ఆదివారం 24 జనవరి 2021
Sports - Dec 19, 2020 , 00:55:14

నార్త్‌ఈస్ట్‌కు తొలి ఓటమి

నార్త్‌ఈస్ట్‌కు తొలి ఓటమి

  • ఐఎస్‌ఎల్‌500వ మ్యాచ్‌

వాస్కో: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఏడో సీజన్‌లో నార్త్‌ ఈస్ట్‌ యునైటెడ్‌ జట్టుకు తొలి పరాయజం ఎదురైంది. శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో జంషెడ్‌పూర్‌ ఎఫ్‌సీ 1-0తో గెలిచి నార్త్‌ఈస్ట్‌ అజేయ యాత్రకు బ్రేకులు వేసింది. ఐఎస్‌ఎల్‌లో ఇది 500వ మ్యాచ్‌ కావడం విశేషం. మ్యాచ్‌లో ఏకైక గోల్‌ను జంషెడ్‌పూర్‌ ఆటగాడు అనికేత్‌  జాదవ్‌ 53వ నిమిషంలో బాదాడు. తొలి అర్ధభాగంలో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డా గోల్‌  నమోదు కాలేదు. 18వ నిమిషంలో ఖాతా తెరిచేందుకు వచ్చిన అవకాశాన్ని నార్త్‌ఈస్ట్‌ ప్లేయర్‌ డ్రిసా సిలా చేజార్చుకున్నాడు. రెండో అర్ధభాగాన్ని దూకుడుగా ప్రారంభించినా నార్త్‌ఈస్ట్‌కు అదృష్టం దక్కలేదు. ఆ తర్వాత జాకీచంద్‌సింగ్‌ బాల్‌ పాస్‌ చేయగా జాదవ్‌ గోల్‌ బాదడంతో జంషెడ్‌పూర్‌ ఆధిక్యం సాధించింది. మరోవైపు ఆ జట్టు గోల్‌ కీపర్‌ టీపీ రహ్నేశ్‌  అద్భుతంగా ఓ పెనాల్టీని అడ్డుకోవడం సహా చివరి వరకు విజయవంతంగా డిఫెండ్‌ చేసుకోవడంతో జంషెడ్‌పూర్‌ విజయం సాధించింది. ఈ ఫలితంతో జంషెడ్‌పూర్‌ పాయింట్ల పట్టికతో ఏడోస్థానానికి చేరగా.. నార్త్‌ ఈస్ట్‌ నాలుగో స్థానంలో కొనసాగుతున్నది.


logo