ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Sports - Aug 09, 2020 , 16:37:59

ఆ కంపెనీ తప్పుకోవడం వల్ల ప్రభావం లేదు : గంగూలీ

ఆ కంపెనీ తప్పుకోవడం వల్ల ప్రభావం లేదు : గంగూలీ

ముంబై : చైనా మొబైల్ కంపెనీ నుంచి ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ ఒప్పందాన్ని నిలిపివేయడం వల్ల ఏమాత్రం ప్రభావం ఉండబోదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డారు. ఇది బీసీసీఐ ఆర్థిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయలేదని చెప్పారు. ఆదివారం ఆయన వెబ్‌నార్‌లో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు.

ఈ ఏడాది వివో నుంచి ఐపీఎల్‌కు టైటిల్ స్పాన్సర్‌షిప్ ఒప్పందాన్ని విడగొట్టాలని బీసీసీఐ గురువారం నిర్ణయించింది. భారత్-చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో దేశవ్యాప్తంగా చైనా కంపెనీలను బహిష్కరించాలనే డిమాండ్ ముందుకొచ్చింది. బీసీసీఐ పునాది చాలా బలంగా ఉందని గంగూలీ అన్నారు. ఆటగాళ్ళు, నిర్వాహకులు గత కొన్నేండ్లుగా ఆటను చాలా బలంగా చేశారని, బీసీసీఐ ఇలాంటి చిన్న ఎదురుదెబ్బలను సులభంగా తట్టుకోగలదన్నారు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవటానికి బీసీసీఐ వద్ద ఇప్పటికే ప్లాన్-బీ సిద్ధంగా ఉన్నదని చెప్పారు. 

వివో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ ఒప్పందాన్ని 2018 లో ఏదేండ్లకు రూ.2190 కోట్లకు సొంతం చేసుకున్నది. ఈ ఒప్పందం 2022 లో ముగియనున్నది. ఈ ఒప్పందం ప్రకారం వివో ప్రతి ఏడాది బీసీసీఐకి రూ.440 కోట్లు చెల్లిస్తుంది. ఈ డబ్బులో సగం మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీలకు సమానంగా పంపిణీ చేస్తారు. దాంతో ప్రతి ఫ్రాంచైజీకి ఏటా రూ.27.5 కోట్లు వస్తాయి. ఇలాంటి పరిస్థితిలో ఒప్పందం రద్దు చేయడం వల్ల అన్ని ఫ్రాంచైజీలు నష్టపోతాయి.

కాగా, ఐపీఎల్ కొత్త టైటిల్ స్పాన్సర్ రేసులో బైజు, అమెజాన్, రిలయన్స్ జియో, కోకా కోలా ఇండియా ఉన్నాయి. అయితే, కరోనా కారణంగా కంపెనీలు ప్రస్తుతం ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. అలాంటి పరిస్థితిలో కొత్త ఒప్పందం చేసుకోవడం ద్వారా బోర్డు రూ.440 కోట్లు పొందడం కష్టమైన పనే. బైజు ఇప్పటికే టీమ్ ఇండియాకు స్పాన్సర్ గా ఉన్నది. ఇటీవల పెట్టుబడిదారుల నుంచి ఈ కంపెనీ రూ.3700 కోట్లు వసూలు చేసింది. ఈ ఒప్పందం కోసం కంపెనీ రూ.300 కోట్లు కేటాయించినట్లు బైజు అధికారి ఒకరు తెలిపారు. కోకాకోలా ఇండియా కూడా క్రికెట్‌లో నిరంతరం పెట్టుబడులు పెట్టాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.


logo