గురువారం 03 డిసెంబర్ 2020
Sports - Nov 10, 2020 , 21:20:56

చెలరేగిన అయ్యర్‌, పంత్‌..ఇక బౌలర్లపైనే భారం

చెలరేగిన అయ్యర్‌, పంత్‌..ఇక బౌలర్లపైనే భారం

దుబాయ్: ఐపీఎల్‌-13వ సీజన్‌ తుదిపోరులో మొదట బ్యాటింగ్‌ చేసిన  ఢిల్లీ క్యాపిటల్స్‌ పోరాడే స్కోరు చేసింది.   ముంబై ఇండియన్స్‌తో ఫైనల్‌ మ్యాచ్‌లో కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్(65 నాటౌట్‌: 50 బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లు)‌, రిషబ్‌  పంత్‌(56: 38 బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లు) అర్ధశతకాలతో రాణించడంతో 20 ఓవర్లలో  ఢిల్లీ 7 వికెట్లకు 156 పరుగులు చేసింది. 

ఒకానొక దశలో 22/3తో  పీకల్లోతు  కష్టాల్లో పడ్డ జట్టును ఈ జోడీ ఆదుకున్నది.    వీరిద్దరూ స్ఫూర్తిదాయక ప్రదర్శనతో  నాలుగో వికెట్‌కు 96 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.  ఆరంభంలో టాప్‌ ఆర్డర్‌ను స్వల్ప స్కోరుకే పెవిలియన్‌ పంపిన ముంబై బౌలర్లు డెత్‌ ఓవర్లలోనూ కట్టుదిట్టంగా బంతులేస్తూ స్కోరు వేగానికి అడ్డుకట్ట వేశారు.  స్పీడ్‌స్టర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌(3/30) ఢిల్లీని బాగా దెబ్బతీశాడు. ఆఖర్లో నాథన్‌ కౌల్టర్‌ నైల్‌(2/29), జయంత్‌ యాదవ్‌(1/25) బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టారు. హెట్‌మైర్‌(5) విఫలమయ్యాడు. 

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.  ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ మొదటి బంతికే మార్కస్‌ స్టాయినీస్(0)‌.. వికెట్‌ కీపర్‌  డికాక్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.  మళ్లీ బౌల్ట్‌ తన తర్వాతి ఓవర్లో రహానె()2ను పెవిలియన్‌ పంపాడు. జయంత్‌ యాదవ్‌ వేసిన నాలుగో ఓవర్లో సూపర్‌ ఫామ్‌లో ఉన్న శిఖర్‌ ధావన్(15)‌ బౌల్డ్‌ అయ్యాడు. దీంతో ఢిల్లీ 22  పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది.    ఈ దశలో క్రీజులో ఉన్న  అయ్యర్‌, రిషబ్‌ పంత్  ఇన్నింగ్స్‌ను  చక్కదిద్దారు.  

కృనాల్‌ పాండ్య వేసిన 10వ ఓవర్లో పంత్‌ రెండు భారీ సిక్సర్లు బాది 16 పరుగులు రాబట్టాడు.  వీరిద్దరూ  స్ట్రైక్‌ రొటేట్‌ చేస్తూ  స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో  13 ఓవర్లకు 93/3తో నిలిచింది.  దూకుడు కొనసాగించిన జోడీ అర్ధశతకాలు పూర్తి చేసుకున్నారు. కౌల్టర్‌నైల్‌ వేసిన 15వ ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదిన పంత్‌ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు.   అదే ఓవర్‌ ఆఖరి బంతికి   పెవిలియన్‌ చేరాడు.  బుమ్రా వేసిన 16వ ఓవర్లో అయ్యర్‌ 40 బంతుల్లో హాఫ్‌సెంచరీ సాధించాడు.  చివరి ఓవర్లలో ముంబై బౌలర్లు ధాటిగా బౌలింగ్‌ చేశారు. అయ్యర్‌ క్రీజులోనే ఉన్నా    భారీ షాట్లు ఆడకుండా కట్టడి చేయడంతో ఢిల్లీ 160లోపే పరిమితమైంది.