బుధవారం 25 నవంబర్ 2020
Sports - Oct 22, 2020 , 21:20:04

హోల్డర్‌ అదుర్స్‌..రాజస్థాన్‌ స్కోరు 154

హోల్డర్‌ అదుర్స్‌..రాజస్థాన్‌ స్కోరు 154

దుబాయ్:‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో  6 వికెట్లకు 154 పరుగులు చేసింది.  బెన్‌ స్టోక్స్‌(30: 32 బంతుల్లో 2ఫోర్లు), సంజూ శాంసన్‌(36: 26 బంతుల్లో 3ఫోర్లు,సిక్స్‌) రాణించడంతో రాజస్థాన్‌ ఆమాత్రం స్కోరైనా చేసింది.  ఆఖర్లో  రియాన్‌ పరాగ్‌(20: 12 బంతుల్లో 2ఫోర్లు, సిక్స్‌) ఫర్వాలేదనిపించాడు. సన్‌రైజర్స్‌ బౌలర్‌ జేసన్‌  హోల్డర్‌(3/33) తెలివైన బంతులతో  ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు.  విజయ్‌ శంకర్‌, రషీద్‌ ఖాన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. 

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన  రాజస్థాన్‌  ఆట సాదాసీదాగా సాగింది. ఆరంభం నుంచే  సన్‌రైజర్స్‌ బౌలర్లు ప్రత్యర్థిని అదుపులో ఉంచారు.స్లో పిచ్‌పై పరుగులు సాధించేందుకు బ్యాట్స్‌మన్‌ తెగ కష్టపడ్డారు.   నాలుగో ఓవర్లోనే ఓపెనర్‌ రాబిన్‌ ఉతప్ప(19) రనౌట్‌ అయ్యాడు.  ఉతప్ప ఔటైన తర్వాత    స్టోక్స్‌,  శాంసన్‌ వీలు చిక్కినప్పుడల్లా ఫోర్లు కొడుతూ స్కోరు బోర్డును నడిపించారు. పవర్‌ప్లే ఆఖరికి రాజస్థాన్‌ 47/1 స్కోరుతో నిలిచింది.హోల్డర్‌ వేసిన 12వ ఓవర్లో సంజు శాంసన్‌(36) బౌల్డ్‌ కాగా.. రషీద్‌ ఖాన్‌ వేసిన తర్వాతి ఓవర్‌ మొదటి బంతికే బెన్‌ స్టోక్స్‌(30) కూడా బౌల్డ్‌ అయ్యాడు.  వీరిద్దరూ 50కి పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

ఈ దశలో క్రీజులోకి వచ్చిన స్టీవ్‌ స్మిత్‌(19), బట్లర్‌(9) పెద్దగా రాణించలేకపోయారు. బట్లర్‌ తీవ్రంగా తడబడ్డాడు.  నటరాజన్‌ వేసిన 18వ ఓవర్లో పరాగ్‌ రెండు ఫోర్లు, సిక్సర్‌ బాది 16 పరుగులు రాబట్టాడు.  ఇన్నింగ్స్‌ను ఘనంగా ముగించాలనుకున్న స్మిత్‌..హోల్డర్‌ వేసిన తర్వాతి ఓవర్‌ మొదటి బంతికే వెనుదిరిగాడు. ఆ తర్వాతి బంతిని వైడ్‌ వేశాడు. రెండో బంతికే దూకుడుగా ఆడుతున్న పరాగ్‌ భారీ షాట్‌ ఆడి వార్నర్‌ చేతికి చిక్కాడు.   సన్‌రైజర్స్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసినా.. ఆఖర్లో  జోఫ్రా ఆర్చర్‌(16: 7 బంతుల్లో ఫోర్‌,సిక్స్‌) చెలరేగడంతో  రాజస్థాన్‌  గౌరవప్రద స్కోరు చేసింది.   బౌలర్ల ధాటికి కనీసం డెత్‌ ఓవర్లలో కూడా జోరుగా ఆడలేకపోయారు.