మంగళవారం 01 డిసెంబర్ 2020
Sports - Oct 29, 2020 , 23:18:47

జడ్డూ మాయ.. ఉత్కంఠపోరులో చెన్నై గెలుపు

జడ్డూ మాయ.. ఉత్కంఠపోరులో చెన్నై గెలుపు

దుబాయ్‌:  ఐపీఎల్‌-13లో  ప్లేఆఫ్‌ రేసులో నిలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌  గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో   పోరాడి ఓడింది. గురువారం  ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన   మ్యాచ్‌లో    చెన్నై సూపర్‌ కింగ్స్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.     173 పరుగుల లక్ష్యాన్ని   చెన్నై 4   వికెట్లు కోల్పోయి ఛేదించింది.    ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌(72: 53 బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లు) అర్ధశతకంతో రాణించగా    అంబటి రాయుడు(38: 20బంతుల్లో 5ఫోర్లు, సిక్స్‌) కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.   

చివరి రెండు ఓవర్లలోనే మ్యాచ్‌ చెన్నై వైపు తిరిగింది. ఫెర్గుసన్‌ వేసిన 19వ ఓవర్లో జడేజా(31 నాటౌట్:‌ 11 బంతుల్లో 2ఫోర్లు, 3సిక్సర్లు) ఫోర్‌, రెండు సిక్సర్లు బాది 20 పరుగులు రాబట్టాడు. ఆఖరి ఓవర్‌లో 10 పరుగులు అవసరం కాగా చివరి రెండు బంతుల్లో  రెండు భారీ సిక్సర్లు కొట్టి చెన్నైకి అద్భుత విజయాన్నందించాడు.  కోల్‌కతా బౌలర్లలో స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి(2/20) కీలక సమయాల్లో వికెట్లు తీసి చెన్నైని కట్టడి చేశాడు.  స్పీడ్‌స్టర్‌ పాట్‌ కమిన్స్‌ రెండు వికెట్లు పడగొట్టాడు.

అంతకుముందు ఓపెనర్‌ నితీశ్‌ రాణా(87: 61 బంతుల్లో 10ఫోర్లు, 4సిక్సర్లు) అద్భుత అర్ధశతకంతో మెరవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5  వికెట్లకు 172 పరుగులు చేసింది. ఆరంభంలో మరో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌(26: 17 బంతుల్లో 4ఫోర్లు), ఆఖర్లో దినేశ్‌  కార్తీక్‌(21 నాటౌట్:‌ 10 బంతుల్లో 3ఫోర్లు)  విజృంభించడంతో కోల్‌కతా పటిష్ఠస్థితిలో నిలిచింది.   చివర్లో ఇయాన్‌ మోర్గాన్‌(15) దూకుడుగా ఆడలేకపోయాడు.   చెన్నై బౌలర్లలో లుంగి ఎంగిడి రెండు వికెట్లు తీయగా సాంట్నర్‌, జడేజా, కర్ణ్‌ శర్మ చెరో వికెట్‌ పడగొట్టారు.