బుధవారం 27 జనవరి 2021
Sports - Dec 24, 2020 , 02:07:46

గంగూలీ మెరుపులు వృథా

గంగూలీ మెరుపులు వృథా

  • దాదా జట్టుపై జైషా ఎలెవెన్‌ గెలుపు 
  • రెట్రో జెర్సీల్లో ఫ్రెండ్లీ మ్యాచ్‌ ఆడిన మాజీలు 

అహ్మదాబాద్‌: క్రికెట్‌ పాలకుడిగా మారక చాలా కాలం తర్వాత బ్యాట్‌ పట్టిన బీసీసీఐ అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ అర్ధశతకంతో మెరిపించాడు. అయినా కార్యదర్శి జైషా ఎలెవెన్‌ చేతిలో దాదా జట్టుకు 28 పరుగుల తేడాతో పరాజయం ఎదురైంది. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియమైన అహ్మదాబాద్‌లోని మొతెరాలో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఎలెవన్‌, కార్యదర్శి జై షా ఎలెవెన్‌ మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్‌ బుధవారం జరిగింది. ఏజీఎం కోసం అక్కడి వచ్చిన ప్రస్తుత పాలకులు, మాజీ ఆటగాళ్లు రెట్రో జెర్సీల్లో మెరిశారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన జైషా ఎలెవెన్‌ నిర్ణీత 12 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. హెచ్‌సీఏ అధ్యక్షుడు మహమ్మద్‌ అజారుద్దీన్‌ 22 బంతుల్లో 37 పరుగులతో అదరగొట్టగా.. జయ్‌దేవ్‌ షా (16 బంతుల్లో 38) రాణించాడు. గంగూలీ ఓ వికెట్‌ తీసుకున్నాడు. అనంతరం లక్ష్యఛేదనలో సౌరవ్‌ గంగూలీ (32 బంతుల్లో 53; 6 ఫోర్లు, ఓ సిక్స్‌)తో దూకుడుగా ఆడినా మిగిలిన వారు విఫలమయ్యారు. దీంతో 12 ఓవర్లలో దాదా జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 100 పరుగులే చేయగలిగింది. బ్యాటింగ్‌లో విఫలమైనా కార్యదర్శి షా బౌలింగ్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు.

నేడే బీసీసీఐ ఏజీఎం

ఐపీఎల్‌లో రెండు కొత్త జట్లు, ఐసీసీ టోర్నీలకు పన్ను రాయితీ, క్రికెట్‌ కమిటీ ఏర్పాటు అంశాలే ప్రధాన ఎజెండాగా గురువారం ఇక్కడ బీసీసీఐ 89వ వార్షిక సర్వసభ్య సమావేశం జరుగనుంది. అలాగే బీసీసీఐ నూతన ఉపాధ్యక్షుడిగా రాజీవ్‌ శుక్లా బాధ్యతలు చేపట్టనుండగా.. ఐపీఎల్‌ పాలక మండలి సభ్యుడిగా బ్రిజేశ్‌ పటేల్‌ను కొనసాగిస్తూ తీర్మానం జరుగనుంది. అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో రెండు కొత్త జట్లకు అనుమతి ఇచ్చినా 2022 సీజన్‌లోనే అవి రంగప్రవేశం చేయనున్నాయి. 


logo