ఆదివారం 29 మార్చి 2020
Sports - Jan 18, 2020 , 03:31:19

జగన్‌మోహన్‌ రావుకు అరుదైన గుర్తింపు

జగన్‌మోహన్‌ రావుకు అరుదైన గుర్తింపు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: జాతీయ హ్యాండ్‌బాల్‌ సమాఖ్య(హెచ్‌ఎఫ్‌ఐ) ఉపాధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్‌ రావుకు అరుదైన గుర్తింపు లభించింది. దేశంలో ఐపీఎల్‌, ప్రొ కబడ్డీ లీగ్‌ తర్వాత అంతటి ప్రాముఖ్యం పొందిన ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌(పీహెచ్‌ఎల్‌) గవర్నింగ్‌ కౌన్సిల్‌కు చైర్మన్‌గా జగన్‌మోహన్‌ రావు నియమితులయ్యారు. జాతీయ హ్యాండ్‌బాల్‌ సమాఖ్య ఈ మేరకు శుక్రవారం నిర్ణయం తీసుకుంటూ అంతర్జాతీయ సంఘం(ఐహెచ్‌ఎఫ్‌)కు తెలియజేసింది. జగన్‌మోహన్‌ రావు తాజా నియామకం పట్ల తెలంగాణ క్రీడాభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేండ్లుగా హ్యాండ్‌బాల్‌ క్రీడాభివృద్ధికి ఆయన చేస్తున్న సేవలకు గుర్తింపుగా హెచ్‌ఎఫ్‌ఐ ఈ నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు. ప్రతిభ కల్గిన యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ హ్యాండ్‌బాల్‌ అభివృద్ధికి పాటుపడుతున్న జగన్‌మోహన్‌ రావు కృషికి తగిన ప్రతిఫలం దక్కిందని పలువురు పేర్కొన్నారు. మరోవైపు జైపూర్‌ వేదికగా మార్చి 5వ తేదీ నుంచి 25 వరకు జరిగే పీహెచ్‌ఎల్‌ నిర్వహణ బాధ్యతలను ఆయనకు అప్పగించారు. ఈ లీగ్‌లో తెలంగాణ టైగర్స్‌తో పాటు ఢిల్లీ, చెన్నై, లక్నో, ముంబై, బెంగళూరు బరిలోకి దిగుతున్నాయి. పీహెచ్‌ఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ చైర్మన్‌గా ఎంపికైన జగన్‌మోహన్‌ రావుకు హెచ్‌ఎఫ్‌ఐ అధ్యక్షుడు రామ సుబ్రమణి, జనరల్‌ సెక్రెటరీ ఆనందీశ్వర్‌ పాండే ప్రత్యేక అభినందనలు తెలిపారు. 


logo