బుధవారం 01 ఏప్రిల్ 2020
Sports - Feb 29, 2020 , 00:22:44

పృథ్వీ ఫిట్‌.. ఇషాంత్‌ డౌట్‌!

 పృథ్వీ ఫిట్‌.. ఇషాంత్‌ డౌట్‌!
  • నేటి నుంచి న్యూజిలాండ్‌తో భారత్‌ రెండో టెస్టు
  • జోరుమీదున్న కివీస్‌..
  • ఒత్తిడిలో కోహ్లీసేనతెల్లవారుజామున
  • 4.00 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో

క్రైస్ట్‌చర్చ్‌: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో అప్రతిహతంగా దూసుకెళ్తున్న టీమ్‌ఇండియాకు న్యూజిలాండ్‌తో మొదటి టెస్టులో భారీ షాక్‌ తగిలింది. పరీక్ష పెట్టిన పచ్చిక పిచ్‌పై మన బ్యాట్స్‌మెన్‌ ఘోరంగా విఫలమవడంతో.. కోహ్లీసేన అనూహ్య పరాజయం చవి చూసింది. దీంతో 0-1తో వెనుకబడ్డ భారత్‌ శనివారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టులోనైనా నెగ్గి సిరీస్‌ సమం చేయాలని భావిస్తున్నది. ప్రాక్టీస్‌ సెషన్‌లో గాయపడ్డ యువ ఓపెనర్‌ పృథ్వీ షా ఫిట్‌నెస్‌ సాధించగా.. జోరుమీదున్న ఇషాంత్‌ శర్మ మ్యాచ్‌ ఆడటం అనుమానంగా మారింది. పాత గాయం తిరగబెట్టడంతో శుక్రవారం ప్రాక్టీస్‌ సెషన్‌ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న లంబూ బరిలో దిగడం డౌటే. ఉమేశ్‌, సైనీల్లో ఒకరు అతడి స్థానాన్ని భర్తీ చేయొచ్చు. గత మ్యాచ్‌తో పోల్చుకుంటే హెగ్లే ఓవల్‌లో మరింత పచ్చికతో కూడిన పిచ్‌ టీమ్‌ఇండియాకు స్వాగతం పలుకనుండటం కలవరపెట్టే అంశం. 


మరి స్వింగ్‌, బౌన్స్‌కు సహకరించే వికెట్‌పై మనవాళ్ల బ్యాటింగ్‌ ఎలా సాగుతుందనేదానిపైనే ఈ మ్యాచ్‌లో భారత్‌ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఈ పర్యటనలో పెద్దగా రాణిం చలేకపోయిన కోహ్లీ చెలరేగాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆశిస్తున్నది. శుక్రవారం శిక్షణలో భాగంగా స్ట్రెంన్త్‌ అండ్‌ కండీషనింగ్‌ కోచ్‌ నిక్‌ వెబ్‌ పర్యవేక్షణలో మనవాళ్లు ‘టర్బో టచ్‌' అనే కొత్త పద్ధతిలో ప్రాక్టీస్‌ చేశారు. మరోవైపు ఇప్పటికే ట్రెంట్‌ బౌల్ట్‌, టిమ్‌ సౌథీ, జెమీసన్‌, గ్రాండ్‌హోమ్‌తో పటిష్ఠంగా ఉన్న బ్లాక్‌క్యాప్స్‌ బౌలింగ్‌ లైనప్‌నకు వాగ్నర్‌ కూడా తోడవతుండటం న్యూజిలాండ్‌కు మరింత ఉత్సాహాన్నిస్తున్నది. అయితే కాస్తో కూస్తో స్పిన్‌కు సహకరించే పిచ్‌పై న్యూజిలాండ్‌ నలుగురు పేసర్లతో బరిలో దిగుతుందా చూడాలి.


తుది జట్లు (అంచనా)

భారత్‌: కోహ్లీ (కెప్టెన్‌), మయాంక్‌, పృథ్వీ షా, పుజారా, రహానే, విహారి, పంత్‌, అశ్విన్‌/జడేజా, ఇషాంత్‌/ఉమేశ్‌, షమీ, బుమ్రా.

న్యూజిలాండ్‌: విలియమ్సన్‌ (కెప్టెన్‌), లాథమ్‌, బ్లండెల్‌, టేలర్‌, నికోల్స్‌, వాట్లింగ్‌, గ్రాండ్‌హోమ్‌, జెమీసన్‌/ఎజాజ్‌ పటేల్‌, సౌథీ, వాగ్నర్‌, బౌల్ట్‌.


పిచ్‌, వాతావరణం

హెగ్లే ఓవెల్‌ పిచ్‌ పూర్తిగా పచ్చికతో నిండిపోయి కనిపిస్తున్నది. ఫీల్డ్‌కు వికెట్‌కు తేడాతెలియనంతగా 12 మిల్లీమీటర్ల గడ్డితో నిండి ఉంది. ఇదే అంశాన్ని ట్విట్టర్‌ వేదికగా ప్రస్తావించిన బీసీసీఐ.. మైదానం ఫొటో పోస్ట్‌ చేసి ఇందులో పిచ్‌ ఎక్కడుందో గుర్తించండి అని వ్యాఖ్యపెట్టింది. వేగంగా వీచే గాలుల మధ్య సీమర్లు వికెట్ల పండుగ చేసుకునే అవకాశం ఉంది. 


logo
>>>>>>