ఆదివారం 24 జనవరి 2021
Sports - Dec 27, 2020 , 00:18:15

కంగారెత్తించారు

కంగారెత్తించారు

  • బుమ్రా సిరాజ్‌ విజృంభణ 
  • అశ్విన్‌ స్పిన్‌ తంత్రం 
  • ఆస్ట్రేలియా 195 ఆలౌట్‌ 
  • భారత్‌ 36/1 

తొలి టెస్టులో ఘోర పరాజయం తర్వాత.. భారత్‌ దెబ్బతిన్న బెబ్బులిలా విజృంభించింది. అడిలైడ్‌ ఓటమికి బదులు తీర్చుకోవాలనే కసితో.. కంగారూలను క్రీజులో కుదురుకోనివ్వకుండా చేసింది. బుమ్రా బుల్లెట్లకు.. సిరాజ్‌ కచ్చితత్వం.. అశ్విన్‌ వైవిధ్యం తోడవడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే ఆలౌటైంది. బౌలర్ల ప్రదర్శనతో ఆసీస్‌తో చరిత్రాత్మక  వందో టెస్టులో ఆధిక్యంలో నిలిచిన టీమ్‌ఇండియా.. బ్యాటింగ్‌లోనూ ఇదే జోరు కనబరిస్తే సిరీస్‌ సమం చేసే అవకాశం చిక్కినట్లే! 

మెల్‌బోర్న్‌: మొదటి టెస్టులో అవమానకర ఓటమిని అధిగమించి ఎమ్‌సీజీలో భారత జట్టు చక్కటి ప్రదర్శన కనబర్చింది. కోహ్లీ, షమీ వంటి స్టార్లు అందుబాటులో లేకున్నా.. రహానే సారథ్యంలో బౌలర్లు సమిష్టిగా సత్తాచాటడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమ్‌ఇండియా ముందంజలో నిలిచింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 72.3 ఓవర్లలో 195 పరుగులకు ఆలౌటైంది. మార్నస్‌ లబుషేన్‌ (48), ట్రావిస్‌ హెడ్‌ (38), మాథ్యూ వేడ్‌ (30) ఫర్వాలేదనిపించగా.. మిగిలినవాళ్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో బుమ్రా 4, అశ్విన్‌ 3, అరంగేట్రం ఆటగాడు సిరాజ్‌ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన టీమ్‌ఇండియా శనివారం ఆట ముగిసే సమయానికి 11 ఓవర్లలో మయాంక్‌ అగర్వాల్‌ (0) వికెట్‌ కోల్పోయి 36 పరుగులు చేసింది. తొలి టెస్టు ఆడుతున్న శుభ్‌మన్‌ గిల్‌ (28 బ్యాటింగ్‌; 5 ఫోర్లు), చతేశ్వర్‌ పుజారా (7 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. చేతిలో 9 వికెట్లు ఉన్న భారత్‌.. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు ఇంకా 159 పరుగులు వెనుకబడి ఉంది. 

అశ్విన్‌ డబుల్‌ స్ట్రయిక్‌..

మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు శుభారంభం దక్కలేదు. బుమ్రా తన మూడో ఓవర్‌లోనే బర్న్స్‌(0)ను వెనక్కిపంపడంతో ఆసీస్‌ 10 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయింది. దీంతో క్రీజులోకొచ్చిన లబుషేన్‌ వికెట్‌ కాపాడుకునేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వగా.. తొలి చేంజ్‌ బౌలర్‌గా వచ్చిన అశ్విన్‌ మరో వికెట్‌ పడగొట్టాడు. దూకుడుగా ఆడుతున్న వేడ్‌ను బుట్టలో వేసుకోవడంతో పాటు.. తదుపరి ఓవర్‌లో స్మిత్‌ (0)ను డకౌట్‌ చేసి కంగారూలను దెబ్బమీద దెబ్బ కొట్టాడు. జడేజా పట్టిన సూపర్‌ క్యాచ్‌కు వేడ్‌ పెవిలియన్‌ బాట పడితే.. తొలి మ్యాచ్‌లో మాదిరిగానే స్మిత్‌ మరోసారి అశ్విన్‌ మాయాజాలానికి చిక్కి నిరాశగా పెవిలియన్‌ చేరాడు.

ఆదుకున్న లబుషేన్‌, హెడ్‌

టాపార్డర్‌ తడబడటంతో పూర్తిగా డిఫెన్స్‌కు పరిమితమైన లబుషేన్‌.. నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. హెడ్‌ జిడ్డు ఆటతో భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. పాత బంతితో స్వింగ్‌ రాబట్టే సత్తా ఉన్న సిరాజ్‌కు తొలి సెషన్‌లో ఒక్క ఓవర్‌ కూడా ఇవ్వని రహానే లంచ్‌ తర్వాత అతడికి బంతినిచ్చాడు. క్రీజులో కుదురుకున్న అనంతరం లబుషేన్‌, హెడ్‌ బ్యాట్‌కు పనిచెప్పడంతో స్కోరు బోర్డు ముందుకు కదిలింది. నాలుగో వికెట్‌కు 86 పరుగులు జోడించాక హెడ్‌ను బుమ్రా పెవిలియన్‌ పంపగా.. అక్కడి నుంచి సిరాజ్‌ మాయాజాలం మొదలైంది. 

