బుధవారం 23 సెప్టెంబర్ 2020
Sports - Jul 30, 2020 , 23:17:07

ఇదెక్కడి న్యాయం: పీసీబీపై కనేరియా ఆగ్రహం

ఇదెక్కడి న్యాయం: పీసీబీపై కనేరియా ఆగ్రహం

కరాచీ: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)పై ఆ దేశ మాజీ స్పిన్నర్​, ఫిక్సింగ్ ఆరోపణలతో జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న దానిష్ కనేరియా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశాడు. అవినీతి నిరోధక నిబంధనలు ​ఉల్లంఘించి, దోషిగా తేలిన  పాక్ ఆటగాడు ఉమర్ అక్మల్​పై తొలుత మూడేండ్ల నిషేధం విధించిన పీసీబీ.. తాజాగా దాన్ని 18నెలలకు తగ్గించింది. ఈ విషయంపై కనేరియా స్పందించాడు. పారదర్శకత అంటే ఇదేనా అంటూ పీసీబీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. నిబంధనలు తనకే వర్తిస్తాయా అని గురువారం ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించాడు. పీసీబీ తన పట్ల వివక్ష చూపిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

“అవినీతిని ఉపేక్షించకపోవడం అంటే ఇదేనా? దానిష్ కనేరియాకు మాత్రమే బోర్డు అవినీతి నిరోధక పాలసీలు వర్తిస్తాయా? నా కేసు ఈసీబీ పరిధిలో ఉందని తరచూ చెబుతుంటారు. నేను పాకిస్థాన్ సెంట్రల్ కాంట్రాక్టు ఆటగాడిగా అప్పుడు ఉన్నా. అయినా జీవితకాల నిషేధం విధించారు. నాపై ఈసీబీ కాదు.. పీసీబీ నిషేధం వేటు వేసింది. నేను మతం అంశాన్ని వాడుకుంటున్నానని వారు తరచూ అంటున్నారు. అయితే ఈ భేదాలు, విభిన్న ప్రమాణాలు ఎందుకు అవలంభిస్తున్నారు?  నేను ఎప్పుడూ మతాన్ని వాడుకోవాలనుకోలేదు. కానీ పీసీబీ తరచూ చేస్తున్న పనుల వల్ల ఏదో తప్పు జరుగుతున్నదని నాకు అనిపిస్తున్నది. అసలు కనేరియా కోసం పీసీబీ ఏం చేసింది?. పీసీబీ ఎప్పుడూ నాకు మద్దతునివ్వలేదు. నేను పాకిస్థాన్​ తరఫున 60 మ్యాచ్​లు ఆడా. పదేండ్లు దేశం కోసం బరిలోకి దిగా. కానీ నా విషయానికి వచ్చే సరికి పీసీబీ మౌనంగా ఉండడానికి కారణాలేంటో తెలియడం లేదు” అని కనేరియా ఆవేదన వ్యక్తం చేశాడు.

2009 కౌంటీ క్రికెట్​లో స్పాట్​ ఫిక్సింగ్​కు పాల్పడ్డాడని రుజువవడంతో కనేరియాపై జీవితకాల నిషేధం పడింది. ఆ తర్వాత నిషేధం ఎత్తేయాలని ఎన్నిసార్లు కోరినా పీసీబీ స్పందించలేదు. దీంతో తన పట్ల పీసీబీ వివక్ష చూపిస్తున్నదని చాలాసార్లు అతడు విమర్శించాడు. హిందువునైన తాను పాక్ జట్టులోని కొందరు సభ్యుల నుంచి వివక్షను ఎదుర్కొన్నానని గతంలో దానిష్​  కనేరియా చెప్పిన సంగతి తెలిసిందే.  


logo