శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Feb 06, 2020 , 23:25:29

ఫికర్‌ మత్‌ కరోనా

ఫికర్‌ మత్‌ కరోనా

నాలుగేండ్లకోసారి నిర్వహించే విశ్వక్రీడల సంబురం, ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌పై ప్రాణాంతక కరోనా వైరస్‌ ప్రభావం కనిపిస్తున్నది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి వేగంగా ఇతర దేశాలకు విస్తరిస్తున్న నేపథ్యంలో.. అనేక దేశాలు చైనాతో రాకపోకలు నిలిపివేశాయి. ఇలాంటి తరుణంలో టోక్యో ఒలింపిక్స్‌ నిర్వహణపై నీలినీడలు కమ్ముకోగా.. వైరస్‌ ప్రభావం పెద్దగా లేదని విశ్వక్రీడలను యథాతథంగా నిర్వహిస్తామని ఒలింపిక్‌ నిర్వహణ కమిటీ సీఈవో టొషిరో ముటో స్పష్టం చేశారు. ‘వైరస్‌ కంటే భయం త్వరగా వ్యాప్తి చెందుతుంది. మేము ఆ భయాన్ని అణిచివేయాలనుకుంటున్నాం’అని గట్టిగా చెబుతున్న జపాన్‌.. ఒలింపిక్స్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు సన్నాహాలు కొనసాగిస్తున్నది.

  • ఒలింపిక్స్‌ను యథాతథంగా నిర్వహిస్తామంటున్న జపాన్‌

టోక్యో: ‘ఆశే మన మార్గాల్లో వెలుగులు నింపుతుంది’ అనే నినాదంతో ఒలింపిక్స్‌ నిర్వహణకు నడుం కట్టిన జపాన్‌.. ఇప్పుడు కూడా అదే మాట వల్లెవేస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ కలకలం రేపుతున్నా.. ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) దాన్ని మహమ్మారిగా ప్రకటించలేదు. పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు’ అని అంటున్నది. ఈ ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు జపాన్‌ రాజధాని టోక్యోలోని షింజుకు నేషనల్‌ స్టేడియంలో జరగాల్సిన ఒలింపిక్స్‌ను షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహించేందుకు రెడీ అవుతున్నది. ప్రపంచ దేశాలన్నీ చైనాకు రాకపోకలను నిలిపివేస్తున్నా.. దీని ప్రభావం ఎక్కువ రోజులు ఉండదని జపాన్‌ ధీమా వ్యక్తం చేస్తున్నది. చైనాలోని హుబే (వుహాన్‌) కేంద్రంగా విస్తరిస్తున్న ఈ మహమ్మారి వల్ల ఇప్పటి వరకు 560 మంది మృత్యువాతపడగా.. 28 వేల మందికి పైగా వైరస్‌ లక్షణాలతో బాధపడుతున్న విషయం తెలిసిందే.


బాక్సింగ్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ రద్దు

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో క్రీడల నిర్వహణ సాధ్యపడకపోవడంతో ఒలింపిక్‌ బాక్సింగ్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీతో పాటు బ్యాడ్మింటన్‌ పోటీలను నిర్వహించలేమని ఇప్పటికే చైనా చేతులెత్తేసింది. ప్రస్తుతం ఆ దేశంలో యుద్ధ ప్రాతిపదికన దవాఖానాల నిర్మాణం చేపడుతున్నారు. వ్యాధి లక్షణాలతో బాధపడేవారికి ప్రత్యేక చికిత్స అందించేందుకు హాస్పిటల్స్‌ సరిపడక ఇండోర్‌ స్టేడియంలను దవాఖానాలుగా మారుస్తున్నారు. చైనా నుంచి తిరిగి వస్తున్న వారికి అన్ని దేశాలు నకశిఖ పర్యంతం వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నాయి. వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న భారత ప్రభుత్వం.. చైనా నుంచి వచ్చే వారి వీసాలు రద్దు చేసింది. ‘జనవరి 15 తర్వాత చైనా వెళ్లిన విదేశీయులను రోడ్డు, వాయు, సముద్రమార్గాల ద్వారా భారత్‌లోకి వచ్చేందుకు అనుమతించడం లేదు. ఇండో-నేపాల్‌, ఇండో-భూటాన్‌, ఇండో-బంగ్లాదేశ్‌, ఇండో-మయన్మార్‌ సరిహద్దుల నుంచి వచ్చే విదేశీయులను కూడా రానివ్వడం లేదు. ఫిబ్రవరి 5వ తేదీకి ముందు చైనా పౌరులకు జారీ చేసిన అన్ని వీసాలు రెగ్యులర్‌, ఎలక్ట్రానిక్‌, ఈ వీసాలను నిలిపివేస్తున్నాం’అని భారత ఇమ్మిగ్రేషన్‌ అధికారులు గురువారం స్పష్టం చేశారు.


జపాన్‌లోనూ 45 మందికి కరోనా..!

ఒలింపిక్స్‌ జరుగనున్న జపాన్‌లో ఇప్పటివరకు ఒక్క కరోనా మరణం సంభవించకపోయినా.. సుమారు 45 మందికి ఈ వైరస్‌ సోకినట్లు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌పై కూడా అనేక వదంతులు పుట్టుకొస్తున్నాయి. ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం ఒలింపిక్స్‌ జరుగకపోవచ్చు అనేదాక వెళ్లింది చర్చ. దీంతో అప్రమత్తమైన ఒలింపిక్‌ నిర్వహణ కమిటీ గురువారం పలు అంశాలపై స్పష్టత నిచ్చింది. ‘షెడ్యూల్‌ ప్రకారమే ఒలింపిక్స్‌ నిర్వహిస్తాం. వైరస్‌ కంటే భయం త్వరగా వ్యాప్తి చెందుతుంది. ఆ భయాన్ని అణిచివేయాలనుకుంటున్నాం. 


ప్రజలను అనవసర ఆందోళనకు గురిచేయదలుచుకోలేదు. ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా ఒలింపిక్స్‌ నిర్వహించడంలో ఎలాంటి సమస్య లేదు. కరోనా ప్రభావం కేవలం చైనాలోనే ఎక్కువగా ఉంది. 191 కేసులు మాత్రమే చైనా వెలుపల నమోదయ్యాయి. సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) దీనిని మహమ్మారిగా ప్రకటించలేదు. రియో ఒలింపిక్స్‌ సమయంలో జికా వైరస్‌తో పోరాడిన అనుభవం మాకుంది. నిపుణుల సలహాల మేరకు ముందుకు సాగుతాం. డబ్ల్యూహెచ్‌వో సలహాలను కచ్చితంగా పాటిస్తాం’అని ఒలింపిక్స్‌ నిర్వహణ కమిటీ సీఈవో టోషిరో ముటో అన్నారు. మరోవైపు జపాన్‌ ప్రధాని షింజో అబే కూడా ఒలింపిక్స్‌ సన్నాహాలు మామూలుగానే సాగుతాయని వెల్లడించారు. ‘పర్యాటక రంగంపై కరోనా ప్రభావం చూపడం ప్రారంభించింది. ఇంటర్నేషనల్‌ ఒలింపిక్‌ కమిటీ (ఐవోసీ) సహకారంతో ప్రభుత్వం క్రీడలకు సన్నద్ధమవుతున్నది’అని అబే అన్నారు.


logo