సిరాజ్‌ స్వింగ్‌..

50వ ఓవర్‌లో సిరాజ్‌ క్రీజుకు ఎడం నుంచి విసిరిన బంతికి లబుషేన్‌ ఔటయ్యాడు. స్వింగ్‌ను సరిగ్గా అంచనా వేయలేకపోయిన లబుషేన్‌.. స్కైర్‌ లెగ్‌లో గిల్‌ పట్టిన చక్కటి క్యాచ్‌కు డగౌట్‌ బాటపట్టాడు. టెస్టు క్రికెట్‌లో తొలి వికెట్‌ ఖాతాలో వేసుకున్న ఈ హైదరాబాదీ ఆ తర్వాత మరింత కచ్చితత్వంతో బంతులు విసిరాడు. ఈ క్రమంలోనే కామెరున్‌ గ్రీన్‌ (12)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. గ్రీన్‌ రివ్యూ కోరినా ఫలితం లేకపోయింది. ఇక అక్కడి నుంచి ఆసీస్‌ వేగంగా వికెట్లు కోల్పోయింది. తొలి టెస్టులో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచిన ఆసీస్‌ కెప్టెన్‌ పైన్‌ (13)ను అశ్విన్‌ ఔట్‌ చేయగా.. స్టార్క్‌ (7)ను బుమ్రా పెవిలియన్‌ పంపాడు. లియాన్‌ (20) ఆఖర్లో వేగంగా ఆడి కొన్ని విలువైన పరుగులు జోడించగా.. కమిన్స్‌ (9) వికెట్‌ జడేజా ఖాతాలో చేరింది.రెండు వికెట్లు.. 

రెండు క్యాచ్‌లు..

హైదరాబాద్‌ నుంచి భారత టెస్టు జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రెండో పేసర్‌గా రికార్డుల్లోకెక్కిన సిరాజ్‌.. తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకున్నాడు. రెండో సెషన్‌లో బౌలింగ్‌కు వచ్చిన అతడు ప్రమాదకరమైన లబుషేన్‌ను ఔట్‌ చేయడంతో పాటు కచ్చితత్వంతో కూడిన బంతులతో కంగారూలను కలవరపెట్టాడు. కాసేపటికి గ్రీన్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న సిరాజ్‌.. ఫీల్డింగ్‌లోనూ మెరిశాడు. ప్యాట్‌ కమిన్స్‌, మిషెల్‌ స్టార్క్‌ క్యాచ్‌లు అందుకొని తొలి రోజు ఆటను సంతృప్తికరంగా ముగించాడు.

సిరాజ్‌ @ 298


హైదరాబాదీ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ టీమ్‌ఇండియా తరఫున టెస్టు క్యాప్‌ అందుకున్న 298వ ఆటగాడిగా నిలిచాడు. మెల్‌బోర్న్‌ మ్యాచ్‌లో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన శుభ్‌మన్‌ గిల్‌కు హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి క్యాప్‌ అందించగా.. సిరాజ్‌కు సీనియర్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ క్యాప్‌ ఇచ్చి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పాడు.

స్మిత్‌.. డకౌట్‌


ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ టెస్టు క్రికెట్‌లో నాలుగేండ్ల తర్వాత డకౌటయ్యాడు. 2016 నవంబర్‌ తర్వాత సుదీర్ఘ ఫార్మాట్‌లో ఎప్పుడూ సున్నా చుట్టని స్మిత్‌ను రెండో టెస్టులో ఆశ్విన్‌ ఖాతా తెరవకముందే పెవిలియన్‌ పంపాడు. భారత్‌తో మ్యాచ్‌లో స్మిత్‌ డకౌటవడం ఇదే తొలిసారి. కాగా అశ్విన్‌ బౌలింగ్‌లో ఔటవడం ఇది ఐదోసారి.

జోన్స్‌కు నివాళి..


ఈమ్యాచ్‌కు ముందు ఇరు జట్ల ఆటగాళ్లు.. ఆసీస్‌ మాజీ ప్లేయర్‌ డీన్‌ జోన్స్‌కు నివాళులర్పించారు. ఐపీఎల్‌ 13వ సీజన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ గుండె పోటుతో మృతిచెందిన జోన్స్‌ సొంత మైదానం అయిన ఎమ్‌సీజీలో టీ బ్రేక్‌ సమయంలో అతడి కుటుంబ సభ్యులతో పాటు మాజీ కెప్టెన్‌ బోర్డర్‌ మైదానంలోకి వచ్చారు. జోన్స్‌ వాడిన బ్యాట్‌, క్యాప్‌ను వికెట్ల ముందు పెట్టి శ్రద్ధాంజలి ఘటించారు.

