవాంగ్‌ గాంధీ, సందీప్‌ సింగ్‌ ఉండగా చైర్మన్‌గా జోషి, సభ్యుడిగా హర్విందర్‌ జతకానున్నారు.


అనుభవమిదే..

సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌గా ఎంపికైన సునీల్‌ జోషి అంతర్జాతీయ స్థాయిలో 15 టెస్టులు (41 వికెట్లు), 69 వన్డేలు (69 వికెట్లు) ఆడాడు. హర్విందర్‌ మూడు టెస్టులు, 16 వన్డేల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అంతర్జాతీయ అనుభవం తక్కువగా ఉందని ఎమ్మేస్కే కమిటీ విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో ఎక్కువ అనుభవం ఉన్న అగార్కర్‌ (26 టెస్టులు, 191 వన్డేలు), వెంకటేశ్‌ ప్రసాద్‌ (33 టెస్టులు, 161 వన్డేలు)లలో ఒక్కరికైనా అవకాశం దక్కుతుందని అంచనాలు వెలువడినా చివరికి జోషి, హర్విందర్‌ ఎంపికయ్యారు.


అందరికీ ఒకే ప్రశ్న 


షార్ట్‌లిస్ట్‌ చేసిన ఐదుగురిని సీఏసీ ఓ కామన్‌ ప్రశ్న అడిగింది.‘భారత జట్టుతో ఎంఎస్‌ ధోనీ భవితవ్యంపై మీ నిర్ణయం ఎలా ఉంటుంది?’ అని శివరామకృష్ణన్‌, వెంకటేశ్‌ ప్రసాద్‌, చౌహాన్‌, జోషి, హర్విందర్‌లను ప్రశ్నించింది. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. ధోనీ అంశం ఎంతో కీలకం కావడంతో ఈ ప్రశ్నను సీఏసీ సభ్యు లు ప్రతి ఒక్కరినీ అడిగారని చెప్పారు. కాగా, సెలెక్టర్ల ఎంపికలో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ సహా ఆఫీస్‌ బేరర్లెవరూ కలగజేసుకోలేదని, పూర్తిస్వేచ్ఛనిచ్చారని సీఏసీ సభ్యుడు మదన్‌లాల్‌ స్పష్టం చేశాడు. స్పష్టమైన దృక్పథం ఉన్నందునే జోషి, హర్విందర్‌ను ఎంపిక చేశామని చెప్పాడు.


logo
>>>>>>