ఆదివారం 24 జనవరి 2021
Sports - Jan 12, 2021 , 10:08:45

టీమిండియాకు మ‌రో దెబ్బ‌.. నాలుగో టెస్ట్ నుంచి బుమ్రా ఔట్‌!

టీమిండియాకు మ‌రో దెబ్బ‌.. నాలుగో టెస్ట్ నుంచి బుమ్రా ఔట్‌!

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జ‌రిగిన మూడో టెస్ట్‌ను పోరాడి డ్రాగా ముగించిన టీమిండియాకు ఆ సంతోషం ఎక్కువ‌సేపు నిల‌వ‌లేదు. ప్ర‌స్తుతం టీమ్ బౌలింగ్ భారాన్ని మోస్తున్న జ‌స్‌ప్రీత్ బుమ్రా కూడా గాయ‌ప‌డ్డాడు. ఉద‌ర కండ‌రాలు ప‌ట్టేయ‌డంతో అత‌డు నాలుగో టెస్ట్‌కు దూర‌మ‌య్యాడు. సిడ్నీ టెస్ట్‌లో ఆడుతున్న స‌మ‌యంలోనే బుమ్రా గాయ‌ప‌డ్డాడు. స్కానింగ్ తీయ‌గా.. కండ‌రాలు ప‌ట్టేసిన‌ట్లు తేలింది. ఆ గాయం పెద్ద‌ది కాకుండా చూడాల‌న్న ఉద్దేశంతో నాలుగో టెస్ట్‌కు బుమ్రాను ప‌క్క‌న పెట్టాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో నాలుగు టెస్ట్‌ల సిరీస్ ఉన్న నేప‌థ్యంలో టీమ్ మేనేజ్‌మెంట్ రిస్క్ తీసుకోవాల‌ని అనుకోవ‌డం లేదు. 

50 శాతం ఫిట్‌గా ఉన్నా..

అయితే బుమ్రా క‌నీసం 50 శాతం ఫిట్‌గా ఉన్నా కూడా నాలుగో టెస్ట్‌లో ఆడ‌తాడ‌ని టీమ్ మేనేజ్‌మెంట్ వర్గాలు వెల్ల‌డించిన‌ట్లు ఏఎన్ఐ తెలిపింది. ఆ మ్యాచ్‌కు ముందు మూడు రోజుల విశ్రాంతి దొరుకుతుంద‌ని, ఆ లోపు అత‌డు కోలుకునే అవ‌కాశాలు ఉన్న‌ట్లు టీమ్ వ‌ర్గాలు తెలిపాయి. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు దూర‌మైనా స‌రే.. ఆస్ట్రేలియాపై 2-1తో సిరీస్ గెల‌వ‌డానికి అత‌డిని ఆడించాల‌ని భావిస్తున్న‌ట్లు చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టికే గాయాల కార‌ణంగా స్టార్ పేస్‌బౌల‌ర్లు ష‌మి, ఉమేష్ యాద‌వ్ కూడా దూర‌మైన సంగ‌తి తెలిసిందే. ఇక ఆల్‌రౌండ‌ర్ జ‌డేజా, సిడ్నీ టెస్ట్ హీరో హనుమ విహారి కూడా ఇప్ప‌టికే గాయాల కార‌ణంగా నాలుగో టెస్ట్ ఆడ‌టం లేదు. ఈ నేప‌థ్యంలో బ్రిస్బేన్‌లో ఆడ‌టం టీమిండియాకు క‌త్తిమీద సాము కానుంది. 


logo