జడ్డూ సూపర్‌..


గత మ్యాచ్‌తో పోలిస్తే.. మెల్‌బోర్న్‌లో టీమ్‌ఇండియా ఫీల్డింగ్‌ మెరుగుపడింది. జడేజా సూపర్‌ క్యాచ్‌తో అభిమానులను అలరించాడు. అశ్విన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌లో ఆసీస్‌ ఓపెనర్‌ మాథ్యూ వేడ్‌ కొట్టిన బంతిని అందుకునేందుకు మిడాన్‌ నుంచి జడేజా.. మిడ్‌వికెట్‌ నుంచి గిల్‌ పరిగెత్తుకొచ్చారు. బంతి తన పరిధిలో ఉందని జడ్డూ వారిస్తున్నా.. గిల్‌ దాన్ని పట్టే ప్రయత్నంలో అతడిని ఢీ కొట్టాడు. అయినా పూర్తి ఏకాగ్రతతో బంతిని ఒడిసిపట్టిన జడ్డూ.. వేడ్‌ను పెవిలియన్‌ పంపాడు.

దశాబ్దం తర్వాత

బాక్సింగ్‌ డే టెస్టులో ఆస్ట్రేలియా జట్టు తొలి రోజే ఆలౌటవడం గత పదేండ్లలో ఇదే ప్రథమం. ఎమ్‌సీజీలో బాక్సింగ్‌ డే టెస్టు ఆడుతూ 2010 తర్వాత ఆసీస్‌ ఒక్కసారి కూడా తొలి రోజే ఇన్నింగ్స్‌ ముగించలేదు. 

పైన్‌ రనౌట్‌పై రచ్చ


ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ రనౌట్‌ నుంచి తప్పించుకోవడం వివాదాస్పదంగా మారింది. 55వ ఓవర్‌లో వికెట్‌ కీపర్‌ పంత్‌ తన గ్లౌజ్‌తో వికెట్లను గిరాటేసే సమయంలో పైన్‌ క్రీజులోకి రాలేకపోయాడు. పలుమార్లు రివ్యూలను పరిశీలించిన థర్డ్‌ అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో భారత, ఆసీస్‌ మాజీలు అంపైరింగ్‌ ప్రమాణాలను తప్పుబట్టారు. ‘సమీక్షలో పైన్‌ను రనౌట్‌గా ప్రకటించకపోవడం ఆశ్చర్యకరం. అది క్లీయర్‌ ఔట్‌'అని షేన్‌ వార్న్‌ వాదిస్తే.. ‘జేసన్‌ హోల్డర్‌ చెప్పినట్లు క్రికెటర్ల లాగే అంపైర్లు కూడా ఎవరినీ కలువకుండా బయో బబుల్‌లో ఉండటం మంచిది’ అని భారత మాజీ ఆటగాడు ఆకాశ్‌ చోప్రా చురకలంటించాడు.

స్కోరు బోర్డు

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: బర్న్స్‌ (సి) పంత్‌ (బి) బుమ్రా 0, వేడ్‌ (సి) జడేజా (బి) అశ్విన్‌ 30, లబుషేన్‌ (సి) గిల్‌ (బి) సిరాజ్‌ 48, స్మిత్‌ (సి) పుజారా (బి) అశ్విన్‌ 0, హెడ్‌ (సి) రహానే (బి) బుమ్రా 38, గ్రీన్‌ (ఎల్బీ) సిరాజ్‌ 12, పైన్‌ (సి) విహారి (బి) అశ్విన్‌ 13, కమిన్స్‌ (సి) సిరాజ్‌ (బి) జడేజా 9, స్టార్క్‌ (సి) సిరాజ్‌ (బి) బుమ్రా 7, లియాన్‌ (ఎల్బీ) బుమ్రా 20, హజిల్‌వుడ్‌ (నాటౌట్‌) 4, ఎక్స్‌ట్రాలు: 14, మొత్తం: 72.3 ఓవర్లలో 195 ఆలౌట్‌. వికెట్ల పతనం:1-10, 2-35, 3-38, 4-124, 4-124, 5-134, 6-155, 7-155, 8-164, 9-191, 10-195, బౌలింగ్‌: బుమ్రా 16-4-56-4, ఉమేశ్‌ 12-2-39-0, అశ్విన్‌ 24-7-35-3, జడేజా 5.3-1-15-1, సిరాజ్‌ 15-4-40-2.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: మయాంక్‌ (ఎల్బీ) 0, గిల్‌ (నాటౌట్‌) 28, పుజారా (నాటౌట్‌) 7, ఎక్స్‌ట్రాలు: 1, మొత్తం: 36/1. వికెట్ల పతనం: 1-0, బౌలింగ్‌: స్టార్క్‌ 4-2-14-1, కమిన్స్‌ 4-1-14-0, హజిల్‌వుడ్‌ 2-0-2-0, లియాన్‌ 1-0-6-0.


logo