గురువారం 24 సెప్టెంబర్ 2020
Sports - Aug 24, 2020 , 01:20:03

ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో కలిస్‌, లీసా,అబ్బాస్‌

ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో కలిస్‌, లీసా,అబ్బాస్‌

దుబాయ్‌: ప్రతిష్టాత్మక ఐసీసీ హాల్‌ఆఫ్‌ఫేమ్‌లో జహీర్‌ అబ్బాస్‌, జాక్‌ కలిస్‌, లీసా స్థేల్కర్‌కు చోటు దక్కింది. తమదైన ఆటతీరుతో అభిమానులను అలరించడంతో పాటు అనితర సాధ్యమైన రికార్డులు నెలకొల్పిన ఈ ముగ్గురికి ఐసీసీ తగిన గుర్తింపునిచ్చింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఈసారి ఆన్‌లైన్‌లో కార్యక్రమం నిర్వహించారు. ఇందులో అవార్డు గ్రహీతలతో పాటు భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌, షాన్‌ పొల్లాక్‌ పాల్గొన్నారు. ఐసీసీ హాల్‌ఆఫ్‌ఫేమ్‌లో స్థానం దక్కించుకున్న నాలుగో దక్షిణాఫ్రికా క్రికెటర్‌గా కలిస్‌ నిలువగా, పాకిస్థాన్‌ నుంచి అబ్బాస్‌ ఆరో క్రికెటర్‌గా, లీసా..27వ ఆసీస్‌ ప్లేయర్‌గా నిలిచింది. వీరి చేరికతో హాల్‌ఆఫ్‌ ఫేమ్‌ జాబితా 93కు చేరుకుంది. క్రికెట్‌ చరిత్రలో అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్న కలిస్‌.. దక్షిణాఫ్రికాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలందించాడు. 1995-2014 మధ్యకాలంలో సఫారీ జట్టుకు ఆడిన కలిస్‌ టెస్టులు, వన్డేల్లో పదివేలకు పైగా పరుగులతో పాటు వికెట్లు పడగొట్టాడు. భారత్‌లో పుట్టిన స్థేల్కర్‌ ఆసీస్‌ తరఫున వన్డే క్రికెట్‌లో వెయ్యి పరుగులు, 100 వికెట్లు తీసిన తొలి క్రికెటర్‌గా అరుదైన రికార్డు నెలకొల్పింది. దీనికి తోడు ఆసీస్‌ గెలిచిన నాలుగు ప్రపంచకప్‌లలో(2005, 10, 12, 13) లీసా భాగమైంది. మరోవైపు ఆసియా బ్రాడ్‌మన్‌గా పేరొందిన పాక్‌ దిగ్గజం అబ్బాస్‌...100 ఫస్ట్‌క్లాస్‌ సెంచరీలు చేసిన రికార్డు నెలకొల్పాడు. అంతేగాక  అతడి పేరిట ఉన్న వన్డేల్లో హ్యాట్రిక్‌ సెంచరీల రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. 


logo