శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Feb 10, 2020 , 02:45:48

జయేశ్‌కు విజయం

జయేశ్‌కు విజయం
  • తెలంగాణ ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడిగా జయేశ్‌ రంజన్‌ ఎన్నిక
  • ప్రత్యర్థి రంగారావుపై 13 ఓట్ల తేడాతో ఘనవిజయం
  • కార్యదర్శిగా జగదీశ్వర్‌యాదవ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: తెలంగాణ ఒలింపిక్‌ సంఘం (టీవోఏ) అధ్యక్షుడిగా ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ఘన విజయం సాధించారు. ప్రత్యర్థి కె.రంగారావుపై ఆయన 13 ఓట్ల ఆధిక్యంతో జయభేరి మోగించారు. నగరంలోని ఎల్బీ స్టేడియం ఒలింపిక్స్‌ భవన్‌లో ఆదివారం తీవ్ర ఉత్కంఠ మధ్య సాగిన టీవోఏ ఎన్నికల్లో 84 ఓట్లకు గాను మొత్తం 81 ఓట్లు పోలయ్యాయి. 


జయేశ్‌ రంజన్‌కు 46 ఓట్లు రాగా, రంగారావుకు 33 మాత్రమే వచ్చాయి. అయితే, క్రాస్‌ఓటింగ్‌ జరుగడంతో మిగిలిన పదవులకు అంచనాలకు విరుద్ధంగా ఫలితాలు వచ్చాయి. మొత్తం 26 పోస్టుల్లో అధ్యక్ష పదవి సహా మరో నాలుగు స్థానాల్లో జయేశ్‌ రంజన్‌ ప్యానెల్‌ విజయం సాధించింది. టీవోఏ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీలో నిలిచిన జయేశ్‌ ప్యానెల్‌ అభ్యర్థి, రాష్ట్ర హ్యాండ్‌బాల్‌ సంఘం అధ్యక్షుడు ఏ.జగన్‌మోహన్‌ రావు విజయం తథ్యమని ముందు నుంచి అందరూ అంచనా వేసినా... ఆయన రెండు ఓట్ల స్వల్ప తేడాతో జగదీశ్వర్‌ యాదవ్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. 


రంగారావు ప్యానెల్‌ అభ్యర్థి జగదీశ్వర్‌కు 41 ఓట్లు పోలవగా.. జయేశ్‌ వర్గాన్ని ముందుండి నడిపించిన జగన్‌మోహన్‌కు 39 ఓట్లు వచ్చాయి. మరో ఓటు చెల్లుబాటు కాలేదు. కోశాధికారి పదవికి సైతం రంగారావు ప్యానెల్‌ తరఫున పోటీలో నిలిచిన నిలిచిన కె.మహేశ్వర్‌ (46 ఓట్లు).. ఫణిరావు (31)పై గెలిచారు. నాలుగు ఓట్లు చెల్లలేదు. ఉపాధ్యక్షులుగా ఎస్‌ వేణుగోపాలాచారి (67 ఓట్లు), రఫత్‌ అలీ (60), ప్రేమ్‌రాజ్‌ (57), సరల్‌ తల్వార్‌ (53) ఎన్నికయ్యారు.


జాయింట్‌ సెక్రటరీలుగా జయేశ్‌ ప్యానెల్‌కు చెందిన ఏ.సోమేశ్వర్‌ (40 ఓట్లు), రంగారావు వర్గానికి చెందిన మల్లారెడ్డి (49), రామకృష్ణ (45), నార్మన్‌ ఇసాక్‌ (63) గెలుపొందారు. రాష్ట్ర క్రీడా సంఘాల ఈసీ సభ్యులుగా అ బ్బాస్‌ కిర్మాణి, దత్తాత్రేయ, మహేందర్‌ రెడ్డి, పురుషోత్తం, రామ కోటేశ్వరరావు, కె.రామకృష్ణ, ఇస్మాయిల్‌ బేగ్‌, హంజా బిన్‌ ఒమర్‌, టి.స్వామి, మహమ్మద్‌ ఖాజా ఖాన్‌ ఎంపికవగా, రాజేంద్ర ప్రసాద్‌, అజీజ్‌ ఖాన్‌, జనార్దన్‌ రెడ్డి, లింగయ్య, మనోహర్‌ జిల్లా ఒలింపిక్‌ సంఘాలకు ఈసీ సభ్యులుగా గెలిచారు.


కోర్టుకెళ్తాం..


టీవోఏ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, ఈ విషయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్టు జయేశ్‌ ప్యానెల్‌ తరఫున ప్రధాన కార్యదర్శిగా పోటీ చేసిన ఏ.జగన్‌మోహన్‌ రావు తెలిపారు. భారత ఒలింపిక్‌ సంఘం (ఐవోఏ) తొలుత 30 సంఘాలకే ఓటు హక్కు ఇవ్వగా.. అందుకు విరుద్ధంగా వాటిని 42కు పెంచారని ఆయన ఆరోపించారు. రిటర్నింగ్‌ అధికారి జస్టిస్‌ బి.చంద్రకుమార్‌పై ఐవోఏకు సైతం ఫిర్యాదు చేయనున్నట్టు జగన్‌మోహన్‌ రావు వెల్లడించారు. టీవోఏకు నెలరోజుల్లోనే మళ్లీ ఎన్నికలు వస్తాయని, తామందరం గెలిచి చూపిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. అధ్యక్షుడిగా ఎన్నికైన జయేశ్‌ రంజన్‌కు జగన్‌మోహన్‌ రావు శుభాకాంక్షలు తెలిపారు.


logo