గురువారం 03 డిసెంబర్ 2020
Sports - Oct 09, 2020 , 21:23:35

RR vs DC: జోఫ్రా ఆర్చర్‌ అదరగొట్టాడు

RR vs DC: జోఫ్రా ఆర్చర్‌   అదరగొట్టాడు

షార్జా: రాజస్థాన్‌ రాయల్స్‌తో షార్జా వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌  సాధారణ స్కోరే చేసింది.  మార్కస్‌ స్టాయినీస్‌(39: 30 బంతుల్లో 4సిక్సర్లు), హెట్‌మైర్‌(45: 24 బంతుల్లో ఫోర్‌, 5సిక్సర్లు) రాణించడంతో 20 ఓవర్లలో 8 వికెట్లకు 184 పరుగులు చేసింది. రాజస్థాన్‌ బౌలర్ల ధాటికి సగం ఓవర్లకే ఢిల్లీ ప్రధాన బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌ చేరారు. రాజస్థాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌(3/24) ఢిల్లీని బాగా ఇబ్బందిపెట్టాడు. చిన్న మైదానంలో   తన తొలి ఓవర్‌ నుంచే పదునైన బంతులతో ఢిల్లీకి చుక్కలు చూపించాడు.  కార్తీక్‌ త్యాగీ, రాహుల్‌  తెవాటియా కీలక సమయంలో చెరో వికెట్‌ తీసి అలరించారు.     ఈ మ్యాచ్‌లో  అద్భుతంగా పుంజుకున్న  రాజస్థాన్‌  బౌలర్లు ప్రత్యర్థిని సాధారణ స్కోరుకే కట్టడి చేయగలిగారు.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఇన్నింగ్స్‌ను పేలవంగా ఆరంభించింది. ఆర్చర్‌ ధాటికి పవర్‌ ప్లే ముగిసే సమయానికి ఢిల్లీ 51/3తో  పీకల్లోతు కష్టాల్లో పడింది. శిఖర్‌ ధావన్‌(5), పృథ్వీ షా(19) విఫలమయ్యారు.  కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌(22)  కూడా ఎక్కువ సేపు నిలవలేదు.  హార్డ్‌హిట్టర్‌ రిషబ్‌ పంత్‌(9)ను రనౌట్‌ చేసిన రాజస్థాన్‌ మ్యాచ్‌పై పట్టుబిగించింది.    ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచి బౌలర్లు బ్యాట్స్‌మెన్‌ను  కట్టడి చేశారు. ఓవైపు వికెట్లు పడుతున్నా ఢిల్లీ స్కోరు వేగం మాత్రం తగ్గలేదు.  టాపార్డర్‌ పెవిలియన్‌ చేరడంతో స్టాయినీస్‌ కొద్దిసేపు బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లతో చెలరేగడంతో ఢిల్లీ 10 ఓవర్లకు 87 రన్స్‌ చేసింది.

రాహుల్‌ తెవాటియా బౌలింగ్‌లో స్టాయినీస్‌ ఔటవడంతో  ఢిల్లీ భారీ స్కోరు చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. ఆఫ్‌సైడ్‌ వేసిన బంతిని స్టాయినీస్‌ షాట్‌ ఆడగా  కవర్‌ పాయింట్‌లో  స్టీవ్‌స్మిత్‌కు సులువైన క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.    హర్షల్‌ పటేల్‌ వేసిన 16వ ఓవర్లో హెట్‌మైర్‌  ఫోర్‌, సిక్స్‌ బాది స్కోరును 130 దాటించాడు. త్యాగీ వేసిన 17వ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లతో రెచ్చిపోయిన హెట్‌మైర్‌ ఆఖరి బంతికి బౌండరీ వద్ద తెవాటియాకు క్యాచ్‌ ఇచ్చి నిరాశగా పెవిలియన్‌ చేరాడు. ఆఖర్లో అక్షర్‌ పటేల్‌(17) రెండు ఫోర్లు, సిక్సర్‌ బాదడంతో స్కోరు 180 దాటింది.