సోమవారం 06 ఏప్రిల్ 2020
Sports - Mar 19, 2020 , 23:45:18

వాయిదానే ఉత్తమం

వాయిదానే ఉత్తమం

-ఒలింపిక్స్‌పై గోపీచంద్‌ వ్యాఖ్య.. ఆల్‌ ఇంగ్లండ్‌ టోర్నీ జరుపడం తప్పే 

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ సంక్షోభం పెరుగుతుండడంతో టోక్యో ఒలింపిక్స్‌ను వాయిదా వేయడమే మంచిదని బ్యాడ్మింటన్‌ జాతీయ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ అభిప్రాయపడ్డాడు. ఐవోసీ త్వరగా నిర్ణయాన్ని ప్రకటిస్తే అందరూ కాస్త ఉపశమనం తీసుకునేందుకు అవకాశం ఉంటుందని గురువారం ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ‘ఒలింపిక్స్‌ నిర్వహణపై నాకు అనుమానాలు ఉన్నాయి. విశ్వక్రీడలకు మరీ ఎక్కువ సమయం లేదు. ఇప్పటికే ఏర్పాట్లు మొదలయ్యాయి. అందుకే తక్షణమే ఐవోసీ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ప్రస్తుతం ఆరోగ్యంపై ఆందోళనలు, ప్రయాణాలపై ఆంక్షలు ఉన్నాయి. ప్రపంచమంతా ఆరోగ్యం, ప్రజల రక్షణ గురించి ఆలోచిస్తున్నది. అందుకే ఈ పరిస్థితుల్లో ఒలింపిక్స్‌ను వాయిదా వేయడమే ఉత్తమం’అని గోపీచంద్‌ చెప్పాడు. ఓ వైపు కరోనా ప్రభావం ఉన్నా షట్లర్ల ఆరోగ్యాలను ఫణంగా పెట్టి బర్మింగ్‌హామ్‌లో ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌ నిర్వహించడం బీడబ్ల్యూఎఫ్‌ చేసిన తప్పిదమని అన్నాడు. ఒలింపిక్స్‌ క్వాలిఫికేషన్‌ గడువు పొడగింపు అంశం సంక్లిష్టంగా ఉందని, అయితే అందరికీ సమాన అవకాశాలు వచ్చేలా బీడబ్ల్యూఎఫ్‌ చర్యలు తీసుకోవాలన్నాడు. ప్రస్తుతం షట్లర్లు ఇంట్లోనే ఉంటూ ఫిట్‌నెస్‌పై దృష్టిసారించాలని గోపీచంద్‌ సూచించాడు. 


logo