శనివారం 27 ఫిబ్రవరి 2021
Sports - Jan 22, 2021 , 11:09:23

టోక్యో ఒలింపిక్స్ ర‌ద్దు.. జ‌పాన్ ప్ర‌భుత్వ నిర్ణ‌యం!

టోక్యో ఒలింపిక్స్ ర‌ద్దు.. జ‌పాన్ ప్ర‌భుత్వ నిర్ణ‌యం!

టోక్యో: ఈ ఏడాది కూడా ఒలింపిక్స్ జ‌రిగే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఒలింపిక్స్‌ను ర‌ద్దు చేయాల‌ని జ‌పాన్ ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. జ‌పాన్ సంకీర్ణ ప్ర‌భుత్వంలోని ఓ సీనియ‌ర్ స‌భ్యుడే ఈ విష‌యాన్ని వెల్ల‌డించిన‌ట్లు ద టైమ్స్ వెల్ల‌డించింది. 2032లో మ‌రోసారి గేమ్స్ నిర్వ‌హ‌ణ హ‌క్కులు సొంతం చేసుకునే ప్ర‌య‌త్నంలో ప్ర‌భుత్వం ఉన్న‌ట్లు ఆ ప‌త్రిక తెలిపింది. అయితే ఈ వార్త‌ల‌పై ఒలింపిక్ గేమ్స్ నిర్వాహ‌కులు మాత్రం స్పందించ‌లేదు. ఈ ఏడాది జులై 23న గేమ్స్ ప్రారంభం కావాల్సి ఉంది. గ‌తేడాదే జ‌ర‌గాల్సిన గేమ్స్‌ను కరోనా కార‌ణంగా ఈ ఏడాదికి వాయిదా వేసిన సంగ‌తి తెలిసిందే. అయితే గేమ్స్ జ‌రుగుతాయా లేవా అన్న‌దానితో సంబంధం లేకుండా తాము  మాత్రం స‌న్నాహ‌కాలు కొన‌సాగిస్తామ‌ని ఆస్ట్రేలియా, అమెరికా ఒలింపిక్ క‌మిటీలు ప్ర‌క‌టించాయి. 

దీనిపై అధికారిక స‌మాచారం ఇంట‌ర్నేష‌న‌ల్ ఒలింపిక్ క‌మిటీ, టోక్యో ఆర్గ‌నైజింగ్ క‌మిటీ, జ‌పాన్ ప్ర‌భుత్వం నుంచి రావాల్సి ఉంటుంద‌ని అమెరికా ఒలింపిక్ క‌మిటీ స్ప‌ష్టం చేసింది. నిజానికి ప్ర‌పంచంలోని ఇత‌ర సంప‌న్న దేశాల‌తో పోలిస్తే జ‌పాన్‌లో క‌రోనా కేసులు త‌క్కువ‌గా న‌మోదైనా.. ఈ మ‌ధ్య మ‌ళ్లీ కేసులు పెర‌గ‌డంతో త‌న స‌రిహ‌ద్దుల‌ను మూసివేసింది. టోక్యోతోపాటు ఇత‌ర ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించారు. ఇక జ‌పాన్‌లోని 80 శాతం మంది గేమ్స్ జ‌ర‌పొద్ద‌నే అభిప్రాయ‌ప‌డ‌టం విశేషం. విదేశాల నుంచి వ‌చ్చే అథ్లెట్లు వైర‌స్‌ను వ్యాపింప‌జేస్తార‌ని జ‌ప‌నీయులు భ‌య‌ప‌డుతున్నారు. అయితే గేమ్స్‌ను ఇప్పుడు ర‌ద్దు చేసినా.. మ‌ళ్లీ వాటిని నిర్వ‌హించే అవ‌కాశం ద‌క్కించుకునేలా వ్యూహాత్మ‌కంగా ఈ ర‌ద్దు నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించాల‌ని జ‌పాన్ ప్ర‌భుత్వం భావిస్తున్న‌ట్లు టైమ్స్ రిపోర్ట్ వెల్ల‌డించింది. 

VIDEOS

logo