గురువారం 25 ఫిబ్రవరి 2021
Sports - Feb 06, 2021 , 17:11:38

శతక టెస్టులో రూట్‌ 218.. ఇంగ్లాండ్‌ 555/8

శతక టెస్టులో రూట్‌ 218.. ఇంగ్లాండ్‌ 555/8

చెన్నై: ఆతిథ్య భారత్‌తో తొలి టెస్టు రెండో రోజూ ఆటలోనూ ప్రత్యర్థి ఇంగ్లాండ్‌ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. కెరీర్‌లో వందో టెస్టు ఆడుతున్న కెప్టెన్‌ జో రూట్‌(218: 377 బంతుల్లో 19ఫోర్లు, 2సిక్సర్లు) అద్వితీయ ఆటతీరుతో డబుల్‌ సెంచరీ సాధించి జట్టును పటిష్ఠస్థితిలో నిలిపాడు. శనివారం ఆట ముగిసేసమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 180 ఓవర్లు ఆడిన ఇంగ్లాండ్‌ 8 వికెట్లకు 555 పరుగులు చేసింది. ప్రస్తుతం డొమినిక్‌ బెస్‌(28), జాక్‌ లీచ్‌(6) క్రీజులో ఉన్నారు. టీమ్‌ఇండియా బౌలర్లలో ఇషాంత్‌ శర్మ, బుమ్రా, రవిచంద్రన్‌ అశ్విన్‌, షాబాజ్‌ నదీం తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఆఖరి సెషన్‌లో భారత్‌ 4 వికెట్లు తీసింది. 

రూట్‌ భారత బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ భారీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. రెండో రోజూ   భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. చెపాక్‌ స్టేడియంలో రూట్‌తో పాటు సిబ్లీ(87), బెన్‌స్టోక్స్‌(82) రాణించడంతో ఇంగ్లాండ్‌ అలవోకగా  500 మార్క్‌ చేరుకున్నది.  స్టోక్స్‌ వన్డే తరహాలో బ్యాటింగ్‌ చేశాడు. ఆఖర్లో బట్లర్‌(30) కూడా దూకుడుగా ఆడటంతో జట్టు స్కోరు 500 దాటింది.     

స్పిన్నర్‌   నదీమ్‌ వేసిన 154వ ఓవర్లో రూట్‌ ఎల్బీడబ్లుగా వెనుదిరగడంతో భారత్‌ ఊపిరిపీల్చుకుంది.  అంతకుముందు ఓవర్‌లోనే నిలకడగా ఆడుతున్న ఓలీ పోప్‌(34)ను అశ్విన్‌ పెవిలియన్‌ పంపాడు. 170వ ఓవర్లో ఇషాంత్‌ శర్మ వరుసగా రెండు వికెట్లు పడగొట్టాడు. రెండో బంతికి బట్లర్‌ను బౌల్డ్‌ చేసిన ఇషాంత్‌..తర్వాతి బంతికి జోఫ్రా ఆర్చర్‌ను బౌల్డ్‌ చేశాడు.  ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచి ఇంగ్లీష్‌ ఆటగాళ్లు ఆతిథ్య బౌలర్లను మానసికంగా దెబ్బకొట్టారు. బ్యాట్స్‌మెన్లందరూ సంయమనంతో పక్కా ప్రణాళికతో బౌలర్లపై ఒత్తిడి పెంచుతూ పరుగులు రాబట్టారు.  

VIDEOS

logo