శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Sports - Jan 27, 2020 , 00:28:19

భారతరత్న నా కల: మేరీ కోమ్‌

భారతరత్న నా కల: మేరీ కోమ్‌

న్యూఢిల్లీ: దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న సాధించడమే తన కల అని ఆరుసార్లు ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌ మేరీ కోమ్‌ చెప్పింది. పద్మ విభూషణ్‌ దక్కించుకున్న తొలి క్రీడాకారిణిగా చరిత్రకెక్కిన మేరీ.. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం ద్వారా తన స్వప్నాన్ని నెరవేర్చుకోవాలని ఆశిస్తున్నట్టు ఆదివారం తెలిపింది. ‘భారతరత్న సాధించడం నా కల. ఈ అవార్డు (పద్మ విభూషణ్‌) వల్ల మరింత స్ఫూర్తి పొందా. భారతరత్న సాధించగలనన్న నమ్మకం పెరిగింది. క్రీడారంగంలో సచిన్‌కు మాత్రమే ఆ పురస్కారం దక్కింది. క్రీడా విభాగంలో భారతరత్న దక్కించుకున్న రెండో వ్యక్తిగా, తొలి మహిళగా నిలుస్తానని నమ్మకంతో ఉన్నా. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించి, స్వర్ణం చేజిక్కించుకుంటే నాకు భారతరత్న వస్తుందని ఆశిస్తున్నా’ అని మేరీ కోమ్‌ చెప్పింది. పద్మశ్రీ పురస్కారం దక్కడంపై భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్‌ రాణి రాంపాల్‌  సంతోషం వ్యక్తం చేసింది. ఈ అవార్డు స్వీకరించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని పేర్కొంది. 


ఫోగట్‌ అసంతృప్తి

పద్మ అవార్డుల ఎంపికపై భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గి.. టోక్యో ఒలింపిక్స్‌ పతకమే లక్ష్యంగా కఠోర సాధన సాగిస్తున్న వినేశ్‌.. అవార్డులకు ఎంపిక చేస్తున్న జ్యూరీ తీరుపై పెదవి విరిచింది. ‘క్రీడారంగంలో సత్తాచాటిన వారికి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాదీ అవార్డులు ఇస్తూనే ఉంది. ఆటగాళ్లకు పురస్కారాలు ఉత్తేజాన్నిస్తాయి. అయితే ప్రస్తుతం ఆటలో కొనసాగుతూ చక్కటి ప్రదర్శన కనబరుస్తున్న వారిని ఎంపిక చేయకపోవడం ఏంటో అర్థం కావడంలేదు. ప్రతిసారీ ఇలాగే జరుగుతున్నది. ఈ ఏడాది కూడా పురస్కారాల జాబితా అందుకు భిన్నంగా ఏమీ లేదు. అసలు అవార్డుల ఎంపిక ప్రక్రియను ఎలా నిర్వహిస్తున్నారనే స్పష్టత లేదు. జ్యూరీలో ప్రస్తుత అథ్లెట్లెవరైనా ఉన్నారా.. కనీసం మాజీలెవరైనా ఉన్నారా? మొత్తానికి మాత్రం ఈ ప్రక్రియ అంత సబబుగా అనిపించడం లేదు’ అని వినేశ్‌ పేర్కొంది. 


అబ్బాయిలతో ఆడేందుకు పేరు మార్చుకున్నా ..


అబ్బాయిలతో కలిసి ఫుట్‌బాల్‌ ఆడేందుకు తొమ్మిదేండ్ల వయసప్పుడు బోబో, అమ్కో అని పేర్లు మార్చుకున్నానని పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్‌ ఒనియమ్‌ బెంబెం దేవి చెప్పింది. ఒకవేళ తన అసలు పేరును చెబితే బాలిక అనే కారణంతో కలిసి ఆడనిచ్చేవారు కాదని, అందుకే అలా చెప్పేదాన్నని ఆమె తెలిపింది. తనకు లభించిన పద్మశ్రీ అవార్డు వల్ల మరింత మంది బాలికలు స్ఫూర్తి పొంది ఫుట్‌బాల్‌ వైపు అడుగులేస్తారని ఆమె ఆకాంక్షించింది.


